ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 24, 2020 , 00:01:16

జిల్లా ప్రజానీకానికి భారీగా ఊరటనిచ్చిన నిర్ణయాలు

జిల్లా ప్రజానీకానికి భారీగా ఊరటనిచ్చిన నిర్ణయాలు

  • డిసెంబర్‌ 1 నుంచి ఉచిత విద్యుత్‌ అమలు  
  • లాండ్రీ దుకాణాలకు రూ.6.50 లక్షలు లబ్ధి  
  • కరోనా కాలానికి వాహనాల పన్ను రద్దు 
  • జిల్లాలో 17,047 వాహనాలకు మినహాయింపు కేసీఆర్‌ సారు మంచోడు..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలం గాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం తెలంగాణ భవన్‌లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ ప్రత్యేక మేనిఫోస్టోను విడుదల చేయగా.. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అదే పద్ధతిని అవలంభించారు. మేనిఫెస్టో రూపంలో ప్రజలకు అనేక తీపి కబుర్లను అందించారు. గ్రేటర్‌ ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్ణాలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో వరాలు ప్రకటించారు. దీంతో జిల్లాలోని అనేక వర్గాలు మేనిఫెస్టో అమలుతో లబ్ధిపొందనున్నాయి. లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించగా జిల్లాలో ఉన్న ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 650 దుకాణదారులకు లబ్ధి కలుగనుంది. ఒక్కో లాండ్రీ దుకాణానికి ప్రతి నెలా వినియోగాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1400 వరకు విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. జిల్లాలో 16 వరకు దోబీఘాట్లు ఉండగా ప్రస్తుతం 8 వరకు పనిచేస్తుండగా వీటికి ప్రతి నెలా రూ.2వేలకు పైనే విద్యుత్‌ బిల్లు వస్తోంది. డిసెంబర్‌ నుంచే ఉచిత్‌ విద్యుత్‌ను అందిస్తుండడంతో జిల్లాలో రజకులకు రూ.6.50 లక్షల వరకు కరెంటు బిల్లులు ఆదా కానున్నాయి. క్షౌరశాలలకు కూడా డిసెంబర్‌ నుంచి ఉచిత కరెంట్‌ ఇస్తామని ప్రకటించి నాయీ బ్రాహ్మణుల పట్ల గొప్ప ఉదారతను చూపారు. జిల్లాలో 840 వరకు క్షౌరశాలలు నడుస్తుండగా.. ఒక్కో క్షౌరశాలకు నెలకు రూ.900 నుంచి రూ.1500 వరకు కరెంటు బిల్లు వస్తోంది. ఏసీని వినియోగిస్తే ఇంతకంటే ఎక్కువగానే బిల్లు ఉంటోంది. ఈ లెక్కన జిల్లాలో క్షౌరశాలలు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులకు నెలనెలా రూ.8లక్షల వరకు కరెంటు బిల్లులు మిగులుబాటు కానున్నాయి. 

ఆలేరు : నా పేరు సంగం శివకుమార్‌. మాది యాదగిరిగుట్ట. నేను నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న. మా తాతల కాలం నాటి నుంచి క్షౌరం చేసుకుంటూనే బతుకుతున్నం. క్షౌరం దుకాణంలో కరెంటు ఉంటేనే గిరాకీ వస్తది. మా తాతల కాలంలో  ఇంటికి వెళ్లి గానీ, చెట్టుకింద గానీ జుట్టు కత్తిరించేది. కానీ ఇప్పుడు క్షౌరంలో చాలా మార్పులు వచ్చాయి. కరెంటు లేనిది జుట్టు కత్తిరించే పరిస్థితి లేదు. ప్రతిదానికి కరెంటు అవసరంగా మారింది. లేకపోతే క్షౌరానికి యువకులు వస్తలేరు. కానీ కరెంటు బిల్లు మాత్రం నెలకు రూ.500 నుంచి 1000 వరకు వస్తుంది. కరెంటు బిల్లు లేకుండా ఉంటే బాగుంటుందని గత ప్రభుత్వ హయాంలో మొర పెట్టుకున్నాం. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మాలాంటి వెనుకబడిన కులాలకు సీఎం కేసీఆర్‌ మంచిగ చేస్తుండు. మాకు కూడా ఏదో ఒకటి చేస్తే మంచిదనుకున్న సీఎం గత ఎన్నికల సమయంలో కమర్షియల్‌ మీటర్‌ నుంచి డొమోస్టిక్‌ మీటర్‌కు బదలాయిస్తానని చెప్పిండు. కానీ ఎందుకో అది కాలేదు. ఇస్తడో ఇయ్యడోనని అనుకున్నం. ఇప్పుడు కేసీఆర్‌ ఒక్కసారిగా ప్రతి సెలూన్‌కు ఉచితంగా కరెంటు ఇస్తానని, అది కూడా వచ్చే డిసెంబర్‌ నుంచి అమలు చేస్తానని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. ఆయన ఇచ్చిన ఈ హామీతో జిల్లాలో సుమారు 1000 దుకాణాదారులకు ఎంతో మేలు కలుగుతుంది. అయితే గత కరోనా విపత్తులో సెలూన్లన్నీ మూసి ఉన్నాయి. దీంతో ఉపాధికి తీవ్ర ఇబ్బందయ్యింది. సీఎం కేసీఆర్‌ దయ తలిచి ఏదైనా ఆర్థిక సాయం అందజేస్తే ఇంకా సంతోషిస్తాం.

పరిశ్రమలకు భారీ ఊరట

జిల్లాలో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో విస్తరించి ఉన్నాయి. ఇందులో అనేక పరిశ్రమలు హెచ్‌డీ, ఎల్టీ కేటగిరీ విద్యుత్‌ కనెక్షన్లతో నడుస్తున్నాయి. కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్‌తో పరిశ్రమలు నడవకపోవడంతో ఆయా వర్గాలకు భారీగా ఊరట కల్పించేలా సీఎం కేసీఆర్‌ మేనిఫోస్టోలో వరాలను ప్రకటించారు. కరోనా కాలానికి సంబంధించి ఆరు నెలల కాలానికి కనీస విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల జిల్లాలో సినిమా థియేటర్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు నడుపుకుంటున్న వేలాది మందికి ఊరట కలుగుతోంది. జిల్లాలో ఉన్న 457 హెచ్‌డీ కనెక్షన్లపై ప్రతి నెలా 29 కోట్ల 95 లక్షల వరకు విద్యుత్‌ ఖర్చవుతోంది. అలాగే 4,359 ఎల్టీ కనెక్షన్లకు సంబంధించి కోటి 67లక్షల వరకు విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. ఆరు నెలల కాలానికి కనీస విద్యుత్‌ డిమాండ్‌ చార్జీలను రద్దు చేయడం వల్ల ఎంతలేదన్నా రూ.80 కోట్లకు పైనే విద్యుత్‌ ఛార్జీలు రద్దు అవుతాయని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న 8కి పైగా సినిమా థియేటర్ల యాజమాన్యాలకు సైతం సీఎం కేసీఆర్‌ ప్రకటనలో వెసులుబాటు కలుగుతోంది. జిల్లాలో మ్యాక్సీ క్యాబ్‌లు 493, మోటర్‌ కార్లు 12,061, మోటర్‌ క్యాబ్‌లు 1,410, ఓమ్నీ బస్సులు 560, స్టేజ్‌ కేరియర్‌లు 177, త్రీ వీలర్‌ గూడ్స్‌ వెహికిల్స్‌ 2,346 కలిపి మొత్తం 17,047 ట్రాన్స్‌పోర్టు వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలకు సంబంధించి రూ.కోట్లలో వాహన పన్నులు పేరుకుపోయాయి. లాక్‌డౌన్‌ వల్ల తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని వాహనదారులు చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ వారికి కూడా ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ప్రకటించారు. దీనివల్ల ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ నెలలకు సంబంధించి రెండు త్రైమాసికాల పన్ను సుమారు రూ.7కోట్ల వరకు మాఫీ కానుంది. 

మాట తప్పని సారు సీఎం కేసీఆర్‌..

భువనగిరి అర్బన్‌: ఇచ్చిన మాట తప్పనిసారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారు. కటింగ్‌ షాపులకు కరెంట్‌ బిల్లును మాఫీ చేస్తానని చెప్పి అమలు చేయడంతో చాలా సంతోషంగా ఉన్నది. జిల్లాలో మొత్తం 840 కటింగ్‌ షాపులు కలవు. ఒక్కో కటింగ్‌ షాపునకు నెలకు బిల్లు రూ.900, ఏసీ షాపులకు నెలకు రూ.1500 వరకు వస్తుంది. వేసవి కాలంలో కరెంట్‌ బిల్లు మరింత ఎక్కువగా వస్తది. ముఖ్యమంత్రి సారు చెప్పినట్టుగా మా షాపులకు వాడుకునే కరెంట్‌ బిల్లు మాఫీ చేయడంతో మాకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. గతంలో నాయీబ్రాహ్మణులను గుర్తించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ఆదుకున్న సీఎం సారుకు రుణపడి ఉంటాం. 

- వేముల సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు

రజకుల సమస్యలు తీరిపోతాయి

వలిగొండ: దోబీ ఘాట్ల నిర్మాణంతో 90 శాతం రజకుల సమస్యలు తీరుతాయి. గ్రామీణ ప్రాంతంలో దోబీఘాట్లు లేక రజకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కుల వృత్తిని వదలకూడదని 20 ఏండ్లుగా బట్టలను ఇస్త్రీ చేసుకుంటూ బతుకుతున్న. గతంలో రజకుల సంక్షేమం, ముఖ్యంగా వెనుకబడిన కులాల గురించి ఆంధ్రా పాలకులు ఆలోచించ లేదు. స్వరాష్ట్రంలో, సొంత పాలనలో ముఖ్యమంత్రి రజకుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి గొప్పగా అమలు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- సముద్రాల కిష్టయ్య, ఇస్త్రీ షాపు యజమాని, వలిగొండ

రజకులను ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు..

భువనగిరి అర్బన్‌: రజకులను గతంలో ఏ ప్రభుత్వాలు గుర్తించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంకనే రజకుల కులాన్ని కేసీఆర్‌ సారు గుర్తించిండు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే ఇస్త్రీ షాపులకు, దోబీఘాట్‌లకు ఉచితంగా కరెంటు అమలు చేయడంతో రజకులం సీఎం సారును ఏనాటికి  మరిచిపోము. జిల్లాలో మొత్తం 650కి పైగా ఇస్త్రీ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాపునకు నెలకు 1000 నుంచి 1400 వరకు కరెంటు బిల్లు వస్తుంది. డిసెంబర్‌ నుంచి కరెంటు బిల్లు మాఫీ అమలు చేస్తున్నందుకు సీఎం సారు రుణపడి ఉంటాం.

- నీలం లక్ష్మీనారాయణ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు

టాక్స్‌ రద్దు చేసినందుకు కృతజ్ఞతలు

భువనగిరి అర్బన్‌: టాక్స్‌ను రద్దు చేసినందుకు సీఎం కేసీఆర్‌ సారుకు ప్రత్యేక కృతజ్ఞతలు. లాక్‌డౌన్‌ సమయంలో ఆటోలు నడవకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరోనా కాలంలో ఆటోలకు గిరాకీ లేకపోవడంతో టాక్స్‌ కట్టలేదు. మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకు ట్రాన్స్‌పోర్టు వాహనాల రెండు విడుతల టాక్స్‌ను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆర్థికంగా ఎంతో ఊరట లభించింది.    

- గణబోయిన వెంకటేశ్‌,ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

VIDEOS

logo