Yadadri
- Nov 30, 2020 , 00:31:04
VIDEOS
కందికి లేదు రంది..

- మెళకువలు పాటిస్తే అధిక దిగుబడి
- యాసంగిలో అధిక మొత్తంలో సాగుకు సన్నాహాలు
- సాగు, కోత దశల్లో జాగ్రత్తలు తప్పనిసరి
భువనగిరి అగ్రికల్చర్ : ఈ సీజన్లో కంది సాగు చేసే రైతు లు కొన్ని మెళకువలు పాటిస్తే మంచి ఫలితాలుంటాయని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజేశ్వర్ నాయక్ సూచిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలోని వ్యవసాయక్షేత్రంలో రైతులకు అవగాహన కల్పించేందుకుగానూ యాసంగిలో కంది సాగును చేపట్టారు. దీన్ని పరిశీలించి రైతులకు ఈ పంట సాగు విధానాలపై ఆయన పలు సూచనలు చేశారు. తెలంగాణలో సుమారు 2.75 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో కంది సాగవుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కందిని అత్యధికంగా రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట సాగు విధానంలో పాటించాల్సిన మెళకువలను రాజేశ్వర్ నాయక్ వివరించారు.
సమగ్ర ఎరువుల యాజమాన్యం:
సేంద్రియ ఎరువులను చివరి దుక్కిలో ఎకరానికి రెండు టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించి ఉపయోగించాలి. 100 మి.లీ. నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు నీటిలో మాగబెట్టి చల్లార్చాలి. ఆ ద్రావణాన్ని 8 కిలోల విత్తనాలపై చల్లాలి. దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలు ఏర్పడేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు పాలిథిన్ సంచులను ఉపయోగించుకోవాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరానికి రెండు కిలోల ఫాస్పో బ్యాక్టీరియా, 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ, విత్తనం విత్తేటప్పుడు కానీ సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. కంది పంటకు 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు తప్పనిసరిగా వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులను వేసుకోవాలి.
సమగ్ర కలుపు యాజమాన్యం :
విత్తనం మొలకెత్తక ముందు పెండిమిథాలిన్ 30 శాతం, ఎకరానికి 1.3 నుంచి 1.6 లీ, 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ, మరుసటి రోజు కానీ పిచికారీ చేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన తర్వాత పైరు 20రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ (పర్సుట్) 300 మి.లీ ఎకరానికి పిచికారీ చేయాలి. గడ్డిజాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే క్విజలోపాస్-పీ- ఇథైల్ 5శాతం ఈ.సీ, 400 మి.లీ. లేదా ప్రోపాక్విజాపాస్ 10 శాతం ఈ.సీ 250 మి.లీ. లేదా ఫినాక్సాఫ్రాప్ ఇథైల్ 9.3 శాతం 250 మి.లీ. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందులు పిచికారీ చేస్తున్నప్పుడు భూమిలో తగిన తేమ ఉండేలా రైతులు చూసుకోవాలి. విత్తనం వేసిన 30 నుంచి 60 రోజులకు గుంటుకతోకానీ, గొర్రుతో కానీ దంతెతో కానీ అంతర కృషి చేయాలి. విత్తిన 60 రోజుల వరకు జాగ్రత్తలు పాటిస్తే పంటను కలుపు మొక్కల నుంచి రక్షించుకోవచ్చు. బాగా ఎడంగా విత్తిన కందిలో ట్రాక్టర్, కల్టివేటర్‌తో కానీ, మినీ ట్రాక్టర్ రొటవేటర్‌తో కానీ అంతర కృషి చేసిన కలుపును నివారించితే నేలలో తేమను సంరక్షించవచ్చు. కందికి సుమారు 250- 300 మి.మీ నీరు అవసరమవుతుంది. అందుకు గానూ 4 లేదా 5 తడులు అందించాలి. మొగ్గ రాబోయే ముందు కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీటిని అందించాలి. ఈ కీలక దశల్లో నీరు ఎక్కువైనా, బెట్టకు గురైనా పూత, కాత రాలిపోతుంది.
పంట కోత దశలో, కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కంది పంట రకాన్ని బట్టి పూత ఏర్పడిన 45-60 రోజుల్లో పక్వతకు వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాలోఫాస్ 25 ఈ.సీ 2 మి.లీను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే నిల్వలో బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడుకోవచ్చు. 80 శాతం కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత పంటను కోయాలి. పంటను కొడవలితో మొక్క మొదలు వరకు కోయాలి. లేదా బాగా పరిపక్వత చెందితే ఆకులు రాలిపోయిన తర్వాత యంత్ర సహాయం (కంబైన్డ్ హార్వెస్టర్)తో కూడా పంటను కోసుకోవచ్చు. పంట కోత అనంతరం 10-12 రోజులు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేసుకోవాలి.
తాజావార్తలు
- మీ మాజీ సీఎం చెప్పులు మోయడంలో నిపుణుడు..
- రాహుల్.. మీకు మత్స్యశాఖ ఉన్న విషయం కూడా తెలియదా?
- 15 ఏండ్ల తర్వాత ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రత
- ఉప్పెన దర్శకుడి రెండో సినిమా హీరో ఎవరో తెలుసా?
- నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ‘మహా’ నమూనాలు
- ఇండో-పాక్ సంబంధాల్లో కీలక పరిణామం.. మళ్లీ చర్చలు షురూ!
- రెచ్చిపోయిన పృథ్వీ షా.. మెరుపు డబుల్ సెంచరీ
- కఠిక పేదరికాన్ని నిర్మూలించాం.. ప్రకటించిన చైనా అధ్యక్షుడు
- కళ్లు దుకాణాల్లో సీసీ కెమెరాలు
- షాకింగ్ : పక్కదారి పట్టిందనే ఆగ్రహంతో భార్యను హత్య చేసి..
MOST READ
TRENDING