శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 23, 2020 , 23:32:38

వేదికలు రెడీ

వేదికలు రెడీ

  •  రేపు రైతు వేదికల ప్రారంభోత్సవం
  •  జిల్లావ్యాప్తంగా 92 వేదికల నిర్మాణం 
  • ఇప్పటికే 41 చోట్ల పూర్తి
  •  వేదికలతో రైతు సమస్యలు పరిష్కారం 

రైతులంతా ఒకేచోట కూర్చొని చర్చించేందుకు, వ్యవసాయాధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు నిర్మిస్తున్న రైతు వేదికలు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ఆదివారం దసరా రోజున ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 92 వేదికలు నిర్మిస్తుండగా, ఇప్పటివరకు 41 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఒక్కోదాని వ్యయం రూ.22 లక్షలు. మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదికల నిర్మాణ పనులు జిల్లాలో చాలా వరకు పూర్తికావస్తున్నాయి. విజయదశమి పర్వదినం రోజున ప్రారంభించుటకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తు న్నది. జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లోని 92 క్లస్టర్‌ కేం ద్రాల్లో రైతువేదికల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. కొన్నిచోట్ల నిర్మాణ కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయడం గమనార్హం. జిల్లాలో ప్రతిఐదువేల ఎకరాలకు ఒకటి చొ ప్పున 92 వ్యవసాయ క్లస్టర్‌లు ఉన్నాయి. క్లస్టర్‌కు ఒక వేదిక చొప్పున 92 రైతు వేదికల నిర్మాణానికి రూ.20.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి రూ. 10లక్షలు వ్యవసాయ శాఖ రూ.12లక్షల చొప్పున ఒక్కో వేదికకు ఖర్చు చేస్తున్నారు. 50ఫీట్ల వెడల్పు, 70ఫీట్ల పొడవుగా వేదిక నిర్మాణం ఉండేలా డిజైన్‌ చేశారు. అందులోనే 12/12, సైజులో ఒక గది, 20/12సైజులో మరో గదిని నిర్మిస్తున్నారు. వేదికలకు పక్కన స్త్రీ, పురుషులకు వేర్వేరు బాత్‌రూంలు నిర్మిస్తున్నారు. 92 రైతు వేదికలకు గాను 41 చోట్ల పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మిగతావి వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి.

మండలాల వారీగా మంజూరైన వేదికలు

భువనగిరి మండలంలో 8, బీబీనగర్‌లో 4, ఆలేరులో 5, ఆత్మకూర్‌(ఎం) 5, యాదగిరిగుట్టలో 3, రాజాపేటలో 4, తుర్కపల్లి లో 6, బొమ్మలరామారం 4, వలిగొండ 11, రామన్నపేట 4, మోత్కూరు 3, అడ్డగూడూరు 3, మోటకొండూరు 4, గుండాల 6, పోచంపల్లి 6, చౌటుప్పల్‌ 9, నారాయణపురం 7చొప్పున రైతువేదికలు మంజూరు అయ్యాయి..

వేదికల వేదికగా రైతు సమస్యలు పరిష్కారం

రైతుల సమస్యల పరిష్కారానికి రైతువేదికలు వేదిక కానున్నాయి. ఒక్కోవేదికకు ప్రభుత్వం ఒక క్లస్టర్‌ అధికారి( వ్యవసాయ విస్తరణ అధికారి)ని నియమిస్తుంది. రైతువేదికలలో రైతులకు పంటల సాగుపై శిక్షణా తరగతులు అవగాహన సదస్సులు  నిర్వహించనున్నారు.