శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 14, 2020 , 00:46:49

మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు

మంత్రి కేటీఆర్‌ చొరవతో ప్రధాన రోడ్డు విస్తరణ పనులు

రూ.15.18కోట్లు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పైళ్ల

త్వరలో ఓపెన్‌ టెండర్లు

మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు

భువనగిరి అర్బన్‌ : మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించడంతో త్వరలో విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను తొలగించేందుకు టెండర్‌ విషయంపై శుక్రవారం అత్యవసర మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పట్టణాభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి చొరవ తీసుకుని మంత్రి కేటీఆర్‌కు చెప్పడంతో రోడ్డు విస్తరణ పనులకు రూ.15.18కోట్ల నిధులు కేటాయించారన్నారు. నిధులకు ఇబ్బందులు లేవని, విస్తరణ పనులు మాత్రం తక్షణమే ప్రారంభించాలని చెప్పారన్నారు. బొమ్మాయిపల్లి చౌరస్తా సమీపంలోని ప్రధాన రహదారి నుంచి శ్రీలక్ష్మీనర్సింహస్వామి డిగ్రీ కళాశాల వరకు 4 కిలోమీటర్ల పొడవున రోడ్డుపై 113 చెట్లు ఉన్నాయని, చెట్ల విలువ రూ.4,84,384 లక్షలు ఉంటాయన్నారు. చెట్లు కొట్టడానికి ఓపెన్‌ టెండర్లు నిర్వహిస్తామని, టెండర్‌లో పాల్గొనే వారు ముందుగా రూ.50వేలు మున్సిపాలిటీ పేరున డీడీలు తీసి అందజేసి, ఈనెల 20న జరిగే ఓపెన్‌ టెండర్‌లో పాల్గొనాలన్నారు. రోడ్డు వెంబడి ప్రభుత్వ, ప్రైవేటు, ఇండ్లు, షాపులు కలిపి మొత్తం 470 సముదాయాలు ఉన్నాయన్నారు. వ్యాపార సంస్థల సభ్యులతో ఎంపీ, ఎమ్మెల్యే, అఖిల పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామన్నారు. రోడ్డు విస్తరణను మధ్య డివైడర్‌ నుంచి రెండు వైపుల 50 మీటర్ల వెడల్పు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణంలోని వార్డుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు దశలవారీగా చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, కమిషనర్‌ ఎం.పూర్ణచందర్‌రావ్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo