ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Nov 12, 2020 , 00:48:16

తెల్లబంగారం.. దిగుబడి పుష్కలం

తెల్లబంగారం.. దిగుబడి పుష్కలం

మార్కెట్లను ముంచెత్తుతున్న పత్తి 

అంచనాకు మించి వస్తున్న పంట 

దళారుల ఆగడాలకు సర్కారు కళ్లెం 

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం  

1,44,914 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా

జిల్లావ్యాప్తంగా 14 

జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో పత్తి దిగుబడులు మార్కెట్లకు భారీ స్థాయిలో తరలివస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కూరు, వలిగొండ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో ఎంపిక చేసిన 14 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు ఏర్పాట్లు చేసింది. దళారుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈసారి ముందస్తుగానే దళారుల ఆగడాలకు కళ్లెం వేసేలా ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. నేరుగా రైతులే సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను పొందేలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రైతులు సాగు చేసిన పంటల లెక్కల వివరాలను పక్కాగా సేకరించిన వ్యవసాయ శాఖ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను మార్కెటింగ్‌ శాఖకు అందజేసింది. కొనుగోళ్ల సందర్భంగా నెలకొనే జాప్యాన్ని నివారించేందుకు టోకెన్లను, ధ్రువీకరణ పత్రాలను సైతం ఇస్తున్నారు. దీనివల్ల రైతులు తాము పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలకు తరలించి మద్దతు ధర పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్‌లో 1,81,147 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. దీంతో 1,44,914 టన్నుల వరకు పత్తి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. పండించిన పత్తిని విక్రయించే సందర్భంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడంతోపాటు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కూరు, వలిగొండ వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని 14 జిన్నింగ్‌ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సీసీఐ ద్వారా పక్కాగా కొనుగోళ్లు జరిగేలా చూసి రైతులు మద్దతు పొందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తేమ శాతాన్ని బట్టి రూ.5,543 నుంచి రూ.5,775 వరకు ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తోంది. ఇప్పటికే పలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, మిగతా వాటిల్లోనూ నేడో, రేపో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దళారీ దందాకు చెక్‌ పెట్టేలా..

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా రైతులు నియంత్రిత సాగు పద్ధతిలో పత్తిని సాగు చేశారు. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖ పంటల వివరాలను సేకరించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు పేరు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్లతోపాటు ఎంత విస్తీర్ణంలో ఏ ఏ పంటలు సాగు చేశారు.. తదితర వివరాలన్నింటినీ సేకరించి ఆన్‌లైన్‌ చేసి ఉంచారు. ప్రస్తుతం ఆ సాఫ్ట్‌వేర్‌ను వ్యవసాయ శాఖ మార్కెటింగ్‌ శాఖకు అందజేసింది. దీనివల్ల చాలా వరకు అక్రమాలకు ఆస్కారం లేకుండా పోతోంది. అలాగే పత్తి కొనుగోళ్ల సందర్భంగా కేంద్రానికి వెళ్లే రైతులు విధిగా వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన టోకెన్లను, ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో పత్తి కొనుగోళ్ల కోసం కేంద్రాల వద్ద రోజుల తరబడిగా నిరీక్షించాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఇప్పటికే చాలా వరకు రైతులు దళారులకు పత్తిని విక్రయించగా.. ఇక నుంచి దళారులను ఆశ్రయించుకుండా రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు వచ్చి మద్దతు ధర పొందేలా వివిధ శాఖల అధికారులు కరపత్రాలు, ఫ్లెక్సీలతో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు.

జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు

వ్యవసాయ మార్కెట్‌ పేరు జిన్నింగ్‌ మిల్లు పేరు

ఆలేరు                                              మల్లిఖార్జున కాటన్‌ జిన్నింగ్‌(ఆలేరు), 

శ్రీమాన్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌(శారజీపేట),

షిర్డీసాయి బాబా కాటన్‌ జిన్నింగ్‌(ఆలేరు)

భువనగిరి                                        విజయలక్ష్మి స్పిన్‌ టెక్స్‌(కొండమడుగు), 

సూర్యవంశీ జిన్నింగ్‌ మిల్‌(భువనగిరి)

చౌటుప్పల్‌                                      కావేరి జిన్నింగ్‌ ఇండస్ట్రీస్‌(పెద్దకాపర్తి), 

ప్రగతి కాటన్‌ ఇండస్ట్రీస్‌(పెద్దకాపర్తి),

                                                        కేఎల్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌(తూప్రాన్‌ పేట్‌)

మోత్కూరు                                     నటరాజ్‌ జిన్నింగ్‌ మిల్‌(పాలడుగు), 

శ్రీమహాలక్ష్మి కాటన్‌ స్పిన్‌ ఇండస్ట్రీస్‌(అనాజ్‌పూర్‌)

                                                      గాయతీ కాటన్‌ ఇండస్ట్రీస్‌(కాటేపల్లి), 

సాయి శ్రీనివాస జిన్నింగ్‌ మిల్‌(చోట రామారం)

వలిగొండ                                        ఎస్‌టీఎల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌(ఆరూర్‌), 

వెంకటేశ్వర శ్రీసాయి జిన్నింగ్‌ మిల్‌(నెమలికాల్వ)

ఇదీ మద్దతు ధర..

8 శాతం తేమ ఉంటే రూ.5,775

9 శాతం తేమ ఉంటే రూ.5,717.25

10 శాతం తేమ ఉంటే రూ.5,659.50

11 శాతం తేమ ఉంటే రూ.5,601.75

12 శాతం తేమ ఉంటే రూ.5,543.99


దళారులను నిరోధించేందుకే సీసీఐ కొనుగోళ్లు

ఆలేరుటౌన్‌:రైతులకు మద్దతు ధర ఇచ్చి, దళారులను నిరోధించేందుకే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పత్తిని కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆలేరులో బుధవారం పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే పత్తిని అమ్ముకోవాలని, అలా అయితేనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, నష్టం జరుగకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే తప్పక మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వస్పరి శంకరయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు గడ్డమీది రవీందర్‌గౌడ్‌, గ్యాదపాక నాగరాజు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగులగాని మల్లేశం, మోటకొండూరు వైస్‌ ఎంపీపీ ఇల్లందుల మల్లేశం, మార్కెట్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు గుంటి కృష్ణ, మామిడాల నర్సింహులు, భిక్షపతి, కూళ్ల సిద్దులు, ఆరె మల్లేశ్‌, వట్టిపల్లి స్వామి, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మొరిగాడి వెంకటేశ్‌, నాయకులు పాల్గొన్నారు. 

VIDEOS

logo