గురువారం 04 మార్చి 2021
Yadadri - Nov 04, 2020 , 01:19:56

గోస తీరింది.. ధరణి అదిరింది..

గోస తీరింది.. ధరణి అదిరింది..

  • పావుగంటలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ 
  • సులభంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 
  • ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి
  • స్లాట్‌ సమయానికి వచ్చి ఈ-పాస్‌ బుక్‌తో వెళ్తున్న రైతులు
  • కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పిందంటున్న అన్నదాతలు 
  • సీఎం సారు నిర్ణయం బాగుందని కితాబు 
  • లంచాలిచ్చే లొల్లి పోయిందని వెల్లడి 
  • రెండోరోజు జిల్లాలో 8 రిజిస్ట్రేషన్లు 

భూమిని విక్రయించి రిజిస్ట్రేషన్‌ జరగాలంటే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకెళ్లాలి. అక్కడ రిజిస్ట్రేషన్‌ జరిగితే మ్యుటేషన్‌ (పేరు మార్పిడి)కి తాసిల్దార్‌ ఆఫీసుకు తిరగాలి. పేరు మారాలంటే రోజులు, నెలలు పట్టేవి. ఇది జరిగినా పాస్‌బుక్‌ కావాలంటే ఎంతోకొంత ముట్టజెప్పాల్సి వచ్చేది. 

ఇప్పుడు తిరగాల్సిన పనిలేదు. ఎవ్వరికీ రూపాయి ఇవ్వకుండా సులభంగా, వేగంగా సేవలందించే ధరణి పోర్టల్‌తో రైతులు సంబురపడుతున్నారు. రెండోరోజు మంగళవారం జిల్లావ్యాప్తంగా 19 మంది స్లాట్‌ బుక్‌ చేసుకోగా..8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అమ్మినవారు, కొన్నవారు, సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకొని పావుగంటలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. వెంటనే ఈ-పాస్‌బుక్‌ అందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోర్టల్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు నెలకొంటున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. ‘గతంలో రిజిస్ట్రేషన్‌ అయ్యినంక  పేరు మార్పిడికి తాసిల్దార్‌ ఆఫీసు చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ ఒకేసారి కావడం చాలా బాగుంది. రూపాయి లంచం ఇయ్యకుండనే పనైంది’ అని అడ్డగూడూరు మండలం డి.రేపాకకు చెందిన ముక్కాముల స్వరూప అన్నారు. అప్పట్లో బ్రోకర్లు అడిగినంత ఇచ్చినా ఐదారు నెలలు పట్టేది. ఇప్పుడు రూపాయి ఇవ్వకుండా పావుగంటలోనే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న. మాలాంటోళ్ల బాధలను దూరం చేసిన సీఎం సారును గుండెల్లో పెట్టి చూసుకుంటాం’ అని నారాయణపురం మండలం గొల్లగూడెంకు చెందిన రైతు వంగూరి శేఖర్‌ అన్నాడు. 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌కు యాదాద్రి భువనగిరి జిల్లాలో మంచి స్పందన వస్తోంది. అక్కడక్కడ సాంకేతిక సమస్యలు నెలకొంటున్నప్పటికీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల కోసం ఐదుగురు స్లాట్‌ బుక్‌ చేసుకోగా, నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి. రెండోరోజు మంగళవారం రిజిస్ట్రేషన్ల కోసం 19 మంది స్లాట్‌ బుక్‌ చేసుకోగా, 8 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. మీ సేవా కేంద్రాలతోపాటు స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో చాలా మంది స్లాట్‌ బుకింగ్‌ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. భూముల అమ్మకాలు, గిఫ్ట్‌ డీడ్‌, ఫౌతీ, ఫ్యామిలీ పార్టిషన్‌ రిజిస్ట్రేషన్లు ఇలా.. అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్‌ సందర్భంగా బయోమెట్రిక్‌ సమస్యలు తలెత్తితే ఐరిస్‌ ద్వారా ప్రక్రియ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. దీంతో జిల్లాలోని పలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో సులభంగా, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన పది, పదిహేను నిమిషాల్లోనే ఈ-పాస్‌బుక్‌ పత్రాలను తీసుకుని రైతులు వెళ్లారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఏకకాలంలో జరుగుతుండటంతో ఒకప్పటి ఇబ్బందులు తీరాయని రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. పాసు పుస్తకం కోసం ఏండ్ల తరబడిగా ఎదురుచూసే రోజులు పోయి నిమిషాల్లోనే చేతికందుతోందని సంబురపడిపోతున్నారు. ధరణితో రెవెన్యూ శాఖ ప్రతిష్ట పెరిగిందంటూ సంబంధిత అధికారులు సైతం కొనియాడుతున్నారు.

రూపాయి లంచం ఇవ్వాల్సిన పనిలేకుండానే...

గతంలో ఫౌతీ, మ్యుటేషన్‌ ఏం చేయాలన్నా వీఆర్వో, తహసీల్దార్ల పెత్తనమే నడిచేది. లంచం ఇచ్చి బతిమిలాడుకుంటేగానీ.. పాసు పుస్తకం చేతికందేది కాదు. స్లాట్‌ బుకింగ్‌కు నిర్దేశిత ఫీజు రూ.200 కడితే చెల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా వచ్చి ఆ మేరకే చెల్లింపు జరుగుతోంది. మ్యుటేషన్‌కు కూడా నిర్దేశిత ఫీజు ఎకరానికి రూ.2,500 చెల్లిస్తే సరిపోతుంది. స్లాట్‌ బుక్‌ చేసిన తర్వాత కేటాయించిన సమయానికి తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ఆపేందుకు అవకాశం కూడా లేదు. పైరవీలకు ఆస్కారం లేకుండా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతోంది. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ అన్ని రకాలుగా బాగుందని ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 

రైతులకు అందుబాటులో రిజిస్ట్రేషన్‌ సేవలు

బొమ్మలరామారం: మండల రైతుల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం అందుబాటులో రిజిస్ర్టేషన్‌ సేవలు కల్పించిందని అదనపు కలెక్టర్‌ కీమ్యా నాయక్‌ అన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి రోజున రెండు రిజి స్ట్రేషన్లు జరిగాయి. అనంతరం రైతులకు ఈ-పట్టాదారు పాస్‌బుక్‌ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పద్మసుందరి, ఆర్‌ఐ విజయరామారావు, సునీల్‌, శంకర్‌, రైతులు పాల్గొన్నారు. 

ఆనందంలో రైతులు

గుండాల : మండలంలోని తుర్కలశాపూరం గ్రామానికి చెందిన ఉప్పుల సిద్ధిరాములు తన కొడుకు మల్లేశ్‌తో కలిసి సోమవారం గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ కొరకు మొదటి స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. దీంతో మంగళవారం రిజిస్ట్రేషన్‌ సమయం రావడంతో వారు ఇద్దరు సాక్షులతో తహసీల్దార్‌ కార్యాలయానికి హాజరయ్యారు. అతికొద్ది సమయంలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే సిద్ధిరాములు ఖాతాలో ఉన్న భూమి కట్‌ అయ్యి కొడుకు మల్లేశ్‌ ఖాతాలో జమయింది. అనంతరం తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి రైతు మల్లేశ్‌కు ఈ-పాస్‌బుక్‌ను అందజేశారు. దీంతో తండ్రీకొడుకులు సంతోషంతో వెళ్లిపోయారు.

లబ్ధిదారుడికి ఈ-పాస్‌బుక్‌ అందజేత

సంస్థాన్‌ నారాయణపురం : నారాయణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రెండోరోజు ‘ధరణి’ రిజిస్ట్రేషన్ల కోసం రెండు స్లాట్లను బుక్‌ చేసుకోగా, మంగళవారం ఉదయం 11గంటలకు మొదటి స్లాట్‌కు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారుడికి ఈ- పాస్‌బుక్‌ను ఆర్డీవో సూరజ్‌కుమార్‌, తహసీల్దార్‌ బ్రహ్మయ్య అందజేశారు. 

రెండో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి సాంకేతిక సమస్య వలన రిజిస్ట్రేషన్‌ జరగలేదని, బుధవారానికి 3 స్లాట్లు బుక్‌ అయ్యాయని తహసీల్దార్‌ బ్రహ్మయ్య తెలిపారు. 

ప్రజలకు చేరువలో ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

తుర్కపల్లి : ప్రజలకు మరింత చేరువలో ధరణి రిజిస్ట్రేషన్లు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. మంగళవారం మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..స్లాట్‌ బుక్‌ చేసుకున్న అర గంటలోపే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 స్లాట్‌లు బుక్‌ అయ్యాయన్నారు. తుర్కపల్లిలో 4 స్లాట్‌లు బుక్‌ అయ్యాయని, సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్నాయని, సాంకేతిక కారణాలు తొలగిన వెంటనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ధరణిలో 95శాతం వివరాలు పొందుపర్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సలీముద్దీన్‌ ఉన్నారు.

అరగంటలోనే భూమి రిజిస్ట్రేషన్‌

ఆత్మకూరు(ఎం): అరగంటలోనే వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే బాటకు సంబంధించిన భూమి మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మండలంలోని మొరిపిరాల గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నగూడెం గ్రామానికి చెందిన రైతులు గోనె సత్తిరెడ్డి, బీమిడి ఉపేందర్‌రెడ్డిలకు చెందిన భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. మీ సేవలో సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకోగా, మంగళవారం గడువు ఇవ్వడంతో ఇరువురు రైతులు సాక్షులతో వచ్చి భూమిని తహసీల్దార్‌ జ్యోతితోపాటు ధరణి ఆపరేటర్‌ ప్రణయ రిజిస్ట్రేషన్‌ అర గంటలోనే పూర్తి చేశారు. చాలా సంవత్సరాల నుంచి బాటను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలందరి భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ల కోసం ధరణి పోర్టల్‌ను ఏర్పాటు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారు.

రెండోరోజూ రిజిస్ట్రేషన్‌ నమోదు

అడ్డగూడూరు: మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రెండో రోజు ధరణి పోర్టల్‌ ద్వారా రెండో రిజిస్ట్రేషన్‌ నమోదు చేసి ఈ-పాస్‌బుక్‌ను తహసీల్దార్‌ రామకృష్ణ అందజేశారు. మంగళవారం మండలంలోని డీ.రేపాక గ్రామానికి చెందిన ముక్కాముల స్వరూప అదే గ్రామానికి చెందిన ఏనుతుల మల్లయ్య దగ్గర ఎకరం భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన స్వరూప సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకోగా, అధికారులు మంగళవారం రిజిస్ట్రేషన్‌ సమయాన్ని కేటాయించడంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి స్వరూప భూమిని అమ్మిన మల్లయ్యతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చింది. కాగా, అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసి ఈ-పాస్‌బుక్‌ పత్రాలను అంజేశారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ.. తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన పావుగంటలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేసి ఈ-పాస్‌బుక్‌ పత్రాలను అందజేశారు... గతంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాత కూడా మ్యుటేషన్‌కు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగేవాళ్లమని తెలిపారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ రెండు ఒకేసారి కావడంతో రైతులకు ఇబ్బందులు తప్పాయన్నారు.

రైతుల సౌలభ్యం కోసమే ధరణి

వలిగొండ: రైతుల సౌలభ్యం కోసమే ధరణి పోర్టల్‌ రిజిస్ట్రేషన్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని వర్కట్‌పల్లి గ్రామానికి చెందిన రైతు లోతుమల్ల మల్లయ్య సేల్‌ డీడీ ద్వారా భూరిజిస్ట్రేషన్‌ కోసం సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకొని మంగళవారం లోతుమల్ల కిష్టయ్య, లోతుమల్ల రాజు, లోతుమల్ల రవి పేర్ల మీద ధరణి పోర్టల్‌ ద్వారా గంట వ్యవధిలోనే ముగ్గురు వ్యక్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.

బ్రోకర్ల బాధ తప్పింది..

నిన్న సాయంత్రం స్లాట్‌ బుక్‌ చేసుకున్న. మంగళవారం ఉదయ 10:30 కార్యాలయానికి వచ్చాం. కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తి చేసి అధికారులు పట్టాదారు పాస్‌బుక్‌ అందజేశారు. గతంలో అధికారుల చుట్టూ తిరిగి బ్రోకర్లు అడిగినంత లంచం ఇచ్చినా కూడా ఐదు, ఆరు నెలలు పట్టేది. ఇప్పుడు రూపాయి లంచం ఇవ్వకుండా దర్జాగా 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకున్న. రైతుల బాధలను దూరం చేసిన సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టి చూసుకుంటాం. 

- వంగూరి శేఖర్‌, రైతు, గొల్లగూడెం, నారాయణపురం

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాలా సులభం

వర్కట్‌పల్లి గ్రామానికి చెందిన నేను రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ను మీ సేవ ద్వారా సోమవారం బుక్‌ చేశాను. మంగళవారం అధికారులు సాక్షుల సమక్షంలో ధరణి పోర్టల్‌లోని భూరికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ మార్పిడి చేశారు. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం రామన్నపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లేవాళ్లం. అప్పుడు రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులు పట్టేది. తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ ద్వారా సులభంగా గంట లోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 

- లోతుమల్ల రవి, రైతు, వర్కట్‌పల్లి, వలిగొండ

ఇంత త్వరగా అవుతుందని ఊహించలేదు

మా తండ్రి నాకు తన భూమిలో కొంత భాగాన్ని గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశాడు. మేం ఇద్దరం తహసీల్దార్‌ కార్యాలయానికి హాజరైన అతికొద్ది సమయంలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి నాకు ఈ-పాసుబుక్‌ వచ్చింది. గతంలో భూమి పట్టా కావాలంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ ఏండ్ల తరబడి తిరగాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్‌ రైతుల కొరకు తీసుకవచ్చిన ధరణి వెబ్‌సైట్‌ చాలా బాగుంది. ఇంత తొందరగా భూమి పట్టా అవుతుందని ఊహించలేదు. ఇక నుంచి రైతుల బాధలు తీరినయ్‌.- ఉప్పుల మల్లేశ్‌, రైతు, తుర్కలశాపూరం, గుండాల మండలం 

ఆనందంగా ఉన్నది

కొత్తగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌లో మండలంలోనే మొట్టమొదటగా స్లాట్‌ బుక్‌ చేసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నది. వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు మరో రైతు వద్ద బాట కోసం కొనుగోలు చేసిన భూమిని అందుబాటులో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేయడం సంతోషంగా ఉన్నది. బాట కోసం కొనుగోలు చేసిన 6 గుంటల భూమికి మీ సేవలో రూ.840 చలానా చెల్లించిన వెంటనే రిజిస్ట్రేషన్‌ అయింది. ఇలాంటి సులభమైన సౌకర్యం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. 

- గోనె సత్తిరెడ్డి, రైతు, చిన్నగూడెం, ఆత్మకూరు(ఎం)

VIDEOS

logo