‘ఫ్రెండ్లీ పోలీసింగ్' ప్రజలకే..

భువనగిరి క్రైం : సమాజంలోని ప్రజలతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనుసరిస్తామని, నేరాలు, దోపిడీలు, సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారితో కాదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్‌కు భువనగిరి పట్టణంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీపీ మహేశ్ భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జోన్‌కు 194 మంది కొత్త పీసీలు వచ్చినట్లు ఇందులో 170 సివిల్, 24 ఏఆర్ పీసీలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో కొంత మంది ఆర్డర్ టూ సర్వ్ ప్రకారం ఉన్నట్లు తెలిపారు. విధులు నిర్వహించే సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను పూర్తి వివరంగా విని అర్ధం చేసుకోవాలని చెప్పారు. ఉద్యోగంలో చేరిన మొదటి ఐదు సంవత్సరాలు చాలా కీలకమన్నారు. ఐదేండ్లు పూర్తి నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తే ఉద్యోగ సమయం మొత్తం మంచి పేరు లభిస్తుందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధి చాల పెద్దదని, నిజాయితీగా పని చేసి మంచిపేరు తీసుకురావాలన్నారు.
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి దాని నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ పై అధికారులు, తోటి సిబ్బందితో మర్యాదగా మెదులుకోవాలన్నారు. అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదని హెచ్చరించారు. ట్రైనింగ్ సమయంలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఉద్యోగం చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కానిస్టేబుల్తోటే ఆగిపోకుండా అర్హత ఉన్న వారు ఎస్ఐ, గ్రూప్1, యూపీపీఎస్సీకి ప్రిపేరవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సమీర్, ఏసీపీలు భుజంగరావు, కోట్ల నర్సింహారెడ్డి, సత్తయ్య, సీఐలు సుధాకర్, జానయ్య, ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
సీపీ మహేశ్ భగవత్
ప్రాణాలు కాపాడిన వారికి అభినందనలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి వద్ద వరదలలో చిక్కుకున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీస్, ఫైర్ సిబ్బందిని మంగళవారం భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో సీపీ మహేశ్ భగవత్ ప్రత్యేకంగా అభినందించారు. వరదలలో కొట్టుకుపోతున్న జీవన్ అనే వ్యక్తిని రాత్రి సమయంలో వర్షం పడుతుండగానే ప్రాణాలకు తెగించి కాపాడిన భువనగిరి రూరల్ సీఐ జానయ్య, ఎస్ రాఘవేందర్, ఏఆర్ పీఎసీ నజీర్, వెంకన్న ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శివప్రసాద్, ఫైర్‌మెన్ లక్ష్మయ్య, డీవోపీ శ్రీనివాస్, ఎల్ఎఫ్ బాబులను సీపీ సత్కరించి రివార్డులను అందించారు.
తాజావార్తలు
- అల్లరి నరేష్‌కు దిల్ రాజు బంపర్ ఆఫర్
- ప్రేమోన్మాది ఘాతుకం..
- అధునాతన 5జీ సేవలకు గూగుల్క్లౌడ్తో జత కలిసిన ఇంటెల్
- బైక్‌ను ఢీకొట్టిన బొలెరో.. ఇద్దరు దుర్మరణం
- చిలీకి నౌకను నిర్మించిన భారత సంస్థ ఎల్ అండ్ టీ
- అనసూయను ఆశ్చర్యంలో ముంచేసిన అభిమాని
- రోహిత్ శర్మ అర్ధసెంచరీ
- తొలిరోజు పాఠశాలలకు 10 శాతంలోపే విద్యార్థులు
- టీఆర్ఎస్తోనే నిరంతర అభివృద్ధి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
- గురువాయూర్‌లో ఏనుగులకు పరుగుపందెం