శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Oct 23, 2020 , 01:25:38

మూగబోయిన నేరేడుగొమ్ము

మూగబోయిన నేరేడుగొమ్ము

  •   నాయిని నర్సింహారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు
  • గ్రామాభివృద్ధికి నిర్విరామ కృషి, రూ.5కోట్లతో అభివృద్ధి పనులు 
  • నాయిని చొరవతోనే నేరేడుగొమ్ము మండలం ఏర్పాటు

దేవరకొండ/చందంపేట : తెలంగాణ తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం రాత్రి మృతి చెందడంతో ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మూగబోయింది. నాయిని మరణవార్త వినగానే మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున  హైదరాబాద్‌ తరలివెళ్లారు. నేరేడుగొమ్ములో 1940మే 12న నాయిని దేవారెడ్డి-సుభద్రమ్మ దంపతులకు జన్మించిన నాయిని స్థానికంగానే ప్రాథమిక విద్య(నాలుగో తరగతి)ను పూర్తిచేశాడు. అనంతరం 16కిలోమీటర్ల దూరం లో దేవరకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎస్‌సీని పూర్తి చేసుకొని తండ్రికి తోడ్పాటుగా వ్యవసాయ పనులకు వెళ్లేవారు. నాగార్జునసాగర్‌లో సంవత్సరంన్నర పాటు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసిన నాయిని.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఆధ్వర్యంలో సోషలిస్టు పార్టీలో చేరి సభ్యత్వం పొందారు. అప్పటికే దేవారెడ్డి సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ క్రమంలో దేవారెడ్డి పోలీసు యాక్షన్‌లో తూటాలకు బలయ్యారు. పెదనాన్న కుమారుడు రఘుమారెడ్డి ప్రోత్సాహంతో నాయిని నర్సింహారెడ్డి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. విద్యార్థి దశ నుంచే పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1952లో వచ్చిన ఇండ్లీ సాంబర్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో, గైర్‌ ముల్కీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1960లో జరిగిన తాలా తాడో ఉద్యమంలో సోషలిస్టు పార్టీ తరుఫున పాల్గొన్నారు. ఈ క్రమంలోనే 1962లో హైదరాబాద్‌కు మాకాం మార్చారు. బేగంబజార్‌లో సోషలిస్టు పార్టీ ఆఫీసు ఇన్‌చార్జిగా పనిచేస్తూ లాల్‌గిర్స్‌ మఠంలో కార్యాలయంలో పనిచేసేవారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 

నేరేడుగొమ్ము గ్రామంలో నాయిని దొరల కుటుంబ ఆధిపత్యమే కొనసాగేది. వీరు శిస్తులు వసూలు చేసి నిజాం సర్కారుకు కట్టేది. ఆ గ్రామంలో ఉన్న దొరలు, లేని దొరలు అని రెండు రకాలు వారున్నారు. నాయినిది మధ్యతరగతి కుటుంబం. అప్పట్లో నాయిని నర్సింహారెడ్డి నేరేడుగొమ్ము గ్రామంలో ఉద్యమాన్ని లేవదీశారు. చుట్టుపక్కల గ్రామాల్లో భూస్వాముల వద్ద పని చేస్తున్న జీతగాళ్ల తరఫున పోరాడారు. ఉన్నత వర్గానికి చెందిన వారి కారణంగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. 

గ్రామంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు 

రూ.5కోట్ల నిధులతో మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో పాటు, రూ.కోటితో సీసీ రోడ్లు, పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు, గ్రామంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో ప్రత్యేక చొరవ చూపారు. నూతన అంగన్‌వాడీ భవనం, కమ్యూనిటీ హాల్‌, అంతర్గత డ్రైనేజీ, తదితర పనులకు నిధులు కేటాయించి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు.

హోంమంత్రి అయినా సొంతూరును మరువలేదు..

తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయిని పలుమార్లు నేరేడుగొమ్ముకి వచ్చా రు. గ్రామస్తులను పేరుపేరునా పలుకరించేవారు. 2016లో జిల్లాల పునర్విభజన సమయంలో నేరేడుగొమ్ము మండలాన్ని ప్రభుత్వం ప్రకటించడం లో నాయిని కృషి మరువలేనిది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వెళ్లి తన స్వగ్రామాన్ని మండల కేంద్రం గా ఏర్పాటు చేయాలని కోరి ఒప్పించుకున్నారు. నెలకొక సారి గ్రామానికి వచ్చి పొలాలను, బోర్లను, ఇల్లును చూసి వెళ్లేవారు. చిన్ననాటి మిత్రులను పలుకరించి వారితో ముచ్చటించేవారు. నాయిని గ్రామానికి వస్తున్నారంటే.. ‘తాతయ్య వస్తున్నాడు’ అంటూ అభిమానులు ఇంటి వద్ద గుమిగూడేవారు. మూడేళ్ల కిందటే గ్రామంలో నూతన గృహనిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని కౌలుకు ఇచ్చారు. 

మామకు సల్లంటే ఇష్టం..

మా మామ నర్సింహారెడ్డికి సల్ల అంటే శానా ఇష్టం. నేరెడుగొమ్ముకు వస్తుండంటే సాలు.. మందుగాల సల్ల చేసి ఇచ్చేదాన్ని. ‘బాగున్నవా జయప్ర దా..’ అని అప్యాయం గ పలకరించేది. మా ఆయన రాంరెడ్డితో అన్ని ముచ్చట్లు చెప్పి వెళ్లేవారు. రాగానే ఇంటి గోడలు ఎట్లున్నయి.. ఏం పంట వేసినరు.. బాయి కాడ బోరు పని చేస్తున్నదా లేదా.. అని అడిగేది. కౌలు పనులు చేస్తున్న హన్మంతు బాలయ్యను పిలుసుకురమ్మని కబురు పంపేవారు. ‘నెల రోజుల్లో వస్తా..’ అని చెప్పి పోయిండు. 

- నాయిని జయప్రద, కోడలు

చిన్నప్పటి నుంచి కలిసి మోట తోలినం..

నాయిని నర్సింహారెడ్డి నా చిన్నప్పటి దోస్తు. గిరిజనులు అంటే ఆయనకు అభిమానం. మా తండోళ్లు చాలా మంది దొర ఇంటికి వచ్చి పోతుంటం. దొరోళ్ల బాయిలో ఇద్దరం కలిసి మోట కొట్టేటోళ్లం. మొన్నీమధ్యన దొర ఇంటికొచ్చిన్పప్పుడు నేను పోయి కలిసిన. కుసోబెట్టి మాట్లాడిండు. ‘బాగున్నవా వెంకట్రాం..’ అని అడిగిండు. అందరికి పించినొస్తుంది.. నాకు రాట్లే దొరా అంటే రెండ్రోజుల్ల పనిచేపిచ్చిండు. మా ఇంటోళ్లందరు సంబురపడ్డరు. దొర ఊళ్లోకి వస్తుండంటే ముందుగాల వచ్చి ఆయన ఇంటి ముందు ఉంటాం. ఆయన చనిపోయిండని తెలిసి శానా బాధైతుంది. తెల్లారుజామునే దొర ఇంటికాడికి వచ్చిన.

- నేనావత్‌ వెంకట్‌రామ్‌, నేరేడుగొమ్ము

VIDEOS

logo