శుక్రవారం 04 డిసెంబర్ 2020
Yadadri - Oct 23, 2020 , 23:32:38

బతుకునిచ్చే.. బతుకమ్మ

బతుకునిచ్చే.. బతుకమ్మ

ఆలేరు టౌన్‌ :  బతుకమ్మ వేడుక.. మన సంస్కృతికి చిహ్నం. బతుకమ్మ వేడుక మన జీవనంలో ఒక భాగం. తెలంగాణ ఆడపడుచుల మధుర జ్ఞాపకం బతుకమ్మ పండుగ. మన సంస్కృతీసాంప్రదాయాలు నేర్పే అమ్మగా బతుకమ్మ తెలంగాణ మహిళా లోకానికి తోబుట్టువుగా ప్రసిద్ధి. కాకతీయుల కాలం నుంచే ఈ పండుగను జరుపుకుంటున్నారు. మహిళలు, చిన్నారులు పట్టువస్ర్తాలు ధరించి కుల, ధనిక, పేద అనే తేడా లేకుండా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మను ఆడుతారు. 

బతుకమ్మ విశిష్టత.. 

హిందు సంప్రదాయంలో కల్యాణం, గృహప్రవేశం, వినాయక చవితి, దీపావళి, వ్రతాలు నిర్వహించేటప్పుడు పసుపుతో గౌరిమాతను తయారు చేసి పూజిస్తారు. బతుకమ్మను పేర్చేటప్పుడు సైతం గౌరిమాతను తయారు చేసి పెడతారు. బతికించి, కోరికలు తీర్చే అమ్మగా గౌరిమాతను బతుకమ్మగా మహిళలు పూజిస్తారు. పెండ్లి వయస్సు ఉన్న అమ్మాయిలు మంచి భర్త రావాలని, వివాహమైన స్త్రీలు నిండు నూరేండ్లు తన భర్త ఆయురారోగ్యాలతో బాగుండాలని, తన పసుపుకుంకుమలు బాగుండాలని బతుకమ్మను పూజించడం ఈ పండుగ విశిష్ఠత.

కాకతీయుల కాలం నుంచే..

తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయ రాజు గుండన కాలంలో పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడి తోటలో లభించినందువల్ల దానికి సంస్కృత పేరయిన కాకతమ్మ అంటూ రాజులతోపాటు ఆ ప్రాంత ప్రజలు ఆ దేవతను పూజించడం మొదలు పెట్టారట. రానురాను విగ్రహం కన్నా దాని ముందు పూలకుప్పే దేవతా స్వరూపంగా మారిపోయింది. కాలక్రమంలో కాకతమ్మ శబ్దం కాస్త బతుకమ్మగా మారి ఉండొచ్చనేది పరిశోధకుల మాట. కాకతీయుల సేనాని జాయాప సేనని రచించిన నృత్యారత్నావలిలోని ఒక చిందు.. బతుకమ్మ ఆటకు మూలమని పరిశోధకులు అభిప్రాయ పడుతున్నారు. బతుకమ్మ పాటల్లో స్త్రీల కష్టాలు, కన్నీళ్లు.. సామాజిక స్థితిగతులు కండ్లకు కట్టినట్టు వినిపిస్తాయి. 

బొడ్డెమ్మ నుంచి బతుకమ్మ వరకు..

బతుకమ్మ కంటే ముందుగా బొడ్డెమ్మగా పూజిస్తారు. వినాయక చవితి లేదా పొలాల అమావాస్య తరువాతి రోజు బొడ్డెమ్మలను ఆవుపేడా లేదా పుట్ట మట్టితో తయారు చేసి ఆడుతారు. ఈ బొడ్డెమ్మ తరువాత వచ్చేది బతుకమ్మ పండుగ. 

ఆట..పాట.. అలంకరణ..

బతుకమ్మ పండుగలో ఆట,పాటలు ప్రత్యేకం. అంతే కాకుండా అలంకరణల్లో కూడా ప్రత్యేకత కనిపిస్తుంది. బతుకమ్మను పేర్చేటప్పుడు 2,5,7 రకాల పూలు వాడుతారు. తాంబాలంలో గుమ్మడి ఆకు పేర్చి ముత్తైదువులకు బొట్లు పెట్టి పేర్చడం ప్రారంభిస్తారు. మొదట తంగెడు, గునుగు పూలు, మిగతావి నిత్యమల్లె, గుర్మాశి, సీతమ్మజడ, బీరపువ్వు, శివపార్వతి పూలు పేర్చుతారు. సద్దుల బతుకమ్మను చేసిన తర్వాత ఊరేగింపుగా నిమజ్జనానికి దారి పొడవునా బతుకమ్మ పాటలు పాడుతూ వెళ్లి ఊరి చెరువులో నిమజ్జనం చేస్తారు. 

బతుకమ్మను పేర్చడం కళ..

బతుకమ్మను పేర్చడం అనే ఒక కళ. రంగురంగుల పూలతో పేర్చడం అందం.. కూర్పులో నేర్పు ఉంటాయి. తంగెడు, బంతి, గునుగు, గుమ్మడి పూలు, తీగమల్లే, మంకెన పువ్వు, చెత్రి పువ్వు, గులాబీ, పోకబంతి, కనకాంబరాలు, గన్నేరు పువ్వులు, గోరెంక పూలతో పాటు సీజన్‌లో దొరికే పూలతో పేరుస్తుంటారు. వరుసవరుసకు పూలు మారుతాయి. తల్లి బతుకమ్మతో పాటు పిల్ల బతుకమ్మను చేయడం తప్పనిసరి. ఎందుకంటే బతుకమ్మను ఒంటరిగా పంపవద్దు. 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో..

తెలంగాణకే ప్రత్యేకమైన ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ జాగృతి సంస్థ చైర్మన్‌ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో లక్షలాది ఆడబిడ్డలతో బతుకమ్మ పండుగను నలుమూలల నిర్వహిస్తుంటారు. తెలంగాణ ప్రాంతంలోనే జరుపుకునే పండుగను తెలంగాణ వాసులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా చేసుకునేలా వారిలో చైతన్యాన్ని జాగృతి సంస్థ తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బతుకమ్మను అధికారికంగా రాష్ట్ర పండువగా ప్రకటించింది ఉద్యమ నాయకులు సీఎం కేసీఆర్‌ సారథ్యంలోనే.

తృణ ధాన్యాలతో ఫలహారం...

సద్దుల బతుకమ్మ రోజు పంచే ఫలహారం ము ఖ్యంగా ఆడపిల్లలకు ఉపయోగపడే విధంగా త యారు చేస్తారు. బతుకమ్మతో పాటే వివిధ రకా ల ఫలహారాలను చెరువు దగ్గరికి తెచ్చి పంచిపెడుతారు. సద్దుల రోజు చెరువు దగ్గరకు మల్లీల ముద్దలు తీసుకువెళ్తారు. రాగి, జొన్నలు, గోధుమలు/బియ్యంతో కానీ తయారైన పిండితో రొట్టె చేసి దాన్ని చిన్నచిన్న ముక్కలు చేసి బెల్లం పాకంతో కలిపి చేసిన ముద్దలను మలీద ముద్దలు అంటారు. వాటిని బతుకమ్మ వాయినాలుగా ఇచ్చి పుచ్చుకుంటారు.