వంద పడకల దవాఖానగా మారుస్తా

- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట : రామన్నపేట ప్రభుత్వ దవాఖాన స్థాయిని వంద పడకలకు మార్చనున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో డిజిటల్ ఎక్స్-రే మిషన్‌ను, ఆప్తాల్మిక్ (కంటి వెలుగు) సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా అమలు కాని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం చేయించుకుంటున్న గర్భవతులకు ప్రభుత్వం రూ.12వేల నుంచి రూ.13వేల ప్రోత్సాహకాన్ని అందిస్తుందని తెలిపారు. పుట్టిన బిడ్డకు 16 రకల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను అందిస్తూ 102 వాహనంలో ఇంటి వరకు తల్లీబిడ్డను క్షేమంగా చేర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. గురువారం మండలంలోని బోగారం గ్రామంలో రూ.20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటూ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతానని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ జ్యోతిబలరాం, జడ్పీటీసీ లక్ష్మీజగన్‌మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు శిరీషాపృథ్వీరాజ్, పద్మారమేశ్, మహేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, ప్రకాశ్, ఎంపీటీసీలు నర్సింహ, రేహాన్, హర్షిని, పద్మాసత్తయ్య, మహేందర్‌రెడ్డి, మండల కార్యదర్శి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.