ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Nov 21, 2020 , 00:53:24

గొర్రెలు, మేకలకు కూడా బీమా వర్తింపు

గొర్రెలు, మేకలకు కూడా బీమా వర్తింపు

  • ఆరేండ్ల తర్వాత అమలు 
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ఆలేరు టౌన్‌ : పాడి రైతుకు ధీమా ఇచ్చేది పశువుల బీమా.. సేద్యానికి అనుబంధంగా పాడిపశువులు ఉన్న రైతులకు  బీమా ఎంతో మేలు చేస్తుం ది. జిల్లాలో ఎంతో మంది పాడిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. పాల ఉత్పత్తి లాభసాటిగా మారింది. కానీ ఏదైన  కారణం వల్ల పశువులు చనిపోతే పెద్దమొత్తంలో నష్టం జరుగుతున్న ది. దీనికి పరిష్కారంగా పశువులకు బీమా చేయించుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఆవులు, గేదెల వంటి పాడిపశువులతో పాటు ఎద్దులు, గొర్రెలు, మేకలు తదితర పశు సంపద మొత్తానికి బీమా వర్తించనున్నది. ఒక్కో పశువుకు చెల్లించే బీమా ప్రీమియం లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 80శాతం కాగా.. రైతు 20 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పశువులు, గొర్రెలు, మేకలకు 2014కు ముందు బీమాసౌకర్యం ఉండేది. ఆ తర్వాత బీమా కంపెనీలతో ఒప్పందం లేకపోవడంతో నిలిచిపోయింది.

ప్రీమియం నిర్ధారణ కాలేదు 

బీమా పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే బీమా ప్రీమియాన్ని ఎంత చెల్లించాలో నిర్ధారించలేదు. అంతే కాకుండా ఎన్ని పశువులకు వర్తిస్తుందో కూడా పేర్కొనలేదు. ఇప్పటికే ప్రభుత్వం అందజేసిన గొర్రెల పథకంతో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన పశువులకు బీమా వర్తించదు. అయితే  పోషకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.దీనికి సంబంధించిన దరఖాస్తులు పశువుల దవఖానాల్లో గోపాలమిత్రల వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, విషప్రభావం, పాముకాటు, క్రూర మృగాల బారిన పడి చనిపోతే, అంతే కాకుండా రోడ్డు ప్రమాదాలు, విద్యుత్‌ షాక్‌, వరదలు, తుఫాన్ల ప్రభావంతో చనిపోతే ఆ యజమానికి బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ఇది ఇలా ఉంటే గతంలో ఒక్కో గొర్రెకు రూ.45 బీమా ప్రీమియం చెల్లిస్తే రూ. 2వేల నుంచి 3వేల వరకు పరిహారం అందేది. పశువులు చనిపోతే గరిష్టంగా రూ. 30వేలు ఇచ్చేవారు. 2012లో బీమా విలువను రూ. 60వేలకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ  2014 వరకే వర్తించింది. దీంతో ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ బీమాచేయించాలని ఆదేశాలు జారీ చేసింది. పశువులు చనిపోతే స్థానిక పశువైద్యాధికారికి తెలియజేయాలి. పశు వైద్యాధికారి పోస్టుమార్టం జరుపుతారు. ప్రమాదం వల్లే మృతి చెందిందని తేలగానే రైతు ఖాతాల్లో పరిహారం జమచేస్తారు. జిల్లాలో పాడి ఆవులు, గేదెలు లక్షా86వేలు ఉన్నాయి. గొర్రెలు ఆరు లక్షలు, మేకలు లక్షా22వేలు ఉన్నాయి. పశు వైద్యశాలలు 29, గ్రామీణ వైద్య శాలలు 42, ఏరియా పశువైద్యశాలలు మూడు ఉన్నాయి. 

సద్వినియోగం చేసుకోవాలి 

బీమా పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. కాపర్లకు  ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా పరిహారం అందుతుంది. దురదృష్టవశాత్తు చనిపోతే ఆర్థికనష్టాన్ని బీమాతో పూడ్చుకోవచ్చు.  

-జల్లి నర్సింహులు, ఉమ్మడి జిల్లా గొర్రెలు, 

మేకల పెంపకందారుల సంఘం సభ్యుడు 

ప్రీమియం  ఎంతో చెప్పాలి..బీమా పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది పునరుద్ధరించడం సంతోషంగా ఉంది. అయితే ప్రీమియం ఎంతో అధికారులు చెప్పాలి. బీమా చేయడం ద్వారా ధీమాగా ఉండవచ్చు. సహజంగా చనిపోతే కూడా బీమా వర్తింపజేయాలి. ఒక కుటుంబంలో ఎన్ని పశువులకు బీమా వర్తిస్తుందో వెల్లడించాలి.   

-జూకంటి ఉప్పలయ్య, రైతు, ఆలేరు 

బీమా ద్వారా నష్టాన్ని పూడ్చుకోవచ్చు

ఏదైనా విపత్తులతో, ప్రమాదాల్లో చనిపోతే బీమా ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు. జిల్లాకు ఏ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఇస్తారో, ప్రీమియం ఎంత చెల్లించాలో వివరాలతో కూడిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు  పశువైద్యాధికారులను  సంప్రదించాలి. 

- కృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, యాదాద్రి 


VIDEOS

logo