శనివారం 05 డిసెంబర్ 2020
Yadadri - Oct 22, 2020 , 00:06:40

ఆఖరి అవకాశం

ఆఖరి అవకాశం

  • సాదాబైనామాల క్రమబద్ధీకరణకు సర్కారు సదావకాశం  
  • దరఖాస్తుకు నెలాఖరు వరకు గడువు  
  • 2014 జూన్‌ 2కు ముందు జరిగిన ఒప్పందాలకు మాత్రమే క్రమబద్ధీకరణ
  • హెచ్‌ఎండీఏ పరిధిలో భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, పోచంపల్లి మండలాలకు ప్రత్యేక అనుమతి
  • ఐదెకరాల్లోపు భూములకు ఉచితం 
  • ఆపైన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లించాలి 
  • మార్గదర్శకాలు విడుదల 

భూముల క్రయవిక్రయాలు జరుపుకొని తెల్లకాగితాలపై రాసుకున్న సాదాబైనామాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఆఖరి అవకాశం కల్పించింది. ఈనెల 31లోపు రెగ్యులైజేషన్‌ చేసుకోవాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. పట్టణాల్లో కాకుండా, గ్రామాల్లో జరిగిన సాదాబైనామాలకే ఈ అవకాశం ఇచ్చింది. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్నప్పటికీ రెవెన్యూశాఖ మినహాయింపు జాబితాలో ఉన్న గ్రామాల్లోని భూములకు మాత్రం ప్రత్యేక అనుమతులిచ్చింది. జిల్లాలో భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి మండలాల్లోని సాదాబైనామాలు కూడా క్రమబద్ధీకరణకు నోచుకోనున్నాయి. 2016లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అనుమతివ్వగా, ఇప్పుడు మళ్లీ మరో అవకాశమిచ్చింది. ఐదెకరాల్లోపు భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఆ పైన వాటికి మాత్రం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భూమి ఆధీనంలో ఉన్నవారికే హక్కులు కల్పిస్తారు. వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది పరిశీలించి ఒప్పందం వాస్తవమా..కాదా..? తేల్చిన తర్వాత పట్టాలు అందజేస్తారు.  

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : భూముల క్రయవిక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు పట్టాభిషేకం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పట్టణాల్లో  కాకుండా.. గ్రామాల్లో జరిగిన సాదాబైనామాలకే ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.  2016 సంవత్సరంలో ఒకసారి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం చివరిసారిగా తాజాగా.. మరో అవకాశాన్ని కల్పించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. ఐదెకరాల్లోపు భూములను ఉచితంగా క్రమబద్ధీకరించడంతోపాటు.. భూమి ఆధీనంలో ఉన్నవారికే హక్కులు కల్పించనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చివరిసారిగా ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని అధికారులు కోరుతున్నారు. 

మరోసారి అవకాశం

తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరిపి వివిధ కారణాలతో చాలామంది రిజిస్ట్రేషన్లు చేసుకోలేకపోయారు. దీంతో పట్టాలు పొందలేక పెట్టుబడి సాయం.. రైతు బంధు వంటి ప్రభుత్వ పరమైన పథకాలను అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో సాదాబైనామా పేరుతో కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. తెలంగాణ  ఏర్పడక ముందు జరిగిన లావాదేవీలను సాదాబైనామా కింద క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించగా.. జిల్లాలో చాలామంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కొన్నింటికి పట్టాలు అందజేయగా.. వివిధ కారణాలతో కొన్ని దరఖాస్తులను తిరస్కరించింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తాజాగా మరోసారి అవకాశం కల్పించింది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. భూమి ఆధీనంలో ఉన్నవారికే(కబ్జాదారు) హక్కులు కల్పించనున్నారు. తహసీల్దార్‌ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా ఒప్పందం వాస్తవమో!. కాదో!. తేల్చుతారు. ఆ తర్వాత వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం వారికి పట్టాలు అందజేయనున్నది.

ఐదు మండలాలకు ప్రత్యేక అవకాశం 

గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మాత్ర మే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో హైదరాబాద్‌ మహా నగరపాలక అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)తోపాటు పలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న గ్రామాల్లో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని భువనగిరి, బీబీనగర్‌, బొమ్మలరామారం, చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి మండలాలకు చెందిన పలు గ్రామాల్లో సాదాబైనామాలకు ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా మండలాల్లోని దరఖాస్తుదారులకు గొప్ప ఊరట లభిస్తోంది. 

తాజా మార్గదర్శకాలివి..

2014 జూన్‌ 2 నాటికి తెల్లకాగితంపై జరిగిన ఒప్పందాలకు మాత్రమే క్రమబద్ధీకరణ చేయనున్నారు. ఐదు ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన భూములను ఉచితంగా క్రమబద్ధీకరించనుండగా..5 ఎకరాలు దాటితే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు విధిగా చెల్లించాలి. దరఖాస్తుల స్వీకరణంతా మీ సేవ కేంద్రాల ద్వారానే నిర్వహించాలి. ఇక దరఖాస్తుకు ఆధార్‌కార్డు కాపీ, సాదాబైనామా జత చేయాలి. కొనుగోలుదారుడు, విక్రయదారుడి వద్ద పట్టాదారు పాసుపుస్తకం ఉంటే తిరిగి ఇవ్వాలి. సాదాబైనామాపై ఒప్పందం చేసుకున్నట్లు చూపించే ఏ ఆధారమైనా పొందుపర్చవచ్చు. మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం.. భూ దస్ర్తాలన్నీ ఆన్‌లైన్‌లోకి తెస్తున్న నేపథ్యంలో ఇకముందు సాదాబైనామాలకు అనుమతి ఉండదని, ఇదే చివరి అవకాశమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో మీ సేవలో దరఖాస్తు చేసుకోగానే ఫీజు చెల్లింపుతోపాటు రసీదును తీసుకోవాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.