గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 23, 2020 , 23:32:34

తప్పిన పెనుముప్పు

తప్పిన పెనుముప్పు

  •   భువనగిరి పెద్ద చెరువుకు తొలగిన ప్రమాదం 
  • కుంగిన కట్టకు మరమ్మతు పనులు వేగం
  •  చెరువు అలుగుకు గండి పెట్టి నీటి విడుదల
  •  తెల్లవారుజాము వరకు పర్యవేక్షించిన  ఎమ్మెల్యే, కలెక్టర్‌, సీపీ మహేశ్‌భగవత్‌

భువనగిరి : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో భువనగిరి పెద్దచెరువు నీటితో పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కట్ట కొద్దిగా కుంగింది. ఈ విషయాన్ని స్థానిక రైతుల నుంచి తెలుసుకున్న అధికారులు పెద్దచెరువు వద్దకు  చేరుకుని కుంగిన కట్టను పరిశీలించారు. హుటాహుటిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌  చెరువు కట్ట వద్దకు చేరుకుని అధికారులతో సమీక్షించారు. చెరువు అలుగును జేసీబీలతో ధ్వంసం చేయించి నీటిని విడుదల చేశారు. దీంతో పాటుగా కుంగిన చెరువు కట్ట వద్ద మరమ్మతు చర్యలు వేగవంతంగా చేపట్టారు. దీంతో భువనగిరి పట్టణంలోని చెరువు సమీప ప్రాంతాలైన తాతానగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ, ఎల్‌బినగర్‌, సింగన్నగూడెం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెరువు కట్టకు గండి పడటంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రి సమయం కావడంతో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా సమగ్ర చర్యలు తీసుకున్నారు. 

చెరువు కట్ట అలుగుకు గండి కొట్టి నీటిని కిందకు తరలిస్తున్న క్రమంలో భువనగిరి-హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో వాహన  రాకపోకలను నియంత్రించి దారి మళ్లించారు. చెరువుకట్టకు మరమ్మతు చర్యలు చేపడుతున్న క్రమంలో శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ పరిస్థితిని సమీక్షించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జాతీయ విపత్తు నివారణ సంస్థ ఆధ్వర్యంలో రెండు బృందాలతో 45 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు చెరువు కట్టపై మరమ్మతు చర్యలు చేపడుతుండటంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ సకాలంలో అధికారులు సమగ్ర చర్యలు చేపట్టడంతో భువనగిరి పట్టణానికి పెను ముప్పు తప్పినైట్లెందని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కట్ట మరమ్మతు పనుల్లో అధికారులను అప్రమత్తం చేయించడంలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌లకు పట్టణ ప్రజలు కృతఙ్ఞతలు తెలియజేశారు. 

చెరువుకట్టకు ప్రమాదం లేదు : కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

చెరువుకట్ట కుంగిన విషయం తెలుసుకున్న వెంటనే ప్రజలను అప్రమత్తం చేశాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకున్నాం. చెరువుకట్ట కుంగిన ప్రదేశాన్ని సందర్శించడంతో పాటుగా అధికారులకు ఆదేశాలను జారీ చేశాం. చెరువు నీటి విడుదలతో పాటుగా కాలువల ద్వారా చెరువులోకి వచ్చే నీటిని పూర్తిగా నిలుపుదల చేశాం. ముందస్తు చర్యల్లో భాగంగా ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, పునరావాస ఏర్పాట్లను చేపట్టాం. అదేవిధంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచడంతో పాటుగా నీటిపారుదల శాఖ సీఈ, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల సూచనలు, సలహాలతో కుంగిన ప్రాంతంలో ఇసుక బస్తాలతో మరమ్మతు చర్యలు చేపట్టాం. చెరువుకట్టకు ఎలాంటి ప్రమాదం లేదు. గండం గడిచింది.

VIDEOS

logo