గురువారం 03 డిసెంబర్ 2020
Yadadri - Oct 27, 2020 , 00:04:12

ఎల్లుండే ధరణి

ఎల్లుండే ధరణి

29న పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌ 

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈ నెల 29 నుంచి ధరణి పోర్టల్‌ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలోనే ప్రయోగాత్మకంగా ప్రభుత్వం తుర్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టగా సక్సెస్‌ అయ్యింది. ఇదే క్రమంలో జిల్లాలోని 17 మండలాల్లో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాల్లో ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేసి ఉంచుతున్నారు. 

జిల్లాలోని తహసీల్దార్లకు ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వగా తహసీల్దార్లతోపాటు, నాయబ్‌ తహసీల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు మరో విడత జిల్లాలో శిక్షణ ఇచ్చారు. తహసీల్దార్లకు ఎంతవరకు అవగాహన వచ్చిందో తెలుసుకోవడానికి అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూమి రిజిస్ట్రేషన్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యాలయంలో రోజుకు 10 చొప్పున డమ్మీ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. ఇప్పటి వరకు చేపట్టిన 200కు పైగా ట్రయల్స్‌ సక్సెస్‌ అయ్యాయి. ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తే రాష్ట్ర స్థాయిలో ఉన్న టెక్నీషియన్‌ బృందం ఎప్పటికప్పుడు సరిచేస్తోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ధరణి కో-ఆర్డినేటర్‌ను, ఒక ఏడీఎంను నియమించారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి ట్రయల్‌ రన్‌ను పరిశీలిస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న ఫర్నీచర్‌ను రిజిస్ట్రేషన్ల కోసం వినియోగిస్తుండగా, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌, ఐరిష్‌ యంత్రం, ఇతర సామగ్రిని కూడా కార్యాలయంలో ఇప్పటికే సమకూర్చారు. జిల్లాలోని 7 తహసీల్దార్‌ కార్యాలయాల్లో తెలంగాణ స్వాన్‌ నెట్‌ కనెక్షన్‌తోపాటు ప్రైవేటు నెట్‌ కనెక్షన్‌ అందుబాటులో ఉంది. రిజిస్ట్రేషన్ల సందర్భంగా నెట్‌ సమస్య తలెత్తకుండా ఇదే తరహాలో మిగతా 11 తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ ప్రత్యామ్నాయ నెట్‌ కనెక్షన్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 

అరగంటలోనే పట్టా పాసు పుస్తకం... 

ధరణి పోర్టల్‌ ప్రారంభం అయ్యాక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ అత్యంత వేగంగా పూర్తయి కేవలం అరగంటలోనే పట్టా పాసుపుస్తకం చేతికి రానున్నది. సాంకేతిక సమస్యలు తలెత్తని పక్షంలో అంతకంటే తక్కువ సమయంలోనే పాసు పుస్తకం అందుతుంది. ఈ ప్రక్రియను సులభతరంగా నిర్వహించేందుకు స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీని వల్ల ఇంట్లో కూర్చొనే స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో వెబ్‌సైట్‌ను పొందుపరిచారు. కొనుగోలు చేసిన భూమి ఏ తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ఏ తేదీన రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. సమయాన్ని కూడా పోర్టల్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆ తేదీ, సమయం అందుబాటులో ఉంటే స్లాట్‌ బుక్‌ అవుతుంది. దాని ప్రకారం విక్రయదారులు, కొనుగోలు దారులు కార్యాలయానికి వెళ్తే..రిజిస్ట్రేషన్‌ చేసిన రోజునే తహసీల్దార్లు అన్ని పత్రాలు పరిశీలించి మ్యుటేషన్‌ చేసి పాస్‌ బుక్‌ను కూడా జారీ చేస్తారు. భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మూడు లాగిన్‌ల ద్వారా పూర్తవనుంది. 

మీ సేవ లాగిన్‌ ద్వారా దరఖాస్తు చేస్తే వివరాలు అక్కడి నుంచి ఆపరేటర్‌ లాగిన్‌లోకి ఆ తర్వాత తహసీల్దార్‌ లాగిన్‌లోకి సమాచారం వస్తుంది. తహసీల్దార్లు ఇక నుంచి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనుండడంతో డిజిటల్‌ సిగ్నేచర్‌ను వీరికే ప్రభుత్వం కల్పించింది. అయితే తహసీల్దార్‌ లేని రోజు రిజిస్ట్రేషన్లు చేసేందుకుగాను నాయబ్‌ తహసీల్దార్లకు అధికారాన్ని కల్పించిన ప్రభుత్వం వీరికి కూడా లాగిన్‌తోపాటు డిజిటల్‌ సిగ్నేచర్‌ను కల్పిస్తోంది.

‘ధరణి’తో ఇకపై రిజిస్ట్రేషన్లు ఈజీ 

- కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 

ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ను ప్రారంభించేం దుకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో సర్వం సిద్ధం చేసి ఉంచాము. రాష్ట్ర స్థాయిలో శిక్షణ తర్వాత జిల్లా స్థాయిలోనూ మరోసారి తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చాము. ఇప్పటికే టెస్ట్‌ డ్రైవ్‌ను కూడా నిర్వహించాం. సందేహాలను నివృత్తి చేస్తున్నాం. ప్రస్తుత ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చాలా ఈజీగా ఉండనుండడంతో రాబోవు రోజుల్లో ప్రజలకు సులభతరంగా, మెరుగైన సేవలు అందుతాయి. 

ధరణితోనే పారదర్శక సేవలు

- అశోక్‌రెడ్డి, తహసీల్దార్‌, యాదగిరిగుట్ట

కొత్త రెవెన్యూ చట్టంతో ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుతాయి. ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్య లను చెక్‌ పెట్టేందుకు కొత్త చట్టాన్ని అమలు చేస్తోంది. ప్రస్తుతం తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి డమ్మీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొనసాగి స్తున్నాం. సైట్‌లో సాంకేతికలోపాలను టెక్నికల్‌ సిబ్బంది మెరుగుపరుస్తున్నారు. కార్యాలయంలో ధరణి సేవలను అందించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాం. 

ధరణి ప్రక్రియ బాగుంది

- గిరిధర్‌, తహసీల్దార్‌, చౌటుప్పల్‌

ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ప్రక్రియ బాగుంది. రైతులందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉం టుంది. ధరణి ట్రయల్‌ రన్‌ బాగా అవుతుంది. ప్రస్తుతం డమ్మీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నాము.