సోమవారం 08 మార్చి 2021
Yadadri - Nov 03, 2020 , 00:00:26

రైతు సేవలో సహకారం

రైతు సేవలో సహకారం

అడ్డగూడూరు : విత్తనాలు, ఎరువుల సరఫరాను మొదలుకొని వ్యవసాయానికి అవసరమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి వాటికి మద్దతు ధర కల్పించే వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతన్నలకు విస్తృత సేవలు అందిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. అడ్డగూడూరు మండలకేంద్రంలో ఉన్న సహకార సంఘంలో 3900 మంది సభ్యులకు 1260 మంది రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు అందిస్తున్నది. భవిష్యత్‌లో రైతులకు మరిన్నీ సేవలు అందించడమే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం వ్యాపార పరిధిని పెంచుకుంటూ పనిచేస్తున్నారు.

సేవలు మరింత సులువుగా ..

ప్రాథమిక వ్యవసాయ సంఘాలను బలోపేతం చేసి పారదర్శక సేవలను అందించేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రవేశపెట్టింది. రైతులు ఐప్లె చేసుకున్న వెంటనే రుణాలు మంజూరు చేసి వారికి ఆర్థిక చేయూతనివ్వడంలో సహకార సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయి. ఈ సంవత్సరం సహకార సంఘం ద్వారా రైతులకు రూ.1.80 లక్షలు రుణాలు అందాయి. నగదు రహిత లావాదేవీలపై సహకార సంఘం చైర్మన్‌ పొన్నాల వెంకటేశ్వర్లు, అధికారులు గ్రామాల్లో తిరిగి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం  ఏర్పాటు..

సహకార సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని లక్ష్మీదేవికాల్వ, చిర్రగూడూరు, అజీంపేట , వెల్ధేవి, కంచనపల్లి, గట్టుసింగారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సహకార సంఘం ద్వారా వానకాలంలో 17987 యూరియా బస్తాలు, 6227 దుక్కిమందు బస్తాలతోపాటు 2076 బస్తాల విత్తనాలను కూడా  రైతులకు అందజేశారు. రాబోయే యాసంగి సీజన్‌కు ఎరువుల బస్తాలను ఇంకా ఎక్కువగా తీసుకురానున్నారు. 

సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోలు బంకు..

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా మండలంలోని చిర్రగూడూరులో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోలు బంక్‌ మంజూరైంది. రూ. 30 లక్షలతో త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మండలంలోని రైతులు, వాహనదారులకు పెట్రో, డిజీల్‌ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ చొరవతో సహకార సంఘం ద్వారా త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 

VIDEOS

logo