జిల్లాలో రికార్డు స్థాయిలో ఇంటి పన్ను వసూలు

- కరోనా పరిస్థితుల్లోనూ ట్యాక్స్ 57.0 శాతం, నాన్ ట్యాక్స్ 45.96 శాతం వసూలు
- వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి లక్ష్యాన్ని చేరేలా కార్యాచరణ
- ధరణి పోర్టల్తోనూ పంచాయతీలకు ఆర్థిక అభివృద్ధి
- స్వపరిపాలనలో అభివృద్ధి పనులకు మరింత ఊతం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 17 మండలాల పరిధిలో ఉన్న 421 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నెలనెలా ప్రభుత్వం ఇస్తున్న నిధులను అందిపుచ్చుకోవడంతోపాటు పన్నులను వసూలు చేసి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలుగుతున్నాయి. ట్యాక్స్, నాన్ ట్యాక్స్ కలిపి గతేడాది 94 శాతం వసూలు కాగా.. ఈ ఏడాది కరోనా పరిస్థితులు ప్రతిబంధకంగా ఉన్నప్పటికీ గడువుకు నాలుగు నెలల ముందే ఆశించిన స్థాయిలో పన్నులు వసూలు చేయగలిగారు. ఈ ఏడాదిలో పాత, కొత్త పన్నులకు సంబంధించి రూ.9.74కోట్ల వరకు ట్యాక్స్ బకాయిలు పేరుకుపోయాయి. అలాగే రూ.3.68 కోట్ల వరకు నాన్ట్యాక్స్ వసూలు కావాల్సి ఉంది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జులైలోగా పంచాయతీలు పన్ను వసూలు చేయాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల లక్ష్యం చేరుకోకపోతే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తూ పన్ను వసూలు చేసేలా చట్టంలో వీలు కల్పించారు. అయితే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభం కంటే ముందే కరోనా వైరస్ ప్రభావం చూపడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నెలలపాటు లాక్డౌన్ను విధించాయి. దీని ప్రభావం పంచాయతీల్లో పన్ను వసూలుపై పడింది. లాక్డౌన్ సడలింపు అనంతరం ప్రభుత్వం పంచాయతీల్లో పన్ను వసూలుకు జూన్ నుంచి సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. దీంతో పంచాయతీల్లో నాలుగు నెలలపాటు పన్ను వసూలు చేశారు. జిల్లాలో 2020-21 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ రూ.9,74,87,808 వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, రూ.5,56,30,064 వసూలు అయ్యింది. మరో రూ.3,68,25,635 నాన్ట్యాక్స్ వసూలుకుగాను, రూ.1,69,23,783 వసూలైంది. ట్యాక్స్ వసూలులో అత్యధికంగా బీబీనగర్ మండలంలో రూ.97,90,442 వసూలు చేశారు. అత్యల్పంగా మోత్కూరు మండలంలో రూ.4,83,352 వసూలైంది. అలాగే నాన్ ట్యాక్స్ వసూళ్లలో బీబీనగర్ మండలంలో రూ.61,83,111 వసూలు అయి ముందు వరుసలో ఉండగా, అడ్డగూడూరు మండలంలో రూ.1,00,701 మాత్రమే వసూలై వెనుకబడిపోయింది.
‘ధరణి’తోనూ ఆదాయం
ఇప్పటివరకు కేవలం 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడిన పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ఆర్థిక వనరులను కల్పిస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్ పూర్తయినా గ్రామ పంచాయతీలకు సమాచారం ఉండేది కాదు. మ్యుటేషన్ కోసం దస్తావేజు సమర్పిస్తేనే పంచాయతీలకు తెలిసేది. ధరణితో ఈ తరహా వాటికి ఫుల్స్టాప్ పడనుంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించడంతో ఇంటి, నల్లా పన్ను, విద్యుత్చార్జీల బకాయిలు లేనట్లు రిజిస్ట్రేషన్ సందర్భంగా విధిగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లే పూర్తి చేయనుండగా.. ఆయా పంచాయతీల్లో ఉన్న మార్కెట్ విలువకు అనుగుణంగా 1 నుంచి 5 శాతం వరకు రుసుము వసూలు చేయనున్నారు. ఆన్లైన్లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆటోమేటిక్గా నిర్దేశిత ఫీజు పంచాయతీల ఖాతాల్లో జమకానుంది.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు