చెత్త నుంచి సేంద్రియ ఎరువు

- గ్రామాల్లో కంపోస్ట్షెడ్ల నిర్మాణం
- ఒక్కో షెడ్ నిర్మాణానికి రూ. 2,50లక్షలు కేటాయింపు
- చక చకా కొనసాగుతున్న నిర్మాణ పనులు
భువనగిరి : గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున కంపోస్ట్‌షెడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా జిల్లాలోని 17 మండలాల్లోని 421గ్రామపంచాయతీలకుగాను 418 గ్రామపంచాయతీల్లో కంపోస్ట్షెడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఒక్కో కంపోస్ట్‌షెడ్ నిర్మాణానికి రూ. 2,50లక్షల ఉపాధి నిధులు ఖర్చుచేస్తున్నది. 30మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పుతో షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామాల్లోని ఇండ్ల నుంచి సేకరించిన చెత్తను కంపోస్ట్షెడ్లకు తరలిస్తారు. అక్కడి నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి కంపోస్ట్షెడ్లలో సేంద్రియ ఎరువుగా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన సేంద్రియ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగించగా మిగిలిన ఎరువును గ్రామాల్లోని రైతులకు విక్రయిస్తారు. దీంతో గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరనున్నది.
వేగంగా కంపోస్ట్షెడ్ల నిర్మాణాలు
జిల్లాలోని 421గ్రామ పంచాయతీలకుగాను భూదాన్‌పోచంపల్లి మండలం సాయినగర్, భువనగిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్తండాలను మినహాయించగా 418 గ్రామ పంచాయతీలకు 284కంపోస్ట్షెడ్ల నిర్మాణం పూర్తికాగా, 72 కంపోస్ట్‌షెడ్‌లు వాడుకలోకి వచ్చాయి. మిగిలిన కంపోస్ట్షెడ్ల నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ప్రతి కంపోస్ట్షెడ్లలో ఎనిమిది కంపార్ట్మెంట్లు
గ్రామాల్లో చెత్తాచెదారాన్ని సేకరించి సేంద్రియ ఎరువుగా తయారుచేసేందుకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ నిధులు రూ. 2.50లక్షలతో కంపోస్ట్‌షెడ్ నిర్మిస్తున్నది. గ్రామాల్లో సేకరించిన చెత్తాచెదారాలను వేర్వేరు చేయడంతో పాటు తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్షెడ్లో 8 కంపార్ట్మెంట్లుగా విభజిస్తారు. అందులో రెండు సేంద్రియ ఎరువు తయారు చేసే షెడ్లు, మిగిలిన ఆరు కంపార్ట్మెంట్లలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, అట్టడబ్బాలు, న్యూస్‌పేపర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గాజు సీసాలు తదితర సామగ్రిలను వేరుచేసే వీలుగా కంపోస్ట్షెడ్ల నిర్మాణాలు చేపట్టారు.
చెత్త సమస్యకు చెక్
గ్రామంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్షెడ్కు చెత్తా చెదారాలను పారిశుధ్య కార్మికులు రోజూ తరలిస్తారు.అలా తరలించిన చెత్తాచెదారాలను ఆయా కంపార్ట్మెంట్లల్లో వేరు చేస్తారు. ఈక్రమంలో తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయడంతో పాటు అలా తయారు చేసిన సేంద్రియ ఎరువును హరితహారం మొక్కలకు వాడుతున్నాం. గ్రామంలో కంపోస్ట్‌షెడ్ నిర్మాణంతో చెత్త సమస్యకు చెక్ పెట్టినైట్లెంది.
-ఈర్ల పుష్పమ్మాకృష్ణ, గౌస్‌నగర్ సర్పంచ్
లక్ష్మాన్ని చేరుకునేందకు సమగ్ర చర్యలు
పల్లెలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం కంపోస్ట్షెడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. 418గ్రామ పంచాయతీలకుగాను 284కంపోస్ట్షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 72కంపోస్ట్ షెడ్లు వాడుకలోకి వచ్చాయి. మిగిలిన కంపోస్ట్షెడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. కంపోస్ట్షెడ్ల నిర్మాణాలతో గ్రామాల్లో పారిశుధ్య సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించనున్నది.
- మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ