గురువారం 04 మార్చి 2021
Yadadri - Nov 04, 2020 , 01:19:59

సర్వే షురూ

సర్వే షురూ

  • సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సర్వే ప్రారంభం 
  • పది వార్డులకు పది ప్రత్యేక బృందాలు 
  • ఇంటి స్థితిగతులు, సమస్యలు నమోదు 
  • ఆదాయ మార్గాలు, పంటల వివరాలు ఆరా 
  • ఈనెల 6లోపు సర్వే నివేదికలు 
  • యుద్ధప్రాతిపదికన గ్రామాభివృద్ధికి ప్రణాళిక  
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశం 

తుర్కపల్లి : వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి యుద్ధప్రాతిపదికన గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న నేపథ్యంలో అభివృద్ధి పర్చేందుకు అధికారులు ఇంటింటా సర్వే చేపట్టారు. అంతకు ముందు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు వ్యవసాయశాఖ, ఎంపీవోలతో గ్రామంలో చేపట్టాల్సిన సర్వేకు సంబంధించి మార్గదర్శకాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తుల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సర్వే చేపట్టాలన్నారు. సర్వే నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించి తదుపరి ఆదేశాల మేరకు అభివృద్ధి పనులను చేపడుతామన్నారు. గ్రామంలో మురుగుకాల్వలు, సీసీ రోడ్లు, విద్యుత్‌, పాఠశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. 

కుటుంబ స్థితిగతులపై ఇంటింటా సర్వే..

గ్రామంలోని పది వార్డులకు గాను ఇంటింటా సర్వే చేపట్టేందుకు పది బృందాలు సర్వే నిర్వహించారు. ఒక్కో బృందంలో ఎంపీడీవో, ఎంపీవో, వ్యవసాయశాఖ అధికారితో ఐదు టీంలను ఏర్పాటు చేశారు. రెండు వార్డులకు ఒక జిల్లా స్థాయి అధికారి చొప్పున పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. అందులో భాగంగా సర్వే బృందాలు ఇంటింటా తిరుగుతూ.. ఆయా కుటుంబాల యొక్క పూర్తి సమగ్ర వివరాలను సేకరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డిలను 5వార్డులకు ఒకరు చొప్పున పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. గ్రామంలో ప్రజల స్థితిగతులు అనంతరం వ్యాపార, వ్యవసాయ వివరాలు వివాహం అనంతరం వేరుగా ఉంటున్న కుటుంబాలు ఆదాయ మార్గాలు, వ్యవసాయ క్షేత్రాల్లో పండిస్తున్న పంటలు తదితర పూర్తి వివరాలను అధికారులు సర్వేలో సేకరిస్తున్నారు. అదే విధంగా గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలు, ఖాళీ స్థలాలు తదితర వివరాలను సాటిలైట్‌ ఆధారంగా బ్లూ ప్రింట్‌ తయారు చేస్తామన్నారు. అదేవిధంగా సంగారెడ్డి కలెక్టర్‌ వెంకట్‌రాంరెడ్డి, గూగుల్‌మీట్‌ ద్వారా సర్వే బృందాలకు అవగాహన కల్పించారు. గజ్వేల్‌ ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డి, అవగాహన సమావేశంలో పాల్గొని సర్వే బృందాలకు తన అనుభవాలను వివరించారు. సర్వే నివేదికలను ఈనెల 6వ తేదీ లోపు సమర్పించాలని సర్వే బృందాలకు సూచించారు. కార్యక్రమలంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌, ఎంపీడీవో ఉమాదేవి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo