పట్టభద్రుల ఓటర్లు 36,028

- పురుషులు : 23,648,స్త్రీలు : 12,373, ఇతరులు : ఏడుగురు
- ఈ నెల 31 వరకు మరో దఫా ఓటు దరఖాస్తుకు అవకాశం
- ముసాయిదా ఓటరు జాబితాపై ఫిర్యాదుల స్వీకరణ
- వచ్చే ఏడాది జనవరి 18న తుది ఓటరు జాబితా విడుదల
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానం పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 21తో ముగియనుండడంతో ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం పట్టభద్రుల ఓటు నమోదు ప్రక్రియను ముమ్మరంగా చేపడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 6 వరకు పట్టభద్రుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గ్రాడ్యుయేట్ల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు రాగా.. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులను తేల్చారు. ఈ మేరకు సంబంధిత ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టరేట్‌తోపాటు అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో, తాసిల్దార్ కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 1న ప్రదర్శించారు. ఎన్నికల కోసం జిల్లావ్యాప్తంగా 34 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ అనితా రామచంద్రన్ వ్యవహరిస్తుండగా.. డివిజన్ల వారీగా ఆర్డీవోలు, మండలాల వారీగా తహసీల్దార్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31 వరకు సంబంధిత ఫిర్యాదులను స్వీకరించనున్నారు.
ఓటు దరఖాస్తుకు మరో అవకాశం
ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వరకు పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా దరఖాస్తులను గత నెల 25వ తేదీ వరకు బీఎల్వోలు విచారించారు. ఈ నెల 1న ముసాయిదా జాబితాను ప్రదర్శించే నాటికి జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 36,028 మంది ఉండగా.. ఇందులో పురుషులు 23,648, స్త్రీలు 12,373 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు మరో దఫా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. నవంబర్ 1 నాటికి కనీసం మూడు సంవత్సరాల ముందు పట్టభద్రులై ఉండి, నియోజకవర్గ పరిధిలో నివాసి అయి ఉండాలి. ముసాయిదా జాబితాలో పేరు నమోదు కాని వారు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆన్లైన్లో లేకుంటే ఆఫ్‌లైన్‌లో అన్ని తాసిల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముసాయిదా జాబితాలో పేరు, ఫొటో, బంధుత్వం తదితర తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకునేందుకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి పేరు మార్పు కోసం ఫాం-8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముసాయిదా జాబితా నుంచి ఓటు తొలగింపునకు ఫాం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం వచ్చే ఏడాది జనవరి 18న తుది జాబితాను ప్రచురించనున్నారు.