శనివారం 23 జనవరి 2021
Yadadri - Dec 04, 2020 , 00:22:23

కుల పెద్దరికమే ప్రాణం తీసింది

కుల పెద్దరికమే ప్రాణం తీసింది

  • వివాహ వేడుకను ఆసరా  చేసుకొని దాడి
  • ఆధిపత్యం కోసమే హత్య జరిగినట్లు వెల్లడి
  • హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్వాధీనం
  • ముగ్గురు నిందితుల రిమాండ్‌, పరారీలో మరో నలుగురు
  • వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి

భువనగిరి క్రైం : తమ కులంలో కుల పెద్దగా వ్యవహరించడానికి తమకు అవకాశం ఇవ్వలేదని కక్ష్య పెంచుకొని ప్రస్తుతం ఉన్న కుల పెద్దను ఎలాగైనా హత మార్చాలనుకున్నారు. ఈ క్రమంలో ఓ వివాహ వేడుకలో మర్యాద చేయలేదనే సాకుతో గొడ్డలితో దాడికి పాల్పడి ఒకరిని హత్య చేయగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మోత్కూరు మండలం దాచారం గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ కమిషనరేట్‌ యాదాద్రి భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి వెల్లడించారు. గురువారం భువనగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన సురారం చంద్రయ్య గత పదేండ్లుగా తమ కులానికి సంబంధించి కుల పెద్దగా వ్యవహరిస్తున్నాడు. అయితే తమకు కులపెద్ద కావాలని సురా రం వెంకటయ్య అనే వ్యక్తి గత సంవత్సరం కిందట గ్రా మంలో పంచాయతీపెట్టాడు. అయితే ఇక్కడ కూడా చంద్రయ్యనే కులపెద్దగా వ్యవహరించాలని అందరూ నిర్ణయం తీసుకోగా, చంద్రయ్యకు సురారం వెంకటయ్యకు గొడవ జరిగింది. అప్పటి నుంచి వెంకటయ్యతోపాటు ఆయన కుటుంబసభ్యులు చంద్రయ్యను కానీ, అతడి కుటుంబంలో ఎవరినైనా హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 

వివాహ వేడుకను ఆసరాగా చేసుకొని...

ఎలాగైనా చంద్రయ్యను గానీ, కుటుంబ సభ్యులను గానీ హతమార్చాలని చూస్తున్న నేపథ్యంలో ఈనెల 1వ తేదీన తాటిపాముల మహేశ్‌ అనే వ్యక్తి వివాహం జరుగుతుంది. అదే సమయంలో తమకు పెండ్లి కూతురు తరుఫు బంధువులు మర్యాద సరిగా చేయలేదని, కుల పెద్దగా నువ్వు ఏం చేస్తున్నావ్‌ అని సురారం ప్రవీణ్‌, సురారం వెంకటయ్యతో పాటు మరికొందరు చంద్రయ్యతో గొడవ పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో వీరంతా చంద్రయ్య ఇంట్లోకి వెళ్లి చంద్రయ్య చిన్నకొడుకు సురారం పరుశరాములును సురారం ప్రవీణ్‌ గొడ్డలితో వెనుక నుంచి తల భాగంలో ఒక్కసారిగా నరికాడు. దీంతో పరుశరాములుకు రక్తం కారుతూ అక్కడే పడిపోగా, అతను చనిపోయినట్లు నిర్ధారించుకొని పక్కనే ఉన్న చంద్రయ్య పెద్దకొడుకు నాగరాజును కూడా చంపాలనుకున్నారు. అయితే సురారం కృష్ణ, నాగరాజు రెండు చేతులు పట్టుకోగా సురారం ప్రవీణ్‌ గొడ్డలితో నాగరాజును నరకబోయాడు. నాగరాజు చెయ్యి అడ్డుపెట్టడంతో అతడి ఎడమ చెయ్యిపై గొడ్డలి దెబ్బ తగిలింది. అదే సమయంలో చంద్రయ్య తమ్ముడు చిన్నలక్ష్మయ్య అడ్డురాగా, అతన్ని సురారం వెంకటయ్య కర్రతో కొట్టాడు. సురారం వెంకటమ్మ, సురారం కృష్ణ, సురారం యాదమ్మ, సురారం అనిల్‌, చిల్లర రమేశ్‌లు గాయపడిన నాగరాజును జుట్టు, చొక్కా పట్టుకొని లాగి, ఇటుకలతో దాడి చేశారు. దీంతో గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యంలోని ఆత్మకూరు(ఎం) శివారుకు వెళ్లేసరికి గాయపడిన చంద్రయ్య చిన్న కొడుకు సురారం పరుశరాములు మృతి చెందాడు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. గొడవ జరిగిందని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తూ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. హత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరించి నిందితుల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో సురారం ప్రవీణ్‌, సురారం వెంకటయ్య, సురారం వెంకటమ్మ గురువారం ఉదయం దత్తప్పగూడెం వెళ్తుండగా, సమాచారం తెలుసుకున్న మోత్కూరు పోలీసులు అనాజీపురం చౌరస్తాలో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కేసులో మిగతా నిందితులైన సురారం కృష్ణ, సురారం యాదమ్మ, సురారం అనిల్‌, చిల్లర రమేశ్‌లు పరారీలో ఉన్నారని, వీరి కోసం వెతుకుతున్నట్లు డీసీపీ తెలిపారు. పూర్తిగా ఆధిపత్య పోరు కోసమే ఈ హత్య జరిగిందని డీసీపీ వెల్లడించారు. సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, రామన్నపేట సీఐ శ్రీనివాస్‌, మోత్కూరు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.


logo