శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Dec 02, 2020 , 00:29:51

అంగన్‌వాడీల్లో ఆధార్‌ నమోదు

అంగన్‌వాడీల్లో  ఆధార్‌  నమోదు

  • భద్రత  కేంద్రాలుగా అంగన్‌వాడీలు
  • బాలికలకు వరం.. సుకన్య ఖాతా 
  • సూపర్‌ వైజర్లకు శిక్షణ 
  • జిల్లాలో 901 కేంద్రాలు 

ఆలేరు టౌన్‌ : ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం ఆధార్‌ లింకప్‌ చేసింది. తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కేంద్రాల పరిధిలోని చిన్నారులకు ఏడు నెలల నుంచి ఆరేండ్లలోపు వారికి బాలామృతం మొదలుకొని గుడ్లు అందిస్తున్నారు. రోగనిరోధక టీకాలు వేయిస్తున్నారు. అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల బోగస్‌ లబ్ధిదారుల పేర్లు నమోదు చేసి పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఇందుకు సంబంధించి సూపర్‌ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆధార్‌ కార్డు ఉన్నవారు ఉంటే, ఆ సంఖ్యతో వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆధార్‌ లేని పిల్లల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలి. కార్డు లేని పిల్లలకు శిబిరం నిర్వహించే తేదీ, సమయం ప్రకటించి పిల్లల ఫొటోలు, తల్లుల వేలిముద్రలు తీసుకునే వీలుగా వారు కేంద్రానికి హాజరయ్యేలా కార్యక్రమాన్ని రూపొందించారు. దీంతో అందరికీ ఆధార్‌కార్డులు అందనున్నాయి.  శిక్షణ పూర్తి చేసుకున్న సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లను కూడా అందజేశారు. వారు వివరాలు తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల ఒకే లబ్ధిదారుపేరు వేర్వేరు కేంద్రాల్లో    నమోదయ్యే అవకాశం ఉండదు. ఆధార్‌ నెంబర్‌ ఆధారంగా ఒకే కేంద్రంలో పేరు ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. 

మహిళలకు భరోసా 

అంగన్‌వాడీ కేంద్రాలు మహిళలకు  భద్రత కేంద్రాలుగా మారనున్నాయి. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు అందాయి. నిత్యం మహిళలపై ఏదో ఒకచోట వేధింపులు జరుగుతున్నాయి. ఇందులో బాలికలు కూడా వివక్షకు గురవుతున్నారు. ఈ విషయంలో బాధిత మహిళలు తమ గోడును చెప్పుకునేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడుతున్నారు.ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకవేళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదులు చేయడం లేదు. ఇక నుంచి మహిళలు, బాలికలు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఫిర్యాదు చేసిన వెంటనే సమాచారాన్ని అంగన్‌వాడీ సిబ్బంది జిల్లా అధికారులకు తెలియజేస్తారు. వెంటనే బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలువనున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు రక్షణ కేంద్రాలుగా  మారనున్నాయి. 

ఐసీడీఎస్‌ ద్వారా సుకన్య ఖాతా  

కేంద్ర ప్రభుత్వం 2015 జనవరిలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో 10 ఏండ్లలోపు బాలికలు చేరే అవకాశం ఉంది. బాలికతో పాటు తల్లి లేదా తండ్రి వివరాలతో కూడిన రూ. 250 చెల్లించి ఖాతా తెరవచ్చు. ఇందుకు సంబంధించి తపాలా శాఖ మహిళా, శిశు సంక్షేమ శాఖ తోడ్పాటుతో ఖాతాలను పెంచుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఖాతా తెరిచిన నాటి నుంచి 15 సంవత్సరాల వరకు ఏటా రూ. వెయ్యి జమ చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా 1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. 15నెలల తర్వాత ఖాతాలో ఎలాంటి డిపాజిట్‌ తీసుకోరు. అమ్మాయికి 21 ఏండ్లు నిండిన తర్వాత జమ చేసిన మొత్తం డబ్బులకు 8శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. అలా కాకుండా 18 ఏండ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. 9 ఏండ్ల బాలిక పేరిట ఖాతాను తీసినైట్లెతే అమ్మాయికి 24 సంవత్సరాలు నిండి పెండ్లి చేసి ఉంటే ఆమె ఖాతాలోకి డబ్బులు నేరుగా జమ అవుతాయి.  

అంగన్‌వాడీల ద్వారా లంచ్‌బాక్స్‌లు 

ఆరోగ్య లక్ష్మి స్కీం కింద గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. కరోనా  నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లు వారి ఇండ్ల వద్దకు వెళ్లి పౌష్టికాహారం అందిస్తున్నారు. మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణులు తొమ్మిది నెలల కాలంలో  ప్రతి సోమ, శుక్రవారాల్లో దవాఖానలకు వెళ్తారు. అక్కడ వారికి సమయానికి టిఫిన్‌ తిందామన్నా ఉండదు. అంతే కాకుండా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఖాళీ కడుపుతో వెళ్తుంటారు. ఒక్కోసారి పేషంట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మరింత ఆలస్యం అవుతుంది. గ్రామాల నుంచి దవాఖానకు వెళ్లాలంటే ఎంతో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంతో వారు అలసటకు గురవుతారు. టైంకు భోజనం చేయకుంటే కడుపులోని శిశువు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం గర్భిణులకు దవాఖానకు వెళ్లే రోజు లంచ్‌బాక్స్‌ అందజేయాలని నిర్ణయించింది. ఇటీవల  వైద్య ఆరోగ్య కమిషనర్‌ కరుణ, ఐసీడీఎస్‌ కమిషనర్‌ దివ్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గర్భిణులు దవాఖానకు వెళ్లే ఒకరోజు ముందు ఆశవర్కర్లు అంగన్‌వాడీ టీచర్లకు సమాచారం ఇస్తారు. దీంతో మరుసటి రోజు వారికి లంచ్‌బాక్స్‌ సిద్ధం చేసి అందజేస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్‌ 1 లేదా 4 నుంచి అమలు చేయనున్నారు. 

జిల్లాలో ఇలా..

జిల్లాలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నా యి. వీటిల్లో గర్భిణులు  5954, బాలింతలు 6049, చిన్నారులు 21,700 మంది ఉన్నారు. 

మహిళలకు అండగా ..

అంగన్‌వాడీ కేంద్రాలు ఎల్లప్పుడూ మహిళలు, బాలికలకు అండగా ఉంటాయి. పిల్లలకు ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన స్కీం బాలికలకు వరంలాంటిది. ఈ స్కీంలో చేరితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే  పారదర్శకత కోసం అంగన్‌వాడీల్లో చిన్నపిల్లలకు ఆధార్‌ నమోదు తప్పనిసరి చేస్తున్నాం. 

- చంద్రకళ, సీడీపీవో, ఆలేరు ఐసీడీఎస్‌ 

ప్రాజెక్టు 

VIDEOS

logo