మంగళవారం 01 డిసెంబర్ 2020
Yadadri - Oct 27, 2020 , 00:04:12

ఎనీ టైమ్‌ నో క్యాష్‌.. పండుగపూట ఏటీఎంలు ఖాళీ

ఎనీ టైమ్‌ నో క్యాష్‌.. పండుగపూట ఏటీఎంలు ఖాళీ

నగదు నిల్వ లేక వినియోగదారుల ఇబ్బందులు 

చాలా కేంద్రాల్లో నోక్యాష్‌ బోర్డులు 

భువనగిరిలో 18 ఏటీఎం కేంద్రాలు 

నిర్వహణ మెరుగుపరిస్తేనే మేలు

భువనగిరి అర్బన్‌ : సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు. అత్యవసరంలో డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంలకు వెళ్లితో నగదు లేదు. ఈ బ్యాంకూ.. ఆ బ్యాంకూ.. అని తిరిగినా ఎక్కడా నగదు లేక నానా అవస్థలు. ఇదీ శని, ఆదివారాల్లో జిల్లా కేంద్రమైన భువనగిరిలో పరిస్థితి. వరుసగా మూడురోజులు సెలవులు రావడం, ఏటీఎం కేంద్రాల్లో నగదు లేకపోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  పండగల కోసం బ్యాంకులలో ఉన్న డబ్బులను ముందగానే డ్రా చేస్తారు. కానీ ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. భువనగిరి పట్టణంలో వివిధ శాఖలకు చెందిన 12 బ్యాంకులు, 18 ఏటీఎంలు ఉండగా వీటితోపాటు మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలున్నాయి. నాలుగవ శనివారం, సద్దుల బతుకమ్మ పండుగ కావడంతో దసరాకు ఒకరోజు మందే బ్యాంకులకు సెలవు ఇచ్చారు. దసరా ఆదివారం కావడంతో ప్రజలకు డబ్బులు చాలా అవసరం ఉంటాయి. భువనగిరిలో 18 ఏటీఎంలు ఉండగా ఏ ఒక్క ఏటీఎంలో కూడా పైసల్‌ లేవ్‌. ఈ ఏటీఎంలలో ఉదయం నుంచే బారులు తీరారు. కానీ శనివారం మధ్యాహ్నం వరకు నోక్యాష్‌ అని రిసిప్ట్‌ వచ్చింది. దీంతో ప్రజలు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుసగా మూడురోజులు సెలవు రావడంతో ముందురోజే ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో మూడురోజులు ఎలా అని.. ఖాతాదారులు ప్రశ్నించారు. డబ్బుల కోసం పట్టణంలో ఉన్న ఏటీఎంల వద్దకు పోవడం, అందులో నోక్యాష్‌ అని రిసిప్ట్‌ రావడంతో మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలను ఆశ్రయించగా అక్కడ కూడా తక్కువ క్యాష్‌ ఇవ్వడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. 

నగదు రహిత లావాదేవీలు అంతంతే...

కేంద్రం పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు జరుపాలని సూచించింది. నగదు  రహిత లావాదేవీలు ఆశించినంత స్థాయిలో జరపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజలు నగదు రహిత లావాదేవీలు జరుపాలని కేంద్ర ప్రభుత్వం సూచించినా, వ్యాపారులు మాత్రం నగదు లావాదేవీలే అధికంగా జరుపుతున్నారు. పండుగల సమయంలో బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంల ద్వారా నగదు తీసుకోవాల్సి ఉంటుంది. ఏటీఎంలలో క్యాష్‌ లేనప్పుడు నగదు రహిత లావాదేవీలు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు నగదు రహిత లావాదేవీలు జరుపకపోవడం, బ్యాంకులు మూసి ఉండడం, ఏటీఎంలలో డబ్బులు రావపోవడంతో అవస్థలు అన్నీఇన్నీ కావు.  

డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం.. 

ఏటీఎం కేంద్రాలలో డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పండగ సమయం, వరుస సెలవులు రావడంతో మొదటి రోజులోనే ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయి. బ్యాంకులు బంద్‌, ఏటీఎంలలో నోక్యాష్‌ బోర్డులు పెట్టడంతో ఏం చేయలేని పరిస్థితి ఉంది. వరుస సెలవులు..పండుగల సమయంలో ఏటీఎంలలో డబ్బులు ఉండేలా చూడాలి.  

- డి.అశోక్‌, ఖాతాదారుడు, భువనగిరి