సాదాబైనామాకు లాస్ట్ చాన్స్

దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,నమస్తేతెలంగాణ: జిల్లాలో తెల్ల కాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరిపి వివిధ కారణాలతో చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయారు. దీంతో పట్టాలు పొందలేక పెట్టుబడి సాయం రైతు బంధు వంటి పథకాలను అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో సాదాబైనామా పేరుతో కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు 2016లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అనుమతి కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జరిగిన లావాదేవీలను సాదాబైనామా కింద క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించగా..జిల్లాలో చాలామంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ప్రభు త్వం కొన్నింటికి పట్టాలను అందజేయగా.. వివిధ కారణాలతో కొన్ని దరఖాస్తులను తిరస్కరించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా.. ఈ ఏడాది అక్టోబర్ మాసంలో మరోసారి అవకాశం కల్పించింది. తొలుత గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి మండలాలతోపాటు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదాబైనామాలకు ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా గ్రామాల్లోని దరఖాస్తుదారులకు గొప్ప ఊరట లభించింది. ఫలితంగా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
భారీగా దరఖాస్తులు
జిల్లాలోని 17 మండలాల నుంచి క్రమబద్ధీకరణ కోసం 13,286 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలలో విలీనమైన రాయగిరి, బొమ్మాయిపల్లి, పగిడిపల్లి, బహదూర్పేట్, ముక్తాపూర్, రేవనపల్లి, తంగడపల్లి, లక్కారం, తాళ్ల సింగారం, లింగోజిగూడెం, కొండగడప, బుజిలాపురం గ్రామాల నుంచి కూడా పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. చివరి అవకాశం కావడంతోపాటు గడువు మంగళవారంతో ముగియనుండడంతో మీ సేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారుల రద్దీ కనబడింది. అయితే దరఖాస్తుల పరిశీలన సందర్భంగా అధికారులు ప్రస్తుత మార్గదర్శకాలను అనుసరించి భూమి ఆధీనంలో ఉన్నవారికే(కబ్జాదారు) హక్కులు కల్పించనున్నారు. తహసీల్దారు నేతృత్వంలో రెవిన్యూ సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఒప్పందం వాస్తవమో!. కాదో!. తేల్చుతారు. ఆ తర్వాత వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం వారికి పట్టాలను అందజేయనుంది.
జిల్లాలో మండలాల వారీగా వచ్చిన సాదాబైనామా దరఖాస్తుల వివరాలు
మండలం వచ్చిన దరఖాస్తులు
తుర్కపల్లి 448
మోటకొండూరు 569
బీబీనగర్ 438
బొమ్మలరామారం 725
భూదాన్ పోచంపల్లి 443
మోత్కూరు 803
చౌటుప్పల్ 350
భువనగిరి 992
రామన్నపేట 892
సంస్థాన్ నారాయణ పురం 872
రాజాపేట 822
గుండాల 1,448
యాదగిరిగుట్ట 330
ఆత్మకూరు(ఎం) 309
అడ్డగూడూరు 2,053
ఆలేరు 645
వలిగొండ 1,147
మొత్తం 13,286
తాజావార్తలు
- ఆ గవర్నర్ నన్ను కూడా లైంగికంగా వేధించారు!
- నడిరోడ్డుపై నాగుపాము కలకలం..!
- ట్విట్టర్ సీఈఓపై కంగనా ఆసక్తికర ట్వీట్
- కేంద్రం ఐటీఐఆర్‌ను రద్దు చేయకపోయుంటే..
- 89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
- మర్యాద రామన్న..కృష్ణయ్యగా మారాడు..!
- చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
- 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- ఐఎస్ఎస్లోని ఆస్ట్రోనాట్‌తో మాట్లాడిన కమలా హ్యారిస్.. వీడియో
- మాస్ బీట్‌కు సాయి పల్లవి స్టెప్పులు అదుర్స్