శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 08, 2020 , 00:30:50

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాము

చివరిగింజ వరకు కొనుగోలు చేస్తాము

టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

గుండాల : ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని వెల్మజాల, సీతారాంపురం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ సహకార సంఘాల ద్వారా ప్రతి గ్రామంలో రైతుల కల్లాల వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ సహకార బ్యాంకు ద్వారా సుమారుగా 4 వందలు, ఐకేపీ ద్వారా సుమారుగా 2 వందల చొప్పున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకువచ్చి రైతు బాంధవుడయ్యాడన్నారు. తెలంగాణను హరిత తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు సైతం నిధుల కేటాయించి పూర్తి చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం దేశంలోనే తెలంగాణలో 36 శాతం విస్తీర్ణం పెరిగిందన్నారు. ఈ ఘనత కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్‌కాకతీయ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి చెరువులను అభివృద్ధి చేయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులకు నష్టం కలుగుతుందే తప్పా లాభం లేదన్నారు. 

రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. 

రైతువేదిక పనుల పరిశీలన..

మండల పరిధిలోని సీతారాంపురంలో నిర్మాణమవుతున్న రైతువేదిక పనులను గొంగిడి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్‌ మలిపెద్ది మాధవీమాధవరెడ్డికి పలు సూచనలు చేశారు. చివరి దశకు చేరిన పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

అంబేద్కర్‌ ఆశయ సాధనకు

 కృషి చేయాలి..

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం గుండాల మండలంలోని మరిపడిగలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన గొప్ప నాయకుడు, ప్రపంచ మేధావి డా.బీ ఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా యువత పయనించాలన్నారు. అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న యూత్‌ కమిటీని అభినందించారు. అనంతరం యూత్‌ ఆధ్వర్యంలో మహేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తాండ్ర అమరావతీశోభన్‌బాబు, జడ్పీటీసీ కోలుకొండ లక్ష్మీరాములు, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖలీల్‌, వైస్‌ ఎంపీపీ మహేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ గడ్డమీది పాండరి, తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, ఎంపీడీవో పుష్పలీల, ఏవో సంతోషి, ఏపీఎం రాంప్రసాద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ లింగాల భిక్షం, చేనేత సహకార సంఘం చైర్మన్‌ దుడుక ఉప్పలయ్య, సింగిల్‌విండో డైరెక్టర్‌ ఉప్పలయ్య, ఎంపీటీసీలు అనిత, అలివేలు, సర్పంచులు బాలకృష్ణ, మాధవి, సైదులు, దుంపల శ్రీనివాస్‌ మాజీ జడ్పీటీసీ కోలుకొండ యాదగిరి, మందడి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సంగి వేణుగోపాల్‌, నాయకులు బాలమల్లు, పాండు, ఉస్మాన్‌, సాయి, అంబేద్కర్‌ విగ్రహ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు చేయాలి..

ఆత్మకూరు(ఎం) : పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మండలంలోని రాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం రైతులు ప్రధాన రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి శనివారం మాత్రం ధాన్యంలో తాలుతో పాటు రంగుమారిన ధాన్యం ఉన్నందున కొనుగోలు చేయలేమని చెప్తున్నారన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేపట్టిన రైతుల వద్దకు వెళ్లి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించి అధికారులను విడిచిపెట్టారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ఆలేరు : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు పండించిన ప్రతిగింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ స్పష్టం చేశారు. శనివారం యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరులో పీఏసీఎస్‌ వంగపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన పనిలేదన్నారు. మద్దతు ధరను అందిస్తూ చివరిగింజా వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తోటకూరి బీరయ్య, ఎంపీటీసీ కొక్కలకొండ అరుణ, ఉపసర్పంచ్‌ వద్దిగళ్ల బాబు, రైతుబంధు సమితి కన్వీనర్‌ దేవేందర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ గడ్డమీది శ్రీనివాస్‌, వార్డు సభ్యులు గవ్వల భాస్కర్‌, రైతులు పాల్గొన్నారు.

VIDEOS

logo