గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 21, 2020 , 00:25:28

తొలగనున్న ప్రయాణికుల ఇక్కట్లు

తొలగనున్న ప్రయాణికుల ఇక్కట్లు

  • సాయిబాబాగుడి నుంచి దుర్గమ్మగుడి వరకు 
  • రూ. 3కోట్లు నిధులు మంజూరు 

ఆలేరు టౌన్‌ : ఆలేరు పట్టణంలోని సాయిబాబాగుడి నుంచి కనకదుర్గమ్మగుడి వరకు(సుమారు 2 కి.మీ) రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ. 3కోట్ల నిధులను మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పునరుద్ధరణ  పనులు మొదలు పెట్టనున్నారు. దీంతో ఆలేరు రోడ్డు స్మార్ట్‌గా మారనున్నది. కొన్ని సంవత్సరాలుగా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిత్యం ఈ రహదారిపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు ధ్వంసమైంది. రోజుల తరబడి నీరు నిలిచి గుంతలమయంగా మారింది. నిత్యం ప్రయాణికులు ఈ రహదారిపై ప్రయాణించాలంటే తీవ్ర అవస్థలు పడేవారు. అంతే కాకుండా ఈ రహదారిపై ఇసుక లారీలు, బొగ్గు లారీలు, గ్రానైట్‌ లోడుతో వెళ్లే లారీలు పరిమితికి మించిన బరువుతో రాకపోకలు సాగిస్తుండేవి. అయితే ఆలేరు పట్టణం దాటిస్తూ బైపాస్‌ రోడ్డు నిర్మించడంతో.. నేషనల్‌ హైవే అధికారులు ఈ రోడ్డును పట్టించుకున్న పాపానా పోలేదు. దీంతో తరచూ పాడయ్యేది. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుండేవి. రాత్రి వేళల్లో ఈ రహదారిపై ప్రయాణించాలంటే భయపడేవారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందేవారు. ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తరచూ మరమ్మతులు చేయించే వారు. అయినప్పటికీ కొద్దిరోజులకే పాడయ్యేది. ఈనెల 10న బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి యాదగిరిగుట్టకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో రోడ్డు పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సునీత రోడ్డు దుస్థితి గురించి మంత్రితో పలుమార్లు మాట్లాడి పట్టుబట్టి రూ.3కోట్ల నిధులు మంజూరు చేయించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఇక రాకపోకలకు అంతరాయం ఉండదు. ప్రమాదాలు చోటుచేసుకోవు. ప్రయాణం సాఫీగా సాగనున్నది.

సంతోషంగా ఉన్నది 

రహదారి పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.3కోట్ల నిధులను మంజూరు చేయించడం సంతోషంగా ఉన్నది. త్వరగా పనులు మొదలు పెట్టాలి. అధిక లోడుతో వెళ్లే వాహనాలను నియంత్రించాలి. అలాంటి వాహనాలతోనే రోడ్డు శిథిలమవుతుంది. ఈ విషయమై అధికారులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పన కోసం పెద్దమొత్తంలో నిధులను కేటాయిస్తుంది. - బోగ వెంకటాచలం, ఆలేరు 

రాకపోకలకు ఇబ్బంది ఉండదు

ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతోనే రహదారి పునరుద్ధరణ పనులకు రూ. 3కోట్ల నిధులు మంజూరయ్యాయి. రోడ్డు నిర్మాణంతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిధులు మంజూరు చేయించినందుకు సునీతామహేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు. - వస్పరి శంకరయ్య, మున్సిపల్‌ చైర్మన్‌, ఆలేరు

VIDEOS

logo