ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Nov 13, 2020 , 02:46:45

క్షణికావేశం జీవితం పణం

క్షణికావేశం  జీవితం పణం

  • మనోధైర్యం కోల్పోతూ  ఆత్మహత్యలు 
  • చిన్నచిన్న సమస్యలకే కుంగుబాటు 
  • అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న వైనం 
  • జిల్లాలో గతనెలలో 23 మంది బలవన్మరణం  
  • 30 ఏండ్లలోపు వారు 14 మంది

తల్లి మందలించిందని కూతురు, తండ్రి కొట్టిండని కొడుకు, బాగా చదవడం లేదని, చదివినా మంచి మార్కులు రావడం లేదని కొందరు, సంసారంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ ఇక్కట్లు తదితర కారణాలతో క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న కారణాలకే మనోధైర్యం కోల్పోతూ జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కన్నవారికి, కట్టుకున్న వారికి, ఆప్తులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఇలా వివిధ కారణాలతో జిల్లాలో గతనెలలో 23 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 14 మంది ముప్పై ఏండ్లలోపు వారే. చక్కటి భవిష్యత్తు ఉన్న యువత.. తొందరపాటులో చావే పరిష్కారమని భావిస్తూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

- భువనగిరి క్రైం 

భువనగిరి క్రైం : సృష్టిలో వెలకట్టలేనిది ప్రాణం...కానీ కొందరు క్షణికావేశంలో దానిని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. చిన్నచిన్న కారణాలకే కొంత మంది మనోధైర్యం కోల్పోయి జీవితాలను అర్ధంతరంగా చాలిస్తున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు  అందిపుచ్చుకోవాల్సిన యువత  జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు తనువు చాలిస్తోంది. వివాహం కావట్లేదని, ఉద్యోగం రాలేదని, ఇంట్లో మందలించారని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని  ఇలా వివిధ  కారణాలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న  నిర్ణయాలు.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిలిస్తున్నాయి. 

భయపడకుండా ఆలోచిస్తే....

మనిషి జీవితంలో సమస్యలు సర్వసాధారణం...ఎంత పెద్ద సమస్య అయినా ఆలోచిస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ కొందరు ఆ సమస్య తమకే ఉన్నట్లు భావించి మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నారు.ఆరోగ్య, మానసిక సమస్యలైతే వైద్యుల దగ్గరికి వెళ్లాలి. కుటుంబ కలహాలైతే కౌన్సిలింగ్‌ తీసుకోవాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకని పరిస్థితుల్లో ఉన్న చోటే ఏదో ఒక పని చేసుకుని బతికే ఆలోచనలు చేయాలి తప్ప అనవసరంగా తనువు చాలించడం ద్వారా సాధించేదేమీ ఉండదు. 

మార్పును గమనిస్తుండాలి

ఇంట్లో ఎప్పుడూ చలాకీగా ఉండేవారు మాట్లాడకుండా ఉంటే అలాంటి మార్పును గమనించాలి. వారు మనోవేదనకు గురైతే దానికి సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకోవాలి. ఒక వేళ చెప్పలేని పక్షంలో పక్కనే ఉంటూ వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. కుటుంబ సభ్యుల ఓదార్పే వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తణలో మార్పు గమనించి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీని ద్వారా ఆత్మహత్య అనే ఆలోచన నుంచి బయటపడవచ్చు. 

 ఆత్మహత్యల వివరాలు..

జిల్లాలోని 17 మండలాల్లో అక్టోబర్‌లోనే 23 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 14 మంది 30 ఏండ్లలోపు వారు ఉన్నారు. భువనగిరిలో నలుగురు, రామన్నపేటలో ముగ్గురు, బొమ్మలరామారంలో ముగ్గురు, చౌటుప్పల్‌లో ముగ్గురు, సంస్థాన్‌నారాయణపురంలో ఇద్దరు, తుర్కపల్లిలో ఇద్దరు, మోటకొండూరులో ఇద్దరు, గుండాలలో ఒకరు, యాదగిరిగుట్టలో ఒకరు , ఆలేరులో ఒకరు, మోత్కూరులో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

 కడుపుకోత మిగిలించొద్దు


ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదు. ఎంతటి సమస్యఅయినా పరిష్కారం లభిస్తుంది అంతే తప్ప చిన్న చిన్నకారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడటం సరికాదు. సమస్య వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకుంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబ సభ్యులకు కడుపుకోత మిగిలించొద్దు. 
-కోట్ల నర్సింహారెడ్డి, ఏసీపీ, యాదాద్రి

VIDEOS

logo