శనివారం 06 మార్చి 2021
Yadadri - Dec 10, 2020 , 00:55:19

అందుబాటులో వైద్యసేవలు

అందుబాటులో వైద్యసేవలు

  • పల్లె ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్య సేవలు 
  • ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు 
  • రోగులకు తీరనున్న ఇక్కట్లు 
  • ఏఎన్‌ఎంలకు స్కూటీలు 

ఆలేరు టౌన్‌ : గ్రామీణ ప్రజలకు ఇక మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు వైద్యం కోసం ఎక్కువగా ఆరోగ్య ఉపకేంద్రాలకు వెళ్తుండేవారు. అయితే ఆరోగ్య కేంద్రాలకు పక్కా భవనాలు లేకపోవడంతో చాలా మంది రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇబ్బందులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా పీహెచ్‌సీలకు అనుబంధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను బలోపేతం చేయాలని సంకల్పించింది. 

25 ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం..

జిల్లాలో 25 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కో ఉపకేంద్రం నిర్మాణానికి రూ.16 లక్షలు కేటాయించింది. సొంత భవనాలు లేని ప్రాంతాల్లో 300 చదరపు గజాలు గుర్తించి అధికారులు నిర్మాణం చేపడుతారు. ఇందుకు సంబంధించి స్థల సేకరణ పూర్తయ్యాక వాటి నిర్మాణ బాధ్యతను వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ)కు అప్పగిస్తారు. ప్రతీ ఉప కేంద్రంలో నాలుగు గదులను నిర్మిస్తారు. ఇందులో 1 లేబర్‌ రూం ఏర్పాటు చేస్తారు. దీంతో చిన్నారులకు టీకాలు, గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్య సదుపాయం అందనుంది. పక్కా భవనాలు పూర్తయితే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు దూరభారం తగ్గనుంది. 

అరకోర వసతుల మధ్య..

జిల్లాలో అనేక చోట్ల ఆరోగ్య ఉపకేంద్రాలు అద్దె భవనాలు, కమ్యూనిటీ భవనాలు, శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. దీంతో రోగులతో పాటు సిబ్బంది ఇబ్బంది పడేవారు. అంతేకాకుండా గ్రామాలకు దూరంగా ఉండటంతోపాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక గర్భిణులు, బాలింతలు అవస్థలు పడేవారు. 

సబ్‌ సెంటర్లలో కూడా కరోనా టెస్టులు..

ఇక నుంచి కరోనా టెస్టులు హెల్త్‌ సబ్‌సెంటర్లలో కూడా నిర్వహించనున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు వరకు పీహెచ్‌సీలో నిర్వహించేవారు. సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రతి సెంటర్‌లో 10 టెస్టులు చేయనున్నారు. 2 నుంచి 4 గ్రామాలకు ఒక సబ్‌ సెంటర్‌ 

పనిచేస్తుంది. సబ్‌ సెంటర్లలో ఏఎన్‌ఎంలు హెల్త్‌ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్లు ర్యాపిడ్‌ యాంటిబాడీ టెస్టులు చేయనున్నారు. 

రాయితీ ద్వారా స్కూటీలు  

వైద్య సేవలు అందించడంలో ఏఎన్‌ఎంల పాత్ర ఎంతో ఉంది. వారు పల్లెలను నిత్యం సందర్శించాల్సి ఉంటుంది. వైద్య సేవలు అందించాలంటే వారు ప్రతీరోజు పల్లెలకు వెళ్లాల్సిందే. సకాలంలో చేరాలంటే వారికి సొంత వాహనం అవసరం. వీరి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సబ్సిడీ కింద స్కూటీలను అందిస్తున్నది. యాదాద్రి జిల్లాలో మొదటి విడుతలో 13 మందికి ఇవ్వగా, రెండో విడుతలో 37 స్కూటీలు ఇవ్వనున్నారు. ఇప్పటికే కొందరికి అందజేశారు. మొత్తం రూ.15వేల సబ్సిడీ అందుతుంది. దీంతో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. గర్భవతులు, బాలింతలు అవసరం ఉంటే వారిని వాహనంపై వైద్యుల వద్దకు తీసుకెళ్లనున్నారు. 

జిల్లాకు 25 భవనాలు..

జిల్లాలో 25 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.16 లక్షల నిధులను కేటాయించారు. స్థల సేకరణ జరుగుతుంది. పక్కా భవనాలు పూర్తయితే రోగులకు మెరుగైన వైద్యం లభిస్తుంది. స్థల సేకరణ పూర్తి కాగానే నిర్మాణ పనులు మొదలవుతాయి.

సాంబశివరావు, డీఎంహెచ్‌వో, యాదాద్రి


VIDEOS

logo