శనివారం 23 జనవరి 2021
Yadadri - Dec 01, 2020 , 00:36:33

లక్ష్యానికి మించి రుణాలు

లక్ష్యానికి మించి రుణాలు

  • ఈ ఏడాది జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,411.71 కోట్లు
  • సెప్టెంబర్‌ నాటికి నిర్ధేశించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.1,33.93కోట్లు
  • గడువులోగా లక్ష్యానికి మించి వివిధ రంగాలకు అప్పులిచ్చిన బ్యాంకులు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాలు అందించేందుకు జిల్లా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రణాళిక తయారవుతుంది. వార్షిక రుణ ప్రణాళిక ఆధారంగా ఆయా రంగాలకు రుణాలను మంజూరు చేస్తారు. ఇప్పటివరకు ప్రతి యేటా ప్రణాళిక లక్ష్యానికి మించి రుణాలను మంజూరు చేస్తూ వస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 105 శాతం రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. ఈ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,411.7కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రూపొందించారు. వివిధ రంగాల వారీగా కేటాయింపులను నిర్ధేశించారు. అయితే కరోనా పరిస్థితుల్లోనూ.. సెప్టెంబర్‌ మాసం నాటికి నిర్ధేశించిన దానికంటే ఎక్కువ అప్పులను బ్యాంకులు వివిధ రంగాలకు ఇచ్చాయి. రూ.1,339.93కోట్ల రుణ లక్ష్యానికి మించి రూ.1,383.81కోట్ల మేర రుణాలను ఇవ్వడం ద్వారా బ్యాంకులు నూరుశాతం లక్ష్యాన్ని అధిగమించి 103 శాతం లక్ష్యానికి చేరుకున్నాయి. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1,327.14కోట్ల కేటాయింపులు జరపగా.. వానకాలం సాగుకు రూ.797.44కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు సెప్టెంబర్‌ నాటికి 101 శాతం అంటే రూ.808.20 కోట్ల అప్పులను లక్ష్యానికి మించి 83,639మంది రైతులకు ఇచ్చారు. అలాగే యాసంగి సాగు కోసం వార్షిక ప్రణాళికలో రూపొందించినట్లుగా రూ.529.70 కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురవడం, మూసీ జలాలకు తోడు గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున పంటలను సాగు చేసేందుకు ఉపక్రమించారు. ఈ పరిస్థితుల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి.


ఉపాధి రంగాలకు విరివిగా రుణాలు

ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబర్‌ గడువు నాటికి రుణాలను అందించాయి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు కేటాయించిన రుణ లక్ష్యం రూ.119కోట్లుకాగా.. గడువులోపుగా రూ. 115 కోట్లు(96 శాతం) రుణాలను బ్యాంకులు ఇచ్చాయి. అలాగే స్వయం సహాయక సంఘాలకు వివిధ పథకాల కింద రూ.97 కోట్ల రుణాలను ఇవ్వాల్సి ఉండగా.. రూ.99కోట్ల(102 శాతం)రుణాలు అందించి ఆపత్కాలంలో బ్యాంకులు ఆదుకున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.33.72కోట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు జిల్లాలో 6,517 మంది లబ్ధిదారులను గుర్తించారు. అయితే సెప్టెంబర్‌ నాటికి 4,263 మంది లబ్ధిదారులకు రూ.26.75కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకులు ఇవ్వగలిగాయి. మిగతా లక్ష్యాన్ని డిసెంబర్‌ 10 లోపుగా పూర్తి చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా పశు సంవర్ధక, మత్స్యశాఖ రంగాలకు కూడా రుణాలు ఇచ్చి ఆయా రంగాలను బ్యాంకులు అండగా నిలవనున్నాయి. 

లక్ష్యాన్ని పూర్తి చేసేలా చర్యలు 

ఈ ఏడాది జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటు న్నాం. ఎప్పటికప్పుడు బ్యాం కర్లతో సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నాం. వానకాలం సాగుకు నిర్ధేశించిన లక్ష్యాని కంటే ఎక్కువ రుణాలు ఇవ్వడం అభినందనీయం. చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణ లక్ష్యాలను కూడా బ్యాంకులు అందుకున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద సాధించాల్సిన లక్ష్యాలను త్వరలోనే పూర్తిచేస్తాం. యాసంగి సాగుకు కూడా లక్ష్యానికి మించి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- అనితా రామచంద్రన్‌ , కలెక్టర్‌ logo