శనివారం 28 నవంబర్ 2020
Yadadri - Nov 22, 2020 , 00:03:17

సెల్‌ఫోన్‌లో స్లాట్‌బుకింగ్‌

సెల్‌ఫోన్‌లో స్లాట్‌బుకింగ్‌

  • అదనపు రుసుము తప్పడంతో ప్రయోజనం
  • మరింత చేరువైన ధరణి ఆన్‌లైన్‌ సేవలు

ఆలేరు రూరల్‌: ధరణి సేవలు మరింత చేరువయ్యాయి. పారదర్శకంగా సేవలు అందుతున్నాయి. భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదై ఉండడంతో మీ సేవకు వెళ్లకుండానే  సెల్‌ఫోన్‌ ద్వారా స్లాట్‌బుకింగ్‌ చేసుకునే అవకాశం  ఏర్పడింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

బుకింగ్‌ ఇలా..

భూముల క్రయవిక్రయాల కోసం సెల్‌ఫోన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. మీ సేవ కార్యాలయాలకు వెళ్లలేనివారు ఇంట్లో నుంచే సెల్‌ఫోన్‌ ద్వారా స్లాట్‌ బుక్‌చేసుకోవచ్చు. ధరణి పోర్టల్‌లో సెల్‌ఫోన్‌ నంబర్‌ నమోదుచేస్తే ఓటీపీ ఆధారంగా సైట్‌ తెరుచుకుంటుంది. స్లాట్‌ బుకింగ్‌ పేజీలోకి వెళ్లి సమాచారాన్ని నమోదుచేస్తే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దీని ఆధారంగా కొత్త పాస్‌వర్డ్‌ నమోదుచేస్తే రిజిస్ట్రేషన్‌ భూముల క్రయ,విక్రయాలు(కొనుగోలు , గిఫ్ట్‌, వారసత్వం, భాగస్వామ్యం) ఇలా భూముల రకాలు కనిపిస్తాయి. అవసరమైన దానిపై క్లిక్‌ చేసి భూమి విస్తీర్ణం, ఆధార్‌కార్డు, సర్వేనంబరు, పేర్ల్లు, సాక్షుల పేర్లు ఇతర వివరాలు అప్‌లోడ్‌ చేయాలి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చలానా వస్తుంది. సెల్‌ఫోన్‌ద్వారా స్లాట్‌ బుక్‌చేస్తే అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. 

జాప్యం లేకుండా

భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఇప్పటి వరకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే రిజిస్ట్రార్‌ కార్యాలయంలో  వారం రోజుల తరువాత రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం వచ్చేది. ధరణి అందుబాటులోకి రావడంతో ఒకే రోజులో భూ రికార్డుల బదలాయింపు, పట్టాదారు హక్కులు పొందే వీలు ఏర్పడింది. రైతులు నెలల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త చట్టం అమలు నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు రెండు నెలలుగా రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోయాయి. తహసీల్‌ కార్యాలయాల్లో ఈ నెల 2 నుంచి రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. స్లాట్‌ బుకింగ్‌ అనంతరం సంబంధిత పత్రాలు, ఇద్దరు సాక్షులతో కొనుగోలు, అమ్మకందారులు తహసీల్‌ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ధరణి ఆపరేటర్‌ బయోమెట్రిక్‌, ఫొటో తీసుకుని తహసీల్దార్‌ (జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌) లాగిన్‌కు పంపిస్తారు. తహసీల్దార్‌ అన్ని వివరాలను పరిశీలించిన తరువాత మళ్లీ  ఆపరేటర్‌ లాగిన్‌కి వస్తాయి. రెండో సారి పరిశీలన చేసిన తరువాత తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేస్తారు. అప్పటికప్పుడే ఈ -పాస్‌ పుస్తకం అందజేస్తారు. ధరణి పోర్టల్‌లో వివరాలు కనిపిస్తాయి. అరగంట లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. పట్టాదారు పాస్‌పుస్తకం పోస్టాఫీసు ద్వారా ఇంటికి వస్తుంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల్లకు సైతం అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.  

ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో చేసుకోవచ్చు

ధరణి పోర్టల్‌కు సంబంధించి స్లాట్‌ బుక్‌ చేసుకోవడానికి మీ-సేవ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఉంటే అందులోనే స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ధరణి కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఆండ్రాయిడ్‌ మొబైల్‌ వినియోగిస్తున్నాడు. కంప్యూటర్‌, ప్రింటర్‌ ఉన్నవారు నేరుగా తమ ఇండ్లలోనే నమోదు చేసుకొని ప్రింట్‌ తీసుకోవచ్చు. రైతుల సమయానికి అనుగుణంగా అధికారులు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

- రజిత మీసేవ నిర్వాహకురాలు.ఆలేరు