రైతు వేదికల నిర్మాణాలు పూర్తిచేయాలి

కలెక్టర్ అనితారామచంద్రన్
భువనగిరి కలెక్టరేట్ : రైతు వేదికల నిర్మాణాలను ఈ నెల చివరిలోగా పూర్తిచేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ సూచించారు. శనివారం పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో కార్యనిర్వాహక ఇంజినీర్ జగ్గారెడ్డితో ఆమె సమావేశమయ్యారు. జిల్లాలో చేపట్టిన రైతువేదికలను ఈ నెల చివరిలోగా, వైకుంఠధామాలను డిసెంబర్లోగా పూర్తిచేయాలని కోరారు. ఇప్పటి వరకు చేపట్టిన రైతు వేదికలు, వైకుంఠధామాల ప్రగతిని కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటి వరకు 82 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా, వివిధ దశల్లో ఉన్న 10 రైతు వేదికలను అన్ని హంగులతో వారంలోగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని 92 క్లస్టర్లలో 92 రైతు వేదికలను ఒక్కొక్కటి రూ. 22 లక్షలతో 2000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 82 రైతు వేదికల నిర్మాణం పూర్తికాగా మరో 10 వివిధ దశల్లో ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభా గం ద్వారా చేపట్టిన 300 వైకుంఠధామాలను డిసెంబర్లో పూర్తి చేయాలన్నారు.
నిర్మాణ పనుల్లో వేగంపెంచాలి
వలిగొండ: రైతు వేదికల నిర్మాణాల్లో వేగంపెంచాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. శనివారం మండలంలోని గోకారంలో రైతు వేదిక నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యణా ప్రమాణాలు పాటించి ఏడు రోజుల్లోగా రైతు వేదిక నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రంగు మారిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా, కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ నూతి రమేశ్రాజ్, సర్పంచ్ తుర్కపల్లి మాధవి, ఎంపీడీవో గీతారెడ్డి, తహసీల్దార్ నాగలక్ష్మి, ఎంపీవో ఈశ్వర్ పాల్గొన్నారు.
డి.రేపాకలో...
అడ్డగూడూరు: రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ అన్నారు. మండలకేంద్రంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవనం, మండలంలోని డి.రేపాకలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమె వెంట ఏడీఏ వెంకటేశ్వర్లు,ఏఈవోలు శ్రీశైలం, దయాకర్ ఉన్నారు.