వాసాలమర్రి కి రాజయోగం

వాసాలమర్రికి రాజయోగం వచ్చింది. అంకాపూర్‌ను తలదన్నేలా గ్రామ రూపురేఖలు మార బోతున్నాయి. ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని తరిమికొట్టేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు తానే దత్తత తీసు కుంటున్నట్లు ప్రకటించారు. రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసి గ్రామంలో సమస్యలనేవే లేకుండా చూస్తానని చెప్పారు. ఇల్లులేని వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టివ్వడంతోపాటు. ప్రతి ఇంటికీ రూ.10లక్షల సాయం అందించి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పది, పదిహేను రోజుల్లో ఊరికి వస్తానని, గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేస్తానని సీఎం మాటిచ్చారు. శనివారం కొడకండ్ల నుంచి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రిలో ఆగిన సీఎం కేసీఆర్ ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులను తన వ్యవసాయక్షేత్రానికి పిలి పించుకుని సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ అభివృద్ధి కార్యాచరణకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని రాష్ట్రస్థాయిలోని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం సాయంత్రం గ్రామంలో పర్యటించి, పది రోజుల్లో అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ వరాల జల్లులతో గ్రామస్తుల నుంచి హర్షాతీరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆ ఊరి సమస్యలు సీఎం కేసీఆర్‌ను కదిలించాయి. ఏండ్ల తరబడిగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చలింపజేశాయి. అయితే సమస్యలను పరిష్కరించడంలో ఆది నుంచీ ముందుండే సీఎం కేసీఆర్ ఆ ప్రాంత వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగారు. వెనుకబడిన ఆ గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు కంకణం కట్టుకున్నారు. ఇంకేం.. గ్రామస్తులను పిలిపించుకుని సమస్యలను తెలుసుకున్నారు. తానే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి.. సమస్యలనేవే లేకుండా చూస్తానన్నారు. రూ.100 కోట్ల నిధులను మంజూరు చేస్తానని ప్రకటించారు. ఆ భాగ్యానికి నోచుకున్న ఆ గ్రామమే వాసాలమర్రి. ఆ గ్రామం తుర్కపల్లి మండలంలో ఉంది. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానికులను ఆదివారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకొని గ్రామ సమస్యలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ గ్రామ అభివృద్ధిపై ఉదారతను చూపారు. దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌ను మించి వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇల్లులేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టివ్వడంతోపాటు ప్రతి ఇంటికీ రూ.10లక్షల సాయం అందించి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యాచరణ కోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని వ్యవసాయ క్షేత్రం నుంచే రాష్ట్రస్థాయిలోని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలనుసారం కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదివారం సాయంత్రం వాసాలమర్రిలో పర్యటించారు. అభివృద్ధి విషయమై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. పది రోజుల్లో ప్రణాళికలను రూపొందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ వరాల జల్లులతో వాసాలమర్రి గ్రామ ప్రజానీకం పులకించిపోతోంది.
తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామ జనాభా 2,600. ప్రభుత్వ పరంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నప్పటికీ గ్రామంలో వెనుకబాటు తనం ఛాయలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవతో వాసాలమర్రి గ్రామ స్వరూపమే మారబోతున్నది. అన్ని రంగాల్లోనూ గ్రామం అభివృద్ధిలో అగ్రభాగాన నిలువబోతున్నది. గత అక్టోబర్ 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించి తిరుగు ప్రయాణంలో వాసాలమర్రి వద్ద ఆగిన సీఎం కేసీఆర్ కొద్దిసేపు స్థానికులతో ముచ్చటించారు. తాగేందుకు మిషన్ భగీరథ నీళ్లు.. పంటలకు పుష్కలంగా సాగు నీళ్లు అందుతున్నాయని చెప్పిన స్థానికులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం వద్ద ఊరి సమస్యలను ప్రస్తావించారు. గజ్వేల్- భువనగిరి రహదారి నిర్మాణం కోసం రూ.250 కోట్లు కేటాయించడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఇతర సమస్యలపై చర్చించేందుకు పౌంహౌజ్కు రావాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఆదివారం ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవన్కుమార్, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, కో-ఆప్షన్ జిల్లా అధ్యక్షుడు రహమత్ షరీఫ్, ఉప సర్పంచ్ మధు, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పౌంహౌజ్కు వెళ్లారు. ఉదయం 11.30 గంటలకు లోపలకు వెళ్లగా.. రెండున్నర గంటలపాటు గ్రామ సమస్యలపై సీఎం కేసీఆర్ వారితో చర్చించారు.
అంకాపూర్‌కు మించి అభివృద్ధి..
వాసాలమర్రి గ్రామ సమస్యలపై చర్చించే సందర్భంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వాసాలమర్రిలో వెనుకబాటుతనం కనిపించింది. ఉపాధి అవకాశాలు లేవని తెలిసింది. ఇకపై గ్రామంలో సమస్యలనేవే ఉండకూడదు. నేనే దత్తత తీసుకుంటా. రూ.100 కోట్లను మంజూరు చేస్తా. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌కు మించిన అభివృద్ధి జరగాలి. ఇండ్లు లేని వారికి డబుల్‌బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం. ప్రతి ఇంటికీ రూ.10 లక్షల సాయం అందించి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి కుటుంబం ప్రభుత్వం నుంచి లబ్ధిపొందేలా చూసి ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు అన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వివరించారు. గ్రామంలోని మైసోనికుంటను సిద్దిపేట జిల్లాలోని కోమటిచెరువు తరహాలో మినీ ట్యాంక్‌బండ్‌గా అందంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇరుకురోడ్లను విస్తరించడంతోపాటు, ఫంక్షన్‌హాల్ వంటి నిర్మాణాలను చేపడుతామని, గ్రామ పరిధిలో 3,500 ఎకరాల్లోని వంద ఎకరాలను పేదలు సాగు చేసుకునేందుకు పంపిణీ చేస్తామన్నారు. ఏడాదిలోగా వాసాలమర్రి రూపురేఖలు మారిపోవాలి.. ప్రజా ప్రతినిధులు కూడా ఉద్యమ స్ఫూర్తితో అభివృద్ధికి కృషిచేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. వాసాలమర్రి, కొండాపూర్, తుర్కపల్లి, మాదాపూర్‌లో నెలకొన్న అడవి పందులు, కోతుల బెడద నివారణకు సైతం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వాసాలమర్రి గ్రామాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యాచరణపై పౌం హౌజ్ నుంచే వివిధ శాఖలకు చెందిన రాష్ట్రస్థాయి అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వాసాలమర్రిలో పర్యటించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. పది, పదిహేను రోజుల్లో వాసాలమర్రికి వస్తానని, గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేస్తానని సీఎం మాటిచ్చారు. అంకాపూర్ రైతులు అవలంభిస్తున్న వ్యవసాయ పద్ధతులను చూసి రావాలని, ఇందుకు సంబంధించి 400 మంది రైతులు అక్కడికి వెళ్లేలా మూడు రోజుల్లో ఏర్పాట్లు చేయిస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనితారామచంద్రన్ జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి అక్కడి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో చర్చించి అభివృద్ధి కమిటీని వేసుకోవాలని సూచించారు. రేపటి నుంచే వివిధ శాఖల అధికారులు గ్రామానికి వస్తారని.. గ్రామసమగ్ర అభివృద్ధికి సంబంధించి పదిరోజుల్లో పూర్తిస్థాయి నివేదికను తయారు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉండగా వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
తుర్కపల్లి : గ్రామాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని హరిస్తూ ఆదివారం మండలంలోని వాసాలమర్రిలో గ్రామస్తులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అభివృద్ధిలో వెనుకబడిన తమ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొని గ్రామ సమగ్రాభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రకటించడం హర్షణీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్, రైతుబంధు జిల్లా సభ్యురాలు పలుగుల ఉమారాణి, కో-ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు రహమత్ షరీఫ్, ఉప సర్పంచ్ మధు, గ్రామస్తులు జహంగీర్, మురళి, ప్రేమ్‌చంద్, చంద్రం ఉన్నారు.
సీఎం సార్ గొప్పతనం..
ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రం లోపలికి వెళ్లిన తమను కుటుంబ సభ్యునిగా ఆదరించి సమస్యలు తెలుసుకోవడం సీఎం కేసీఆర్ సార్ గొప్పతనం. మొదట సీఎం సార్‌తో మాట్లాడాలంటే కొంచెం బెరుకుగా అనిపించింది. కానీ సార్ మాటతీరుతో ఎంతో ధైర్యం వచ్చింది. త్వరలోనే మా గ్రామం జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా నిలుస్తుందనే నమ్మకం ఏర్పడింది.
-పలుగుల నవీన్‌కుమార్, ఎంపీటీసీ,వాసాలమర్రి
సమగ్రాభివృద్ధి నిర్ణయం హర్షణీయం..
సీఎం కేసీఆర్ గ్రామ సమగ్రాభివృద్ధికి తీసుకున్న నిర్ణయం గ్రామాల అభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. సీఎం సార్ మా గ్రామ సమస్యలను ఓపికగా వినడమే కాకుండా అక్కడిక్కడే వివిధ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి గ్రామ సమస్యలను గుర్తించాలని ఆదేశించడం చాలా సంతోషం కలిగింది.
-ఆంజనేయులు, సర్పంచ్,వాసాలమర్రి