శనివారం 05 డిసెంబర్ 2020
Yadadri - Oct 22, 2020 , 00:06:43

నారసింహుడి సేవలో కేకే, నేతి

నారసింహుడి సేవలో కేకే, నేతి

  • స్వామివారిని దర్శించుకున్న ఎంపీ, మండలి డిప్యూటీ చైర్మన్‌ 
  • అద్భుత శిల్పకళా క్షేత్రంగా యాదాద్రి 
  • సీఎం కేసీఆర్‌ చొరవతోనే ఆలయానికి ఖ్యాతి అని ప్రశంస 
  • శ్రీవారి ఖజానాకు రూ. 2,36,883 ఆదాయం

ఆలేరు: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం నిత్యపూజల కోలాహలం నెలకొన్నది. వేకువజామున బాలాలయంలోని కవచమూర్తులకు ఆరాధనలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించారు. తులసిదళాలతో అర్చనలు చేశారు. స్వామివారి బాలాలయంలో లక్ష్మీనరసింహుడిని మనోహరంగా అలంకరించి సుదర్శన హోమం, కల్యాణం, అలంకార సేవోత్సవాలతో పాటు అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు కొనసాగాయి. మంటపంలో అష్టోత్తర పూజలు జరిగాయి.  కొండపైన ఉన్న శివాలయంలో శైవ సంప్రదాయంగా నిత్యారాధనలు కనులపండువగా నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు. రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు నివేదన, శయనోత్సవం జరిపించారు.  

బాలశివాలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు..

దసరా దేవీనవరాత్రి ఉత్సవాలు యాదాద్రిలోని బాలశివాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం ప్రాతఃకాల పూజ, అర్చన పారాయణాలు, గాయత్రీజపం, సహస్రనామార్చన, మధ్యాహ్నం పూజ, సాయంత్రం 6.30 గంటల నుంచి నవావరణపూజ, మంత్ర పుష్పములు, తీర్థప్రసాదాల వినియోగం చేపట్టారు. 

శ్రీవారి ఖజానాకు రూ. 2,36,883 ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 2,36,883 సమకూరినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుక్కింగ్‌ ద్వారా రూ.12,130, దర్శనాల (రూ. 100)  ద్వారా రూ. 6,700, ప్రచారశాఖ ద్వారా రూ. 1,900, వ్రతాల ద్వారా రూ. 10,000, కల్యాణకట్ట ద్వారా  రూ. 6,780, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 1,41,250, శాశ్వత పూజల ద్వారా రూ. 20,232, మినీ బస్సుల ద్వారా రూ. 1,110, టోల్‌గేట్‌ ద్వారా రూ. 800, వాహనపూజల ద్వారా రూ. 4,500, ఇతర విభాగాల ద్వారా రూ. 31,481లతో కలిపి మొత్తం 2,36, 883  సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.  

నారసింహుడి సేవలో కేకే,  నేతి

అద్భుత శిల్పకళా దేవతామూర్తుల క్షేత్రంగా యాదాద్రి రూపు దిద్దుకుంటోందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ కే. కేశవరావు అన్నారు. హైదరాబాద్‌ నగరానికి దగ్గరలో ఉన్న  యాదాద్రి క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన ముద్రతో తీర్చిదిద్దుతున్నారన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు  అందజేశారు. ఆలయ నిర్మాణ పనులపై ఆర్డీవో భూపాల్‌రెడ్డిని అడిగి తెలుసున్నారు. అనంతరం  నిర్మాణ పనులను వారు పరిశీలించారు.   ఈ సందర్భంగా  మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతోనే  ఆలయాలకు పూర్వవైభవం సంతరించుకుందన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో సీఎం  తీసుకుంటున్న నిర్ణయాలకు దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. అనంతరం మున్నురు కాపు నిత్యాన్నదాన సత్రంలో జరిగిన లక్ష్మీ సుదర్శన చండీ హోమంలో వారు పాల్గొన్నారు. వారి వెంట ఎమ్మెల్సీ ఆకుల లలిత ఉన్నారు.