దసరా.. హుషారు

- జిల్లాలో మొదలైన పండుగ సందడి
- సద్దుల బతుకమ్మ, దసరా కొనుగోళ్ల జోరు
- కిటకిటలాడుతున్న వస్త్ర, రెడీమేడ్, కిరాణా దుకాణాలు
- పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
- యాదగిరిగుట్ట డిపో నుంచి 75 సర్వీసులు
- పెరిగిన డిపో ఆదాయం, రోజుకు రూ.8 లక్షల పైమాటే..
ఆలేరు /భువనగిరి /ఆలేరు రూరల్ : కరోనా మహమ్మరి వల్ల నష్టపోయిన వ్యాపారాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో వస్త్రవ్యాపారాలు, బంగారం, కంగన్హాళ్లు తదితర దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి మొదలైంది. ఈఏడాది మార్చి నుంచి లాక్డౌన్ వల్ల వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. వ్యాపారం మీద ఆధారపడిన వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇండ్లలో నుంచి బయటికి రాకుండా ఉన్నదాంట్లోనే సర్దుకున్నారు. ఇటీవలె దుకాణాలు తెరుచుకున్నా కరోనా భయానికి ఎవరు పట్టణాలకు రాకపోవడంతో వ్యాపారం అంతంతా మాత్రంగానే సాగింది. ఇప్పుడు వరుసగా పండుగలు రావడం, కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పట్టణాల్లో సందడి మొదలైంది. వ్యాపారాల్లో భరోసా కలిగింది.
ఆన్‌లైన్‌లోనూ గిరాకీ..
లాక్డౌన్ సడలింపు తర్వాత బయటికి రావడానికి జంకిన జనం వారికి ఏదైన అవసరమైతే ఆన్లైన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలు సమిపిస్తుండటంతో ఈకామర్స్ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తుండటంతో కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మార్కెట్‌కు వచ్చి నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేవారు. ప్రస్తుత ఆధునిక కాలంలో సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారా వారికి కావల్సిన వస్తువులను బుక్‌చేసుకొని నేరుగా ఇంటికి తెప్పించుకుంటున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ఈ ఆన్లైన్ విక్రయాలకు మరింత ఆదరణ లభిస్తుండటంలో అతిశయోక్తి లేదు. పల్లె నుంచి పట్నం వాసుల వరకు ఈ తరహా లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
దసరా పండుగ సమీపిస్తుండటంతో ఆర్టీసీ గురువారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభించింది. యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 110 ఆర్టీసీ బస్సులుండగా 75 బస్సులను ప్రయాణికులకు అందుబాటులో ఉంచామని డిపో మేనేజర్ రఘు తెలిపారు. విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం తదితర అవసరాలకోసం స్వగ్రామాలను వదిలి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా దసరా పండుగకు తమ సొంత స్వగ్రామాలకు వస్తున్నారు. పండుగ వేళ కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాలుపంచుకోవడానికి గ్రామాలకు చేరుకుంటున్నారు. పండుగ తరువాత తిరిగి పట్టణాలు, నగరాలకు బయలుదేరుతుంటారు. ఈ సందర్భంగా కరోనాతో నష్టపోయిన ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను ప్రారంభించింది.
తెలుగు రాష్ర్టాల మధ్య రెండు రవాణా సంస్థల మధ్య బస్సులు తిరిగేందుకు ఒప్పందం కుదురకపోవడంతో ఆంధ్రప్రదేశ్ శివారు వరకే తెలంగాణ ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. వాస్తవానికి ప్రతి దసరా వేళ ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరుతుంది. కానీ గతేడాది దసరా వేళ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థ కుదేలైంది. తాజాగా ఈ ఏడాదిలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడువకపోవడంతో, ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు డిపోలో ఆర్టీసీ బస్సులంనింటినీ నడిపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
బస్సు సర్వీసులు ఇలా..
జిల్లాలోని యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో మొత్తం 110 బస్సులున్నాయి. ఇందులో గురువారం నుంచి రోజుకు 75 ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకనుగునంగా ఉద్యోగులను అందుబాటులో ఉంచారు. దసరా పండుగ వేళ ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. యాదగిరిగుట్ట నుంచి రాయచూర్, కోదాడ, వనపర్తి, నారాయణఖేడ్, అల్లంపూర్ ఎక్స్‌రోడ్డు, నిజామాబాద్, చేర్యాల, హైదరాబాద్ ఉప్పల్, సికిందరాబాద్, సిద్దిపేట, నల్లగొండ, రాజాపేట, బొందుగుల, మోత్కూరు, ఉప్పలపహాడ్, మోటకొండూర్, అమ్మనబోలు, మోత్కూరు, తిరుమలగిరి, గంగాపురం, వలిగొండ, పొడిచేడు, ఇతర ప్రాంతాలతో రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సులను అందుబాటులో ఉంచారు.
రోజుకు రూ. 8 లక్షల ఆదాయం..
దసరా పండుగ నేపథ్యంలో యాదగిరిగుట్ట డిపోలో రోజుకు మొత్తం 75 ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచగా ఒక్కరోజు రూ.8 లక్షల ఆదాయం వచ్చింది. వారం రోజుల కిందట రోజుకు రూ.2 నుంచి 3 లక్షల ఆదాయం వచ్చేదని, దసరా సయమంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు ఆదాయం సైతం పెరుగుతూ వస్తుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
పర్యవేక్షణకు అధికారులు..
ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్‌తో పాటు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉప్పల్ క్రాస్‌రోడ్డు వద్ద యాదగిరిగుట్ట డిపో డీఎంలు అందుబాటులో ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికులందరూ కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ప్రయాణించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెబుతున్నారు.
పండుగ సందడి ..
తెలంగాణ ప్రజలకు అతి పవిత్రమైన దసరా పండుగ దగ్గర పడుతుండటంతో ప్రజలు కొనుగోళ్లకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమాల్లో జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల్లో కొనుగోలు దారులతో సందడి నెలకొంది. కొనుగోలు దారులను ఆకర్షించేందుకు షాపింగ్‌మాల్స్, దుకాణాదారులు పలు రకాల ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తూ కొనుగోలు దారులను ఆకట్టుకుంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అధిక మొత్తంలో తగ్గింపులను అందింస్తూ కస్టమర్ దేవుళ్లను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఎక్కడా కూడా కొనుగోలుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా దుకాణాదారులు తగు చర్యలు చేపడుతున్నారు. కొవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు కొనుగోలుదారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తమకు అవసరమున్న వస్తువులను కొనుగోలు చేస్తూ పండుగ అవసరాలను సమకూర్చుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యాప్తగా కొనుగోలుదారులతో దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లలో పండుగ సందడి మొదలైంది.
పెరిగిన జనసందోహం..
కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో ఆరు నెలలుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు ప్రస్తుతం దసరా పండుగ కారణంగా భయాన్ని వీడి బయటకు అడుగుపెట్టారు. దుకాణాల్లో ఎక్కడ చూసినా కొనుగోలుదారులతో సందడి నెలకొన్నది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పూర్తిగా కొనుగోలుదారుల వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుంది.
ఆఫర్లతో ఆకట్టుకుంటున్న దుకాణాదారులు..
దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని దుకాణాదారులు కొనుగోలుదారులకు పలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నారు. పలు కొనుగోళ్లపై డిస్కౌంట్‌ను ప్రకటిస్తూ కొనుగోళ్లపై ఆసక్తిని పెంపొందిస్తున్నారు. పలువురు వ్యాపారులు ఒకడుగు ముందుకేసి పలు కొనుగోళ్లను చౌక ధరలకు విక్రయిస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పండుగ సందర్భంగా అందించే పలు ఆఫర్లను అందిపుచ్చుకునేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు.
కొవిడ్ నిబంధనలతో కొనుగోళ్లు..
కరోనా నేపథ్యంలో ప్రజలు గత ఆరు, ఏడు నెలలుగా ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఈక్రమంలో దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రతిఒక్కరూ కొత్తబట్టలు కొనుక్కోవాలనే ఆలోచనలతో కొనుగోళ్లకు సై అంటున్నారు. కొనుగోళ్ల సమయంలో ప్రజలు కొవిడ్-19 నిబంధనలను పాటించాలి.
తాజావార్తలు
- మోదీకి కొవాగ్జిన్.. కొవిషీల్డ్ సామర్థ్యంపై ఒవైసీ అనుమానం
- ఒప్పో ఫైండ్ ఎక్స్3 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్!
- సీతారాముల కల్యాణానికి హాజరైన మంత్రి ఎర్రబెల్లి
- విద్యార్థులతో కలిసి రాహుల్‌గాంధీ పుష్ అప్స్, డ్యాన్స్.. వీడియోలు
- నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా ? రేప్ కేసులో సుప్రీం ప్రశ్న
- కొవిడ్ -19 వ్యాక్సినేషన్లో మోదీజీ చొరవ : డాక్టర్ హర్షవర్ధన్
- మెసేజ్ పెట్టడానికి, కాల్ చేసేందుకు ఎవరూ లేరు
- ‘బీజేపీ నాయకులు కేంద్రాన్ని నిలదీయాలి’
- 70 ఏళ్లున్న నాకెందుకు టీకా.. ముందు యువతకు ఇవ్వండి!
- చెన్నైలో వ్యాక్సిన్ తీసుకున్న వెంకయ్యనాయుడు