మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Nov 28, 2020 , 00:17:13

నివర్..ఫీవర్

నివర్..ఫీవర్

  • జిల్లాపై నివర్‌ తుఫాన్‌ ప్రభావం
  • పడిపోయిన పగటి ఉష్టోగ్రతలు
  • పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన ముసురు

భువనగిరి/ఆలేరు/అడ్డగూడూరు/రామన్నపేట/వలిగొండ/బీబీనగర్‌/గుండాల/చౌటుప్పల్‌/మోత్కూరు/తుర్కపల్లి/సంస్థాన్‌ నారాయణపురం/ఆత్మకూరు(ఎం) : నివర్‌ తుఫాన్‌ తీరం వైపు వడివడిగా పయనిస్తూ బలహీనపడిన నేపథ్యంలో జిల్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శీతల గాలులకు తోడు ఉష్టోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. అన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన ముసురు కరుస్తుంది. పగలు ఉష్ణోగ్రత మూడురోజుల కిందట 22 డిగ్రీలు ఉండగా, శుక్రవారం రోజున 18 డిగ్రీలకు పడిపోయింది. రాబోయే రోజుల్లో వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది.

జిల్లాలో వారం రోజులుగా ఓ మోస్తరుగా ఉన్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం తగ్గిపోవడంతో చలి గుప్పిట్లో జిల్లా వణిపోయింది. తెల్లవారుజాము నుంచి చల్లనిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది చలికాలం మొదలైన తరువాత నవంబర్‌లోనే రికార్డు స్థాయిలో 19 డిగ్రీలకు పడిపోవడం ఆందోళన కలిగించింది. తరువాత మళ్లీ వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఊరట చెందారు. కానీ తాజాగా నివర్‌ తుఫాన్‌ ఎఫెక్టుతో గురువారం 19 డిగ్రీలు, శుక్రవారం 18 డిగ్రీలకు పడిపోవడంతోపాటు ఉదయం సమయంలో గాలి తేమ 98 శాతానికి చేరుకోగా, మధ్యాహ్నం వరకు 70 శాతానికి రాగా సాయంత్రం వరకు గాలిలో తేమ 75 నుంచి 85 శాతానికి చేరుకుంటున్నాయి. 

కనిపించని సూర్యుడు..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా పొగ మంచు కమ్మేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్పుడప్పుడు తప్పా దాదాపుగా సూర్యుడు కనిపించలేదు. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో రెండురోజులుగా సూర్యుడు ముఖం చాటేశాడు. వాతావరణంలో శీతలగాలుల తీవ్రత అలాగే ఉంది. సాయంత్రం 6 గంటల లోపే రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కరోనా రెండో దశ నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఉన్ని దుస్తులు, మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. 

పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు.. ముసురు

తుఫాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన ముసురు కురుస్తుంది. భువనగిరి జిల్లా కేంద్రంతోపాటు ఇటు భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి మండలాల్లో గత రెండు రోజులుగా ఈదురుగాలులతో కూడిన ముసురు కురుస్తుంది. దీంతో చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రావాలంటే ఒంటినిండా నూలు బట్టలు వేసుకుని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని బయటకు వస్తున్నారు. కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  వర్షం కారణంగా ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో  ధాన్యం కొనుగోళ్లను నిలిపి వేశారు. కోతకు వచ్చిన సన్న రకం ధాన్యం ఇంకా కొన్నిచోట్ల పొలాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైసు మిల్లుల వద్ద బియ్యం కోసం ఆరబెట్టిన ధాన్యం కొంతవరకు తడవగా మరో రెండురోజుల పాటు తుఫాన్‌ ఉండటంతో ఆరబెట్టిన ధాన్యం రాశులపై రైతులు పట్టాలు కప్పారు.  

రైతులపై తీవ్ర ప్రభావం..

తుఫాన్‌ ప్రభావం జిల్లా రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోది. తొలుత చిరుజల్లులతో ప్రారంభమైన తుఫాన్‌ క్రమ క్రమంగా వేగాన్ని పుంజుకుంటోంది. శుక్రవారం ఉదయం మబ్బులతో ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి పూర్తిగా మారిపోయి ఎడ తెరిపి లేకుండా ముసురుతో కూడిన వర్షం కురుస్తోంది. ఈ వర్షాలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొస్తున్న తరుణంలో వరుణుడి రూపంలో కబళించినైట్లెంది. పంట చేతికి రావడంతో అధికారులు సూచించిన కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు  రాశులుగా పోసి ఉంచారు. కాగా, అకాల వర్షం జిల్లాను తాకుతుందని ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర  ప్రభుత్వం సూచన మేరకు కలెక్టర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. కానీ వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతులు తీసుకొని వచ్చిన ధాన్యం మొత్తం వర్షానికి తడిసి పోయింది. మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌లో, పొడిచేడు, ముశిపట్ల, అడ్డగూడూరు మండలంలోని లక్ష్మీదేవికాల్వ, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో రాశులు పోసుకున్న ధాన్యం తడిసి ముైద్దెంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షానికి తడిసి ధాన్యం ఆరబెట్టుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.

VIDEOS

logo