జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలకు బాధ్యతలు

- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులను ఇన్‌చార్జ్జిలుగా నియమించిన అధిష్టానం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకోసం సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులతో తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహానగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మార్దనిర్దేశం చేశారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచేలా పని చేయాలని పిలుపునిచ్చారు. పలు డివిజన్లలో ప్రచార బాధ్యతలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలకు అప్పగించిన సీఎం కేసీఆర్ జిల్లాలోని ముఖ్య నేతలకు సైతం ప్రచార బాధ్యతలను అప్పగించారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిని సరూర్‌నగర్ డివిజన్‌కు ఇన్చార్జిగా, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డికి చందానగర్ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి కొత్తపేట డివిజన్, భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్‌కు సైదాబాద్ డివిజన్‌ను, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వనస్థలిపురం, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డికి చంపాపేట, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గడ్డిఅన్నారం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ మందుల సామేల్‌కు మెహిదీపట్నం, జిల్లా పరిషత్ చైర్మన్ ఎల్మినేటి సందీప్‌రెడ్డికి లలితబాగ్,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు అక్బర్‌బాగ్ అప్పగించారు. వీరంతా హైదరాబాద్‌లోనే ఉండి తమకు అప్పగించిన డివిజన్లలో బిజీబిజీ అయిపోయారు.
పట్నం బాటపట్టిన ముఖ్య నాయకులు
జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సారథ్యంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలంతా ప్రచార ప్రణాళికలు అమలు చేయనున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ సమావేశాలు నిర్వహించి గెలుపునకు కృషి చేయనున్నారు. ప్రచారం ముగిసే వరకు ఆయా డివిజన్లలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ వ్యూహాన్ని అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. డివిజన్ల బాధ్యతలు చేపట్టిన నేతలతో పాటు భువనగిరి, ఆలేరు, మునుగోడు నియోజకవర్గాల నుంచి కీలక నాయకులు, ప్రజా ప్రతినిధులు పట్నం బాట పట్టారు. నియోజకవర్గం నుంచి యాభైకి పైగా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్తున్నారు. వీరంతా వారం రోజుల పాటు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం కానున్నారు. ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు వివరించనున్నారు.