ఆరోగ్యదీపం.. కార్తికం

- పుణ్యమాసంగా పేరు ప్రతిష్టలు
- పుణ్యస్నానాలు, తులసీపూజలతో సందడి
- ఉసిరి చెట్టుకింద వనభోజనాలకు ప్రాధాన్యం
యాదాద్రి కల్చరల్ : దీపం.. పరబ్రహ్మ స్వరూపం. మానసిక వికాసానికి, నిర్మల హృదయానికి సంకేతం. కార్తిక మాసంలో ఒక్కరోజైనా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లేనని భక్తులు విశ్వసిస్తుంటారు. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసంలో స్నానం, కార్తిక దీపారాధన, ఉపవాసం, ధ్యానం ఆచరించి దానం చేస్తే మోక్షం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. కార్తిక మాసం సోమవారాల్లో పూజలకు భక్తులు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. కార్తిక దీపారాధన, అర్చన, అభిషేకం, లక్షదీపార్చన, తులసీ కల్యాణం, రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తారు. సాధారణంగా శరత్ కాలంలో చలి ఉధృతి పెరుగుతుంది. ఈ కాలంలో పక్షవాతం, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన చలితో శరీరంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. అందుకే ఈ నెలలో వెలిగించే దీపాల పొగ వల్ల హృదయ నాడికి ఎంతో బలం చేకూరుతుంది.
కార్తిక స్నానం...
కార్తిక మాసంలో నదుల్లో స్నానమాచరించి భక్తులు దీపారాధనలు చేస్తారు. గంగ, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర తదితర నదుల్లో స్నానమాచరిస్తే ఎంత పుణ్యఫలం దక్కుతుందో, కార్తిక మాసంలో నదుల్లో స్నానం చేస్తే అంత పుణ్యం దక్కుతుందని శాస్త్రం చెబుతున్నది. తులసీకోట వద్ద ఆవు నెయ్యితో రోజూ దీపారాధన చేస్తే సకలదేవతల ఆశీర్వాదం, ముక్తి కలగడంతో పాటు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భక్తుల విశ్వాసం.
ఉపవాసంతో ప్రయోజనం..
కార్తిక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం ఉంచి పూజాధికాలు నిర్వహించి, నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కనీసం వారానికి ఒకరోజైనా ఉపవాసం చేయడం వల్ల పెద్ద పేగులు శుభ్రం అవుతాయన్నది వైద్యుల మాట. ఉసిరి, రావిచెట్టుకు పూజలు చేసి, ఆ చెట్లకింద భోజనం చేస్తే మేలు జరుగుతుందని భక్తులు భావిస్తారు.
కార్తిక పౌర్ణిమ..
కార్తికమాసంలో వచ్చే పౌర్ణమికి భక్తులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. సాయంత్రం వేళలో శివాలయం, విష్ణు ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఈ మాసంలో రోజూ పూజలు చేయలేనివారు ఆ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని భావిస్తారు. పౌర్ణమి రోజున జ్వాలాతోరణం వేడుకల్లో భాగంగా వేల సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు.
వణికించే చలిలోనూ...
కార్తిక మాసం అనగానే వణికించే చలి.. ఇండ్ల ముంగిట వెలిగే దీపాలు.. ఉపవాసాలు.. శివపూజలు.. ఆరాధనలు.. వన భోజనాలు.. అందరికీ గుర్తుకువస్తాయి. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసం ఆధ్యాత్మికతకు అనుకూలమైనది. ప్రకృతి సహితం సహజత్వాన్ని పవిత్రతత్వాన్ని సంతరించుకుంటుంది. అందుకే ప్రజానీకం భక్తిభావంతో మునిగిపోతుంది. శైవాలయాల బాట పడుతుంది. పుణ్యమాసంగా, భక్తిమాసంగా కార్తిక మాసానికి పేరు. చంద్రుడు కృతికా నక్షత్రంతో కూడిన మాసమే కార్తిక మాసంగా పరిగణిస్తారు. శివుడికి మారేడు దళాలతో, విష్ణువుకు తులసీదళాలతోనూ ఈ మాసంలో పూజిస్తే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
ఆలయాల్లో అంతంత మాత్రమే..
ఏటా కార్తిక మాసంలో కళకళలాడే దేవాలయాలు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మళ్లీ కరోనా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారుల సూచనల మేరకు ఆలయాల్లో అభిషేకాలు, దీపారాధనలు, సత్యనారాయణ వ్రతాలకు స్వస్తి చెప్పారు. దీంతో భక్తులు సత్యనారాయణ వ్రతాలతో పాటు తదితర పూజా కార్యక్రమాలన్ని ఇండ్లలోనే జరుపుకుంటున్నారు.
జ్ఞానానికి ప్రతీక
కార్తిక మాసానికి తెలుగు నెలల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. అంటే జ్ఞానానికి ప్రతీక శివునివంటి దైవం. గంగ కంటే పవిత్రమైన నది, కార్తికంవంటి పుణ్యమాసం మరొకటి లేదు. కార్తికం సమైక్యతను స్ఫూర్తించే మాసం. యేడాది మొత్తంగా ఏవేవో ప్రత్యేకతలు పండుగలు ఉన్నాయి. ఆకుపచ్చని జ్ఞాపకంగా ఉండే కార్తికం వనభోజనాల మాసం. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ ఆప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం. ఐక్యత సాధనకు వనభోజనం ఎంతో శ్రేష్ఠమైనది. కార్తికంతో శరద్ రుతువు పరిపూర్ణమవుతుంది.
కార్తికమాసం ఎంతో పవిత్రమైనది
కార్తిక మాసం ఎంతో పవిత్రమైనది. కృత్తిక నక్షత్రంతో కూడి ఉండడం వల్ల ఈ మాసానికి కార్తిక మాసం అనే పేరువచ్చింది. ఈ నెలలో ఆచరించ దీపారాధన, నదీస్నానాలు, చేసే దాణాలతో ఎంతో పుణ్యం వస్తుంది. భక్తితో పూజలు, వ్రతాలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. పుణ్యస్నానాలు చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
- శ్రావణ్కుమార్జోషి, వేదపండితులు.
తాజావార్తలు
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!
- బీజేపీ పాలనలో మిగిలింది కోతలు.. వాతలే
- విధాన రూపకల్పన ప్రభుత్వానికే పరిమితం కావద్దు: ప్రధాని
- ఈసారి ధోనీ చెత్త రికార్డు సమం చేసిన కోహ్లి
- టైమ్ మ్యాగ్జిన్ కవర్ పేజీపై మహిళా రైతులు