శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 07, 2020 , 00:36:59

హరిత యాదాద్రి

హరిత యాదాద్రి

  • జిల్లాలో లక్ష్యాన్ని దాటిన హరితహారం 
  • సమష్టిగా పని చేసిన అధికార యంత్రాంగం 
  • హరితహారాన్ని ఎప్పటికప్పుడు    సమీక్షించిన కలెక్టర్‌
  • ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం 22.6 లక్షల మొక్కలు.. 
  • జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలు 23.12 లక్షలు
  • ఈ ఏడాది ఇప్పటి వరకు 102 శాతం పూర్తి 

తెలంగాణలో ఆకుపచ్చని జిల్లాలను చూడాలన్న సీఎం కేసీఆర్‌ కల సాకారమవుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ శాఖలన్నీ మొక్కలు నాటడంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాయి. ఫలితంగా జిల్లాలో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది జిల్లాలో 22.6 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మేరకు జిల్లాలోని 426 పల్లెల్లో విస్తృతంగా మొక్కల పెంపకాన్ని చేపట్టారు. మున్సిపాలిటీలు, పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ విరివిగా మొక్కలను నాటేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే లక్ష్యానికి మించి 23.12లక్షల మొక్కలు నాటడంతో జిల్లాలో హరితహారం లక్ష్యం 102 శాతం పూర్తయ్యింది. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయడంతో ఈ ఏడాది హరితహారం లక్ష్యం నెరవేరింది.

- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ

  • ఈ ఏడాది 102 శాతంతో హరితహారం లక్ష్యాన్ని దాటేసిన ప్రభుత్వ శాఖలు
  • నిర్దేశించిన లక్ష్యం 22.6లక్షలు
  • లక్ష్యానికి మించి జిల్లా వ్యాప్తంగా నాటిన మొక్కలు 23.12లక్షలు
  • జిల్లాలో పచ్చదనం పెంపునకు దోహదపడుతున్న ప్రభుత్వ చర్యలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రోజురోజుకు పెరిగిపోతున్న జనాభా కారణంగా పట్టణీకరణ, నగరీకరణ వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో జనాభా అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ఆ అవసరాలను తీర్చడం కోసం.. ఇంకా అనేక ఇతర పనుల కోసం చెట్లను విపరీతంగా నరుకుతున్నారు. దీంతో ఏటా అడవుల విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఇది రానున్న రోజుల్లో మానవాళికి పెనుముప్పుగా మారనుండటంతో తరుగుతున్న అడవుల విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రతి యేటా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ వస్తోంది. ఇప్పటివరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 విడుతల్లో మొక్కలను నాటగా, ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించి మొక్కలను నాటడం ద్వారా జిల్లా 102 శాతం లక్ష్యాన్ని అందుకుంది. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కల పెంపకం.. పరిమిత ఖర్చుతో అటవీ తరహా దట్టమైన వనాలను పల్లెపల్లెన ఏర్పాటు చేయడం.. హరితహారంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.

ప్రతి పల్లెకు ఓ నర్సరీ..

జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ప్రతి పల్లెకు ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లాలో 421 గ్రామ పంచాయతీలతోపాటు ఇతర చిన్నచిన్న పల్లెలు కలుపుకుని 650 వరకు ఆవాసాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 426 ఆవాసాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి ప్రతి నర్సరీలో 2వేల నుంచి 10వేల వరకు మొక్కలు పెంచారు. పల్లెల్లో మొక్కల సంరక్షణ బాధ్యతను సర్పంచులకు అప్పగించడం.. ట్యాంకర్లను ఏర్పాటు చేయడంతోపాటు. మొక్కల సంరక్షణ కోసం సిబ్బందిని నియమించడం వల్ల మొక్కల పెరుగుదలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. ప్రత్యేక అధికారులతోపాటు పంచాయతీల్లో సర్పంచ్‌ చైర్మన్‌గా ఏర్పాటు చేసిన గ్రామ హరితహారం కమిటీలో రెవెన్యూ సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను, సహాయ వ్యవసాయ అధికారులను, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బందితోపాటు గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ భాగస్వాములను చేశారు. ప్రతి మండలంలో 3.50లక్షల మొక్కలు, మున్సిపాలిటీల్లో 3 నుంచి 5లక్షల వరకు మొక్కలు నాటారు. 

నిర్దేశిత లక్ష్యాన్ని దాటేశారు..

హరితహారంలో ప్రధానంగా నీడనిచ్చే చెట్లతోపాటు పండ్లు, పూల మొక్కలను పెంచి పంపిణీ చేశారు. టేకు, కానుగ, నేరేడు, ఈత, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫల్‌ వంటి పండ్ల మొక్కలతోపాటు చెరువు కట్టలపై, పొలం గట్ల వెంట ఈత, ఖర్జూర తదితర మొక్కలను నాటారు. అదే విధంగా ఇండ్లల్లో పెంచుకునేందుకు పలు రకాల పూల మొక్కలను పంపిణీ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రదేశాలతోపాటు ప్రభుత్వ భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, రోడ్డుకు ఇరువైపులా విస్తృతంగా మొక్కలను నాటారు. పల్లె ప్రకృతి వనాలలోనే 8.20లక్షల మొక్కలను నాటి పెంచుతుండగా, ప్రధాన రహదారులకు ఇరువైపులా 2.41లక్షల మొక్కలను నాటారు. ఇండ్ల వద్ద మొక్కలు నాటేందుకు 9.55లక్షల మొక్కలను పంపిణీ చేశారు. పెరుగుతున్న మొక్కల్లో ఎక్కడైనా చనిపోతే లక్ష్యానికి తగ్గకుండా ఉండేందుకు 20వేల మొక్కలను చనిపోయిన మొక్కల స్థానంలో నాటారు. జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఎప్పటికప్పుడు హరితహారం కార్యక్రమ తీరును పర్యవేక్షించగా, స్థానిక సంస్థలతోపాటు గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, ఉద్యానవన, ఇరిగేషన్‌, ఆబ్కారీ, వ్యవసాయ, విద్యా, పరిశ్రమలు తదితర 30 శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ ఏడాది హరితహారం లక్ష్యాన్ని దాటేశారు.

అటవీ సంరక్షణతోపాటు ప్రజలకు ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యాన్ని అందించేలా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ప్రముఖ పర్యాటక కేంద్రమైన చేనేత పుట్టినిల్లు భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని జలాల్‌పూర్‌ గ్రామంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలతోపాటు అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో మొక్కలను కూడా అధికారులు నాటించారు. త్వరలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ప్రారంభించడానికి హెచ్‌ఎండీఏతోపాటు ఫారెస్ట్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.   

VIDEOS

logo