శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 24, 2020 , 23:50:34

28న ముహూర్తం

28న ముహూర్తం

  • ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పూర్తి 
  • మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం
  • ప్రభుత్వ విప్‌ దంపతుల  ప్రత్యేక పూజలు 
  • సకల వసతులతో మ్మెల్యే కార్యాలయం
  • ప్రజలకు మరింత చేరువైన సేవలు 

ఆలేరు టౌన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిర్మించేందుకు నిధులు కేటాయించారు.  ఇందులో భాగంగానే ఆలేరు నియోజకవర్గంలో 2017లో క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులకు అధికారులు శంకుస్థాపన చేశారు. కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కోటి రూపాయాలు నిధులు మంజూరు చేయడమే కాకుండా అవసరమైన స్థలాన్ని కేటాయించింది. దీంతో రహదారులు, భవనాల శాఖ అధికారులు నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేయగా ఇంకా చిన్నచిన్న పనులు మిగిలిఉన్నాయి. అయితే రూ.20 లక్షలు నిధులు కేటాయిస్తే భవనం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. ఈ నిధులతో కార్యాలయం చుట్టూ ప్రహరీ నిర్మించడంతో భవన మెట్లకు సమాంతరంగా మట్టిని (బరంతి) నింపి పర్నిచర్‌ నింపాల్సి ఉన్నదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 

అన్ని వసతులతో కార్యాలయం..

ఆలేరులోని మంతపురి రోడ్డులో బైపాస్‌ పక్కన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదుట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం  నిర్మించారు. కుటుంబంతో గడిపేందుకు నివాసం కూడా అందులోనే ఉండేలా క్యాంపు కార్యాలయాన్ని రెండు అంతస్తులు నిర్మించారు. ఇందులో పార్కింగ్‌ స్థలంతో పాటు మీటింగ్‌ హాల్‌, వెయిటింగ్‌ హాల్‌, సెక్యూరిటీ రూం, విశ్రాంతి గదులను నిర్మించారు. అలాగే బెడ్‌రూంలు, పూజ గది, వంట గదిని నిర్మించారు. అయితే ఈనెల 28న ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే..

క్యాంపు కార్యాలయం పూర్తయినందున ఇక నుంచి ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజలు నేరుగా ఎమ్మెల్యేను కలుసుకొని తమ సమస్యలను విన్నవించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను పిలిపించుకొని సమీక్షలు నిర్వహించి సమస్యలను తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో అన్నిచోట్ల పర్యటించి వారి కష్టసుఖాలను తెలుసుకునే వెసులుబాటు కలుగనుంది. అంతే కాకుండా ప్రజలు, ప్రజాప్రతినిధులు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. 

సమస్యలను నేరుగా చూడవచ్చు..

క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తయినందున ఎమ్మెల్యే స్థానికంగా ఉండటంతో పాటు ప్రజల సమస్యలను నేరుగా చూడవచ్చు. ప్రభుత్వం అమలు చేసే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా పరిశీలించవచ్చు. అంతే కాకుండా నియోజకవర్గంలో నిరంతరం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవచ్చు. 

-బొట్ల పరమేశ్వర్‌, మాజీ జడ్పీటీసీ ఆలేరు 

పాలన మరింత చేరువ..

క్యాంపు కార్యాలయ నిర్మాణంతో ప్రజలకు పాలన మరింత చేరువ కానుంది. ఎమ్మెల్యేకు వసతి సౌకర్యం ఉండటం వల్ల నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. రోజుల తరబడి నివాసం ఉండేందుకు అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 

-నాగరాజు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, ఆలేరు