గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 20, 2020 , 00:03:15

రైతు ముంగిట్లో ధాన్యం కొనుగోలు

రైతు ముంగిట్లో ధాన్యం కొనుగోలు

ఆలేరులో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

ఆలేరు రూరల్‌ : రైతును రాజు చేసేందుకు సర్కార్‌ అన్ని విధాల కృషి చేస్తుంది. రైతు కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ వ్యవసాయానికి 24 గంటల ఉచితంగా కరెంట్‌, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంట పెట్టుబడులకు రైతుబంధు ద్వారా ఆర్థికసాయం చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. రైతన్నలు పండించిన పంటలను ఎక్కడికక్కడే కొనుగోలు చేసేందుకు సర్కార్‌ అన్ని చర్యలు తీసుకుంటుంది. రైతులు పండించిన పంటలను దళారులు కొనుగోలు చేయడంతో వారికి గిట్టుబాటు ధర రావడం లేదని, అనువైన గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 

రికార్డుస్థాయిలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

గత పాలకులకంటే రికార్డుస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటుంది. ఆలేరు మండలంలోని కొలనుపాక, మంతపురి, టంగుటూరు, పటేల్‌గూడెం, శారాజీపేట, కొల్లూరు, గొలనుకొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

భారీగా వస్తున్న ధాన్యం..

 మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్‌ సొసైటీ సిబ్బంది ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం గ్రేడ్‌ఏ రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 చెల్లిస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఆయా పొలాల్లో హర్వేస్టర్ల ద్వారా వరికోత పూర్తి చేయించి నేరుగా ట్రాక్టర్ల ద్వారా తూర్పార పట్టి విక్రయించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. నెట్‌ క్యాష్‌ పేరిట రైతుల కల్లాల వద్ద కాంటాలు ఏర్పాటు చేసి దళారులు ధాన్యం కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వారికి చెక్‌ పెట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు.. : పీఏసీఎస్‌ చైర్మన్‌, మొగులగాని మల్లేశ్‌


రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతుధర పొందాలి. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. గ్రామాల్లో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగంచేసుకోవాలి.


VIDEOS

logo