మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Dec 14, 2020 , 00:21:28

పోటెత్తిన యాదాద్రి

పోటెత్తిన యాదాద్రి

  • కిటకటలాడిన ఆలయ తిరువీధులు
  • కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు 
  • ఉత్సవమూర్తులకు అభిషేకం 
  • వైభవంగా వ్రత పూజలు 

ఆలేరు: యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులు తీరిన భక్తులతో సముదాయాలు, మొక్కుపూజల నిర్వహణతో మండపాలు కిక్కిరిసిపోయాయి. కార్తిక మాసం చివరి రోజుతోపాటు ఆదివారం సెలవు కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో యాదాద్రి మరోసారి పోటెత్తింది. ఎటు చూసినా.. క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులే కనిపించారు. కొండ కిందగల కల్యాణకట్ట, కొండపైన ప్రసాదాల విక్రయశాల, తిరు వీధులు భక్తులతో సందడిగా మారా యి. ఉదయం స్వామివారికి తలనీలాలు సమర్పించి  స్నాన మాచరించిన భక్తులు క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిని దర్శించుకుని  పూజలు చేశారు.  కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూ కట్టారు. రోడ్లుపూర్తిగా వాహనాలతో నిండిపోయింది. పార్కింగ్‌లో స్థలం లేకుండా వాహ నదారులు ఇక్కట్లు పడ్డారు. రద్దీ దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించలేదు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.   

ఆర్జిత పూజల కోలాహలం

ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు  లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు.  సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. రోజూ నిర్వహించే నిత్యకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.  లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతును జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతును నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా దర్శనాలు కొనసాగాయి. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు. రూ. 100 టికెట్‌పై బాలాలయం ముఖ మండపంలో 10 నిమిషాల పాటు పూజలో పాల్గొనే ఈ పూజలకు ఆదరణ పెరుగుతున్నది.  పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. 

వైభవంగా వ్రత పూజలు

యాదాద్రి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు.  సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి.  సత్యనారాయణుడిని ఆరాధిస్తూ పూజలు నిర్వహించారు.  

 రూ. 40,84,610 ఆదాయం 

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి భారీ ఆదాయం సమకూరింది. కార్తిక మాసం చివరిరోజుతో పాటు ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీవారి ఖజానాకు రూ. 40,84,610 ఆదాయం సమకూరింది. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 5,97,972, రూ. 100 దర్శనాల ద్వారా  రూ. 28,200, రూ. 150 దర్శనాల ద్వారా రూ.5,25,000, ప్రచారశాఖ ద్వారా రూ. 10, 300,  క్యాలెండర్ల ద్వారా రూ. 32,500, వ్రతాల ద్వారా రూ. 5,37,000, కల్యాణకట్ట ద్వారా రూ. 51,920, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 12,72,000, శాశ్వత పూజల ద్వారా రూ. 25, 116, వాహనపూజల ద్వారా రూ. 24,500, టోల్‌ గేట్‌ ద్వారా రూ. 5,050, అన్నదాన విరాళం ద్వారా రూ. 20,412, ఇతర విభాగాలు రూ. 9,54,640లతో కలిపి రూ. 40,84,610 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. 

VIDEOS

logo