ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Nov 02, 2020 , 00:28:56

కృషి ఫలించింది...

కృషి ఫలించింది...

ఆత్మకూరు(ఎం) : ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా మండల కేంద్రంలోని వీర్ల చెరువును రూ.82 లక్షలతో అభివృద్ధి చేయడంతో పాటు చెరువు కట్టను పటిష్టంగా నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువు పూర్తిస్థాయిలో నిండి అలుగు పోసింది. చాలా ఏండ్ల కిందట గ్రామంలోని వీర్ల చెరువు నుంచి గ్రామానికి దిగువన ఉన్న కొత్తచెరువు, బూతుకుంట వరకు కాల్వ నిర్మించారు. అయితే అప్పటి నుంచి కూడా కాల్వలో పూడుకుపోయిన తట్టెడు మట్టిని కూడా గత పాలకులు తీయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో అలుగుపోస్తున్న నీరు బిక్కేరు వాగులోకి వృథాగా పోతున్నది.

ఎంపీటీసీ సొంత ఖర్చులతో కాల్వ పూడికతీత..

ఆత్మకూరు(ఎం) ఎంపీటీసీ సభ్యురాలు యాస కవిత తన సొంత ఖర్చులు రూ.25వేలతో చెరువు కాల్వలో పూడుకుపోయిన మట్టిని రైతులతో పాటు యంత్రాల సహకారంతో తీయించారు. దీంతో చెరువు కాల్వ శుభ్రం కావడంతో వీర్ల చెరువు అలుగుపోసే నీరు నేడు చెరువుకాల్వ ద్వారా గ్రామంలోని కొత్త చెరువు, బూతుకుంట, పూర్తి స్థాయిలో నిండి కళకళలాడుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ కృషిని అభినందిస్తున్నారు.

800ల ఎకరాల సాగుకు ఆధారం...

కొత్తచెరువు, బూతుకుంట చెరువుకాల్వ ద్వారా వచ్చిన నీటితో నిండటంతో 800ల ఎకరాల సాగుకు ఆధారం కావడంతో పాటు సుమారు 30 వ్యవసాయబావులు, బోర్లలో ఊట పెరగడంతో రైతులు ఆనందిస్తున్నారు.

పూర్తి స్థాయిలో మరమ్మతు చేసేందుకు కృషి..

వీర్ల చెరువు అలుగు పోసినప్పుడు బిక్కేరు వాగులోకి నీరు వృథాగా పోతున్నది. రైతుల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ నాయకుల సహకారంతో సొంత ఖర్చులతో గ్రామంలో చెరువుకాల్వలో పూడుకుపోయిన మట్టిని తీయించాం. దీంతో అలుగు పోసినప్పుడు వచ్చే నీరు చెరువు కాల్వ ద్వారా నేడు ప్రవహించడంతో పాటు రైతులకు ఉపయోగపడే కొత్త చెరువు, బూతుకుంట నీటితో నిండటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో చెరువు కాల్వను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు కృషి చేస్తాం.

-యాస కవితాఇంద్రారెడ్డి ఎంపీటీసీ, ఆత్మకూరు(ఎం)

నీటి సమస్య తీరింది..

ఎంపీటీసీతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన కృషితో నేడు చెరువు కాల్వ ద్వారా నీరు ప్రవహించడంతో కొత్త చెరువు, బూతుకుంట నిండటం సంతోషంగా ఉంది. గతంలోకంటే ఇప్పుడు చాలా ఎకరాలలో సాగు చేసుకుంటున్నాం. బోర్లు, బావుల్లో ఊట పెరగడంతో నీటి సమస్య తీరింది.

-మజ్జిగ రాంబాబు రైతు, ఆత్మకూరు(ఎం)

VIDEOS

logo