బుధవారం 24 ఫిబ్రవరి 2021
Yadadri - Dec 05, 2020 , 00:21:40

అరణ్యం నుంచి జనారణ్యంలోకి..

అరణ్యం నుంచి జనారణ్యంలోకి..

  • గ్రామాల్లో హడలెత్తిస్తున్న అడవి పందులు
  •   గుంపులు గుంపులుగా వచ్చి పంటల ధ్వంసం 
  •  కత్తి మీద సాములా మారినసేద్యం
  • కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తున్న రైతాంగం
  •  పంట ఏపుగా ఎదిగినా ప్రతి యేటా నష్టాలు 
  • అడవి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకోలు 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ / తుర్కపల్లి : ఆరుగాలం శ్రమ ఓ ఎత్తు... దానిని కాపాడుకోవడం మరో ఎత్తు. సేద్యం.. రైతులకు కత్తిమీద సాములా మారింది. ప్రకృతి ప్రకోపం ఓ పక్క.. చీడపీడల దాడితో మరోపక్క ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న గ్రామాల్లో వన్యప్రాణుల బెడద రైతులకు పెద్ద సవాల్‌గా మారింది. వాటి బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. తుర్కపల్లి మండల రైతాంగం అడవి పందుల పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. కంటికి కనిపించకుండా మాటేసి పంటలను మటుమాయం చేస్తున్న అడవి పందులను గుర్తుకు తెచ్చుకుంటేనే రైతుల గుండె బేజారైపోతోంది. పందులు గుంపులు గుంపులుగా పంట పొలాల్లోకి చేరుతున్నాయి. వందల ఎకరాల్లో పంటలను సర్వ నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి. మండలంలో 2 వేల హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాసాలమర్రి సెక్టార్‌ పరిధిలో 700 హెక్టార్లలో, వీరారెడ్డిపల్లి సెక్టార్‌ పరిధిలో 800 హెక్టార్లలో, దత్తాయిపల్లి సెక్టార్‌ పరిధిలో 500 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న పొలాలపై అడవి పందులు దాడులు తీవ్రంగా ఉండడంతో పంటనష్టం కూడా అదే స్థాయిలో ఉంటోంది. అడవి పందులను చంపితే కేసుల భయం వెంటాడుతుండడంతో.. పందుల బెడద నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.

రైతులకు నిత్యం దడ..

తుర్కపల్లి మండలంలో చాలా గ్రామాల్లో అడవి పందుల బెడద ఉంది. ఆయా గ్రామాలు అటవీ ప్రాంతానికి చేరువలో ఉండటమే ఇందుకు కారణం. తుర్కపల్లి, మంచిరోనిమామిళ్ల, దత్తాయిపల్లి, వెంకటాపూర్‌ తదితర గ్రామాల్లో అడవి పందులు పంటలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నలక్ష్మాపూర్‌, వాసాలమర్రి, రాంచెట్టిపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గోపాల్‌పురం, నాగాయపల్లి, మల్కాపూర్‌ గ్రామాల్లో పందుల బెడద తీవ్రంగా ఉంది. వరి, పత్తి వంటి పంటలను ఇక్కడి రైతులు ఎక్కువగా సాగు చేస్తుండగా.. గోపాల్‌పురం, నాగాయిపల్లి తదితర గ్రామాల రైతులు కూరగాయలు, ఆకు కూరలను ఎక్కువగా పండిస్తుంటారు. ప్రతి యేటా పైగ్రామాల పరిధిలోని రైతులు సుమారు 6వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తుంటారు. పంటల రక్షణ కోసం వింత వింత శబ్దాలు చేయడం, పొలం చుట్టూ రంగు రంగుల చీరలను ఏర్పాటు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. గతంలో పొలం చుట్టూ కరెంట్‌తో కూడిన ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసేవారు. అయితే మూగ జీవాలు మృత్యువాత పడుతుండడంతో రైతులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఒంటరిగా వెళ్తే వెంటపడుతుండగా గతంలో మంచిరోని మామిళ్ల గ్రామానికి చెందిన పలువురు రైతులు పంటలకు కాపలా కోసం వెళ్లి అడవి పందుల దాడిలో గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎకరాలకు ఎకరాలు పంటను తినేస్తూ.. పంటనంతా పాడుచేస్తుండడంతో కొన్నేండ్లుగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వారంటున్నారు.

వాసాలమర్రిలో పందుల బెడద నివారణకు ప్రణాళికలు..

సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలోనూ అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. కొన్ని పంటలను మొక్క దశలోనే నమిలి మింగేస్తుండగా.. పంట చేతికొచ్చే దశలోనూ పందులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇలా.. యేటా ఈ గ్రామ పరిధిలోని ఆవాసాల్లోనే వందల ఎకరాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. ఫలితంగా.. ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను పందులు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ వాసాలమర్రిని దత్తత తీసుకోవడంతో ఇక్కడి రైతుల కష్టాలు తీరనున్నాయి. అటవీశాఖ అధికారులు వాసాలమర్రిని సందర్శించినప్పుడు ఇక్కడి రైతాంగం అడవి పందుల సమస్యను ప్రధానంగా ఏకరువు పెట్టడంతో వాటి నివారణ దిశగా అటవీశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. అడవి పందులు పొలాల్లోకి రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతం ఉన్న గుట్ట చుట్టూ కందకాలను తవ్వేందుకు అవసరమైన చర్యలను త్వరలోనే చేపడతామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. అయితే చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఇదే రకమైన సమస్య ఉండడం వల్ల అడవి పందుల బెడద ఉన్న అన్ని గ్రామాల్లోనూ వాసాలమర్రి తరహాలోనే అటవీశాఖ తగు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

ప్రణాళికలు రూపొందిస్తున్నాం..

తుర్కపల్లి మండలంలో అడవి పందుల బెడద ఉన్న మాట వాస్తవమే. సమస్య మా దృష్టికి కూడా వచ్చింది. రాష్ట్ర స్థాయి అధికారుల కూడా ఏయే ప్రాంతాలలో అడవి పందుల బెడద ఉందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు నివేదికలు రూపొందించి పంపుతాం. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో అడవి పందుల బెడదకు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టామో రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా అదే తరహాలో చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం.

- వెంకటేశ్వర్‌ రెడ్డి, డీఎఫ్‌వో 

పంటను కాపాడాలి ..

అడవి పందుల బెడదతో పంటను చంటి పిల్లను కాపాడినట్లు కాపాడుకోవాల్సి వస్తుంది. రాత్రి అయిందంటే చాలు.. పక్కనే ఉన్న అడవిలోంచి అడవి పందులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి.  పంటను తినడంతో పాటు పంటనంత తొక్కి నాశనం చేస్తున్నాయి. అటవీ శాఖ అధికారులు అడవి పందుల బెడదను నివారించి తమ పంటను కాపాడాలి. 

- తరిగొప్పుల ఆనందం, గోపాల్‌పురం

కాపలా పోతున్నాం ..

అడవి పందులు పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. ప్రతి రోజు రాత్రి వేళ్లల్లో వ్యవసాయ బావి వద్ద పంటల కాపలాకు వెళుతున్నాం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న పంట మొత్తం అడవి పందుల పాలవుతుంది. రోజు రాత్రి వేళ పంటను కాపాడుకోలేక ఇబ్బందులు పడుతున్నాం.

- తోడేటి జహంగీర్‌, వాసాలమర్రి

పంటంతా పందులపాలు..

ఎకరం భూమిలో కూరగాయల సాగు చేస్తున్నాను. అడవి పందులు గుంపులుగా వచ్చి మొక్కలను పీకి పంట నాశనం చేస్తున్నాయి. రాత్రి వేళ తోట కాడికి వెళ్లడం ఏమాత్రం ఆలస్యమైనా పంటంత అడవిపందుల పాలవుతున్నాయి. పందుల బారి నుంచి పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు.

- రాజు, గోపాల్‌పురం

పందులతో ప్రాణభయం ..

అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రాత్రి వేళల్లో బావుల వద్దకు కాపలా వెళ్తున్నాం. పందులు గుంపులు గుంపులుగా వస్తూ మమ్మల్నే బెదిరిస్తున్నాయి. వాటితో మాకు ప్రాణభయం ఉంది. పందుల నుంచి పంటను కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే ప్రాణం కాపాడుకోవడం మరో ఎత్తు అవుతుంది. అధికారులు స్పందించి వాటి నుంచి పంటలతో పాటు మాకు కూడా రక్షణ కల్పించాలి.

- కొడారి పరమేశ్‌, దత్తాయిపల్లి  

VIDEOS

logo