గురువారం 04 మార్చి 2021
Yadadri - Dec 13, 2020 , 00:03:07

స్వచ్ సంపద

స్వచ్ సంపద

  • చెత్త నుంచి ఆదాయం సృష్టి

చెత్త పనికిరాని పదార్థం... కంపు కొట్టే వ్యర్థం... ఇదంతా గతం. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో మాత్రం చెత్త..సంపద సృష్టించే వనరుగా మారింది. పంటకి బలాన్నిచ్చే పదార్థంగా ఉపయోగపడుతోంది. చూసే కంటిని బట్టి వస్తువు విలువ మారుతుంది అన్నట్లుగా ఇక్కడి మున్సిపాలిటీలో చెత్త నుంచి ఆదాయం సృష్టి జరుగుతోంది. వ్యర్థం అర్థవంతంగా ఉపయోగపడుతోంది. పురపాలక పాలకవర్గం, అధికార యంత్రాంగం సమష్టి కృషి ఫలితంగా.. ఎక్కడంటే అక్కడ చెత్త కనిపించే పరిస్థితులు మారి డంపింగ్‌ యార్డుకు పంపే రోజులు వచ్చాయి. ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తల నుంచి వర్మీ కంపోస్టును తయారు చేస్తూ మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తుండడమేగాక.. ఇతర మున్సిపాలిటీలకు చుక్కానిగా నిలుస్తోంది. ఇక్కడి డంపింగ్‌ యార్డులో ఏర్పాటు చేసిన రిసోర్స్‌ పార్క్‌ ఆహ్లాదాన్ని పంచుతుండగా.. వర్మీ కంపోస్టు, ప్లాస్టిక్‌, ఇతర ముడి సరుకుల విక్రయాల ద్వారా మున్సిపాలిటీ ఇప్పటివరకు రూ.6లక్షలకు పైగా ఆదాయాన్ని పొందింది. గతంలో గ్రీన్‌ లీఫ్‌ అవార్డుతోపాటు రాష్ట్రస్థాయిలో పలు అవార్డులను సైతం మున్సిపాలిటీ దక్కించుకోవడంతో దేశ, విదేశాల ప్రతినిధుల బృందాలు ఈ మున్సిపాలిటీని సందర్శించి ప్రశంసించాయి.

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • ఇంటింటికీ చెత్త సేకరిస్తున్న 
  • పారిశుధ్య కార్మికులు
  •  తడి, పొడి చెత్త నిర్వహణలో ఆదర్శంగా భువనగిరి మున్సిపాలిటీ
  • వర్మీ కంపోస్టు, ప్లాస్టిక్‌ వ్యర్థాల విక్రయాలతో రూ.6లక్షలకుపైగా ఆదాయం
  •  ప్రయోగాత్మకంగా అమలవుతున్న ‘బయో మైనింగ్‌'
  •  డంపింగ్‌యార్డులోని రిసోర్స్‌పార్క్‌తో మరింత ఆహ్లాదం 
  • దేశ, విదేశీ ప్రతినిధుల బృందం నుంచి ప్రశంసలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ /  అర్బన్‌ : తడి, పొడ చెత్త నిర్వహణలో భువనగిరి మున్సిపాలిటీ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తోంది. మనసుంటే మార్గం ఉంటుందనేందుకు ఇక్కడి మున్సిపాలిటీయే తార్కాణం. స్వచ్ఛభారత్‌, స్వచ్ఛతెలంగాణ మిషన్‌లో భాగంగా ఇక్కడి మున్సిపాలిటీలో చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారీ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది. చెత్తను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ఎరువులను తయారుచేసి విక్రయించడం ద్వారా మున్సిపాలిటీకి భారీగానే నిధులు సమకూరుతున్నాయి. దుర్వాసన రహిత నిర్వహణపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సైతం కితాబిచ్చారు. ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా రిసోర్స్‌ పార్క్‌.. మానవ మల వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలను భువనగిరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయగా డంపింగ్‌ యార్డులో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ చేపట్టిన బయోమైనింగ్‌ ప్రక్రియ సైతం ఇక్కడే ప్రయోగాత్మకంగా అమలవుతున్నది. 

ఆహ్లాదాన్ని పంచుతున్న రిసోర్స్‌ పార్క్‌..

సాధారణంగా డంపింగ్‌ యార్డులు అంటేనే దుర్గంధం గుర్తుకు వస్తుంది. కానీ.. ఇందుకు భిన్నంగా యార్డు నిర్వహణ చేపట్టి భువనగిరి మున్సిపాలిటీ పాలకవర్గం, అధికార యంత్రాంగం మన్ననలు పొందుతున్నది. యార్డులోని కొంత భాగాన్ని రిసోర్స్‌ పార్కుగా తీర్చిదిద్దారు. పూలు, పండ్ల మొక్కలతో ఈ ప్రాంతం హరితవనాన్ని తలపిస్తోంది. యార్డులో సిమెంటు రోడ్లను నిర్మించి రెండు వైపులా చూడచక్కని రీతిలో మొక్కలు నాటారు. పెద్దలు కూర్చునేందుకు బెంచీలతో పాటు చిన్నపిల్లల కోసం ఆటల పరికరాలను ఏర్పాటు చేశారు. యార్డు నిర్వహణపై గతంలో సీఎం కేసీఆర్‌ ప్రశంసింగా.. ఈ ఏడాది అక్టోబర్‌ 2న భువనగిరికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ రిసోర్స్‌ పార్కును చూసి అబ్బురపడ్డారు. ఈ సందర్భంగా సమావేశాన్ని సైతం యార్డులోనే నిర్వహించుకునేందుకు మంత్రి చొరవ చూపారు. మున్సిపాలిటీలో అమలవుతున్న తడి, పొడి చెత్త నిర్వహణను వియత్నం, ఫిలిప్పిన్స్‌, ఇండోనేషియా, శ్రీలంక, భూటాన్‌తో పాటు పలు దేశాల ప్రతినిధులు సందర్శించి ప్రశంసలు కురిపించారు.

చెత్త నుంచి రూ.6.43లక్షల ఆదాయం..

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి నిత్యం 32 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. 18 ఆటోలు, నాలుగు ట్రాక్టర్లలో సేకరించిన చెత్తను పట్టణ శివారులోని సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పార్క్‌కు తరలిస్తున్నారు. చెత్త, కవర్లు, ప్లాస్టిక్‌, అల్యూమినియం వంటి వ్యర్థాలను వేరు చేసి షెడ్డులోని తొట్లలో కుళ్లిస్తున్నారు. ఆ తర్వాత కుళ్లిన ఎరువును జల్లెడ పట్టి అందులో వానపాములను వేసి నీటితో తడుపుతూ వర్మీ కంపోస్టుగా మారుస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన ఎరువును రైతులకు విక్రయిస్తున్నారు. రహదారుల వెంట, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో నాటిన మొక్కలకు సైతం ఎరువుగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పారిశుధ్యం మెరుగుపడటమే కాకుండా రైతులకు సహజ ఎరువులను అందించగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను మెప్మా ద్వారా విక్రయిస్తున్నారు. చెత్త, ఇతర వ్యర్థాల ద్వారా 2010 సంవత్సరం నుంచి ఇప్పటివరకు మున్సిపాలిటీ రూ.6,43,450 ఆదాయాన్ని పొందింది.

తెల్లవారుజామున 5 గంటల నుంచే పర్యవేక్షణ..

మున్సిపాలిటీ చెత్త సేకరణలో భాగంగా 12,200 కుటుంబాలకు రెండు చొప్పున 24,400 చెత్త బుట్టలను మున్సిపాలిటీ అధికారులు పంపిణీ చేశారు. 203 మంది కార్మికులు ప్రతి నిత్యం పాలుపంచుకుంటున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు సైతం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెల్లవారు జామున 5గంటలే వార్డుల్లో పర్యటించి చెత్త సేకరణను పర్యవేక్షిస్తున్నారు. కార్మికుల హాజరుశాతాన్ని సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండటంతో కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతోపాటు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడం.. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం.. రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన కలుపుమొక్కలను తొలగించడం వంటి పనులను కార్మికులతో చేపడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో అటు ప్రజానీకం.. ఇటు కార్మికులు సైతం ఆరోగ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించడంతోపాటు, ఆ దిశగా తగు చర్యలు తీసుకుంటూ శభాష్‌ అనిపించుకుంటున్నారు.

బయోమైనింగ్‌తో మరింత ఆదాయం..

ఇండ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తుండగా.. టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయి డంపింగ్‌ యార్డులు సైతం ప్రజారోగ్యంపై ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాలుగా డంపింగ్‌ యార్డులలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు బయోమైనింగ్‌ ప్రక్రియను చేపడుతున్నది. ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా భువనగిరి మున్సిపాలిటీలోనే అమలు చేస్తుండగా విడుతల వారీగా రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలకు బయోమైనింగ్‌ను విస్తరించనున్నారు. డంపింగ్‌ యార్డులలోని ప్రమాదకర వ్యర్థాలను శుద్ధీకరించే క్రమంలో ఉత్పత్తి అయ్యే కంపోస్టుతో పాటు ఇతర ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పురపాలక శాఖ భావిస్తున్నది. తద్వారా బయోమైనింగ్‌ కోసం ఖర్చుచేస్తున్న వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. వ్యర్థాలను వేరు చేసే క్రమంలో మూడు రకాలుగా ఉత్పత్తులు తయారవుతుండగా రెండు మార్గాల్లో ఆదాయం పొందేలా కార్యాచరణను అమలుచేస్తున్నది. వ్యర్థాల నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువును ‘తెలంగాణ సిరి’ పేరుతో రాయితీపై రైతులకు అందజేయనుండగా.. లోహాలు, ప్లాస్టిక్‌ సంబంధించిన ముడిసరుకును డ్రై రిసోర్స్‌ సెంటర్లలో పనిచేస్తున్న మహిళా సమాఖ్యల ద్వారా అమ్మకాలు జరిపేందుకు నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి వేదికగా మంత్రి కేటీఆర్‌ సమక్షంలో గత అక్టోబర్‌ 2న రాష్ట్ర మున్సిపల్‌ శాఖ, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆగ్రోస్‌ కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండగా ఇది త్వరలోనే కార్యరూపంలోకి రానున్నది.

ఆదర్శ మున్సిపాలిటీగా మార్చుతా

ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, పారిశుధ్య కార్మికుల సహకారంతో భువనగిరి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చుతా. పట్టణాన్ని చెత్త రహిత పట్టణంగా మార్చేందుకు శానిటైజేషన్‌ సిబ్బంది పట్టుదలతో పనిచేస్తున్నారు. వార్డులను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి రోజు ప్రజాప్రతినిధులు సందర్శించాలి. వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించినప్పుడే వార్డు మరింత పరిశుభ్రంగా ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శానిటేషన్‌లో ప్రథమ స్థానంలో చోటుదక్కేలా కృషి చేస్తా. వార్డుల్లో గుర్తించిన చోటే చెత్తను వేయడం, చెత్త వాహనాలకు అందజేసి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడానికి సహకరిస్తా. కరోనా నేపథ్యంలో పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిస్థితులపై వైద్య పరీక్షలకు క్యాంపులు ఏర్పాటు, మాస్కులు, శానిటేషన్‌తో పాటు నిబంధనలపై అవగాహన కల్పించాం.

-ఎనబోయిన ఆంజనేయులు, మున్సిపల్‌ చైర్మన్‌ భువనగిరి

అభివృద్ధికి కృషి చేస్తా

భువనగిరి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రథమస్థానంలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. పారిశుధ్య పనులు, చెత్త సేకరణ విధానంపై ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉంటుంది. ప్రతి రోజు పట్టణంలో 33 మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది.తడి చెత్తతో సేంద్రియ ఎరువులు, పొడి చెత్తలో వచ్చిన ప్లాస్టిక్‌, బాటిల్స్‌, కవర్స్‌తో మున్సిపాలిటీకి అదనంగా ఆదాయం వస్తుంది. పట్టణంలోని ఖాళీ స్థలాలు, ఇతర ప్రాంతాల్లో హోటళ్లు, దవాఖానలు, కంపెనీల నుంచి తీసుకువచ్చిన  చెత్త, కెమికల్స్‌ పారవేస్తే జరిమానా విధిస్తాం. 

-ఎం.పూర్ణచందర్‌రావు, కమిషనర్‌ భువనగిరి 

పట్టుదలతో పనిచేస్తా

భువనగిరి మున్సిపాలిటీలో మాకు కేటాయించిన వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు పట్టుదలతో పనిచేస్తా. వార్డు ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, గుర్తించి స్థలంలో చెత్త వేసి మాకు సహకరిస్తున్నారు. వార్డును పరిశుభ్రంగా ఉంచేందుకు సరైన సమయానికి చేరుకుంటా. ప్రతి రోజు చేస్తున్న పనులపై అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు ఉండడంతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ ప్రతి రోజు ఉదయాన్నే ఆకస్మిక తనిఖీ చేస్తారు. 

-భూషపాక లక్ష్మి, పారిశుధ్య కార్మికురాలు


VIDEOS

logo