బుధవారం 02 డిసెంబర్ 2020
Yadadri - Oct 22, 2020 , 00:06:48

‘మాస్కే కవచం’

‘మాస్కే కవచం’

  • ప్రచారాన్ని ముమ్మరం చేయాలి  
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ 

భువనగిరి కలెక్టరేట్‌: కొవిడ్‌ -19 సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించే విధంగా జిల్లా వ్యాప్తంగా ‘మాస్కే కవచం’  ప్రచారాన్ని ముమ్మరం చేయాలని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ సూచించారు. బుధవారం  కలేక్టరేట్‌లో మాస్క్‌లు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వీడియోలు, పోస్టర్లను  ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజుల పాటు ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు యునిసెఫ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. పోస్టర్స్‌, హోర్డింగ్స్‌ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యునిసెఫ్‌ రూపొందించిన మాస్కే కవచం వీడియోను సోషల్‌ మీడియాలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేబుల్‌ టీవీల ద్వారా టెలికాస్ట్‌ అయ్యే విధంగా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించి సెల్ఫీ తీసుకునే విధంగా మాస్కే కవచంపై ఆన్‌లైన్‌ ద్వారా పోటీలు ఏర్పాటు చేసి అవార్డులు అందించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఏరియాలో మాస్క్‌ ధరించని వారికి మాస్క్‌లు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మాస్కే కవచం నోడల్‌ అధికారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌, డిప్యూటీ కలెక్టర్‌ విజయలక్ష్మి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, డీఈవో చైతన్యజైని, డీఎంహెచ్‌వో సాంబశివరావు, యునిసెఫ్‌ అధికారులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.