బుధవారం 20 జనవరి 2021
Yadadri - Dec 03, 2020 , 00:15:02

జింక్‌ లోపాన్ని ముందే గుర్తించాలి

జింక్‌ లోపాన్ని ముందే గుర్తించాలి

యాదాద్రి అగ్రికల్చర్‌ :

  • లేకుంటే దిగుబడులు తగ్గే ప్రమాదం
  • వరిపైరు ఎదుగుదలకు దోహదం

వరి నాటిన రోజు నుంచి జింకు ధాతు లోపం బయటపడుతుంది. వరి సాగులో రెండు దశాబ్దాలుగా అధిక దిగుబడి వరి వంగడాలు ప్రవేశపెట్టబడ్డాయి. వీటిని సాగు చేయడంతో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గినప్పటి నుంచి వరిలో సూక్ష్మధాతు లోపాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనదే జింక్‌ ధాతువు. వరిలో జింక్‌ అవసరం గమనించకపోతే దిగుబడులు బాగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని సాగుభూముల్లో జింక్‌ పోషకం బాగా తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. వరి, చెరుకు, మామిడి, కూరగాయలు, వేరుశనగ పంటలకు దీని అవసరం ఎంతో ఉంది. వరిలో జింకు ధాతు నివారణపై జిల్లా వ్యవసాయశాఖాధికారి అనురాధ పలు సూచనలు చేశారు. 

జింక్‌ లోపం వచ్చే ప్రాంతాలివే...

అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు, ఎక్కువగా సాగు చేయబడు ప్రాంతాలు, గరప నేలలు, చౌడు భూములు, అధిక భాస్వరం కలిగిన భూములు, తక్కువగా సేంద్రియ కర్బనం కలిగిన నేలలు, ఎక్కువ పోషకాలు కలిగిన జింక్‌ రహిత రసాయన ఎరువులు వాడిన నేలలు, భూమిలో పోషకాల సమతుల్యతలో లోపం, కొత్తగా సాగులోకి తెచ్చిన భూములు.

జింక్‌ లోపాన్ని ఇలా గుర్తించాలి..

వరి నారుమడి దశలోనూ, నాటిన తర్వాతా జింక్‌ లోపం కనిపిస్తుంది. సాధారణంగా నాట్లు వేశాక రెండు నుంచి నాలుగు వారాల మధ్య, నాలుగు నుంచి ఆరువారాల మధ్య జింక్‌ లోపం లక్షణాలు కనిపిస్తాయి. జింక్‌ లోపం ఉన్న పొలాల్లో ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగ్గా పెరగదు. పిలకలను పెట్టదు. పొలంలో మొక్కలు చనిపోయి ఖాళీలు కనిపిస్తాయి. పొలం అంతా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే మొక్కలలో పైనుంచి మూడు లేక నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగిలిన భాగం అంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఆకులు చిన్నగా నూలు కండీలుగా మారి మొద్దుబారుతాయి. గట్టిగా మారి వంచి చూస్తే శబ్దం చేస్తూ విరుగుతాయి.

నివారణ చర్యలు ఇలా..

వరిలో ఎరువుల యాజమాన్య పద్ధతులు సద్వినియోగం కావాలన్నా, అధిక దిగుబడులు సాధించాలన్నా జింక్‌లోపం నివారణకు ప్రాధాన్యతనివ్వాలి. పైరు పెరుగుదలకు అవసరమైన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రధానమైనవి. వీటితోపాటు జింకు, కాల్షియం, మెగ్నీషియం వంటి తదితర 16 రకాల సూక్ష్మధాతువులు అవసరమే. వీటిలో జింక్‌ పాత్ర కీలకం. ప్రధాన పోషకాలతో పోల్చితే ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనా, ప్రాముఖ్యత విషయంలో ప్రధాన పోషకాలతో సమానం. జింక్‌ లోపిస్తే ఎన్ని ఎరువులు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. జింక్‌ సల్ఫేట్‌ సాగునేలలో వాడి, ద్రావణాన్ని పిచికారీ చేసి గానీ లోపాన్ని నివారించవచ్చు. నేలలో వేసిన జింక్‌ పోషకానికి కదలిక చాలా తక్కువగా ఉంటుంది. నీటిలో కొట్టుకొని పోయే స్వభావం లేదు. మొక్క సరిపడినంతగా తీసుకోగా మిగిలింది తర్వాత పైరుకు ఉపయోగపడుతుంది. సాధారణ నేలలకు ఎకరాకు 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వాడాలి. ఇది రెండు లేక మూడు పంటలకు సరిపోతుంది. చౌడు భూములకు ఎకరాకు 40 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వాడాలి. సాధారణ భూముల్లో జింక్‌ వాడవచ్చు. సమస్యాత్మక భూముల్లో పిచికారీ చేసి మాత్రమే సవరించాలి. జింక్‌ సల్ఫేట్‌ చివరి దుక్కుల్లో గానీ నాటే సమయంలో గానీ వేసి, సాగు నేలల్లో బాగా కలిసేలా చేయాలి. పైరు మీద జింక్‌ లోపం గమనించగానే 0.2 శాతం జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని ఒక లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున ఐదు రోజుల వ్యవధిలో రెండు లేక మూడు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి.

చిలేటెడ్‌ జింక్‌ వాడే పక్షంలో ఎకరాకు 200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పైరు అంతటా తడిసేలా పిచికారీ చేయాలి. మురుగునీటి సమస్య ఉంటే తప్పనిసరిగా తొలగించి మంచినీరు పెట్టుకోవాలి. మురుగు దమ్ముకు, పంట దమ్ముకు కనీసం పదిరోజుల వ్యవధి లేని పక్షంలో జింక్‌ సల్ఫేట్‌ను భూమిలో వేయడం కన్నా పైరుపై పిచికారీ చేయడం మంచిదే గాక ఖర్చు తగ్గుతుంది. జింక్‌ ద్రావణంలో ఎలాంటి పురుగుమందు కలిపి పిచికారీ చేడకూడదు. జింక్‌ను భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు. 

పైరు ఎదుగుదలకు జింక్‌ దోహదం

పంట పెరుగుదలకు ప్రధాన పోషకాలు ఎంత అవసరమో జింక్‌ అంతే.

మొక్కలకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ అందుబాటులో ఉన్నప్పటికీ సూక్ష్మ పోషకాలు లోపిస్తే పంటల పెరుగుదల నిలిచిపోవడంతో దిగుబడులు తగ్గుముఖం పడుతాయి.

సూక్ష్మ పోషకాల్లో ముఖ్యమైనది జింకే. పైరు ఎదుగుదలకు కావాల్సిన ఇండోల్‌ అసిటిక్‌ ఆసిడ్‌ (ఆక్సిన్స్‌) అనే హార్మోన్‌ తయారుకావడానికి ఉపయోగపడుతుంది.

కార్బోనిక్‌ ఎన్‌-హైడ్రేస్‌ ఆల్కహాల్‌  డీహైడ్రోనెట్‌ వంటి ఎంజైముల్లో జింక్‌ ఒక ముఖ్యభాగం.

ఇది మొక్కలో ఎమైనో ఆమ్లములు, మాంసకృత్తులు తయారు కావడానికి దోహదపడుతుంది.

నత్రజని, భాస్వర పోషకాల సమర్థ వినియోగానికి జింక్‌ బాగా ఉపకరిస్తుంది.

నత్రజనితో మొక్కల్లో పత్రహరితం ఉత్పత్తి అవుతుంది.

కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగడానికి దీని అవసరం తప్పనిసరి. 

నివారణ చర్యలు చేపట్టాలి

వరిలో జింక్‌ లోపాన్ని గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. భూమిలో నేరుగా వేయడం ద్వారా గానీ, పిచికారీ చేయడం ద్వారా గానీ జింక్‌ లోపాన్ని సవరించవచ్చు. సరైన సమయంలో నివారణ చర్యలు చేపడితే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. 

-అనురాధ ,  జిల్లా వ్యవసాయాధికారి


logo