పోలీస్ అమరులకు సెల్యూట్

- ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యం
- ఆపదొచ్చినా, కష్టమొచ్చినా తొలుత స్పందించేది వారే..
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం..పోలీస్ ఫ్లాగ్‌డేగా మార్పు
- 10 రోజులపాటు కొనసాగనున్న వివిధ కార్యక్రమాలు
- రేపు ఆన్లైన్లో ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు
- జిల్లాలో 12 మంది పోలీసు అమరవీరులు
- ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ హతం
భువనగిరి క్రైం/ఆలేరు టౌన్ : మనకు ఎలాంటి ఆపదొచ్చినా, కష్టమొచ్చినా టక్కున గుర్తుకొచ్చేది పోలీసులే. శాంతిభద్రతే ధ్యేయంగా విధినిర్వహణలో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఎన్నో సమస్యలు, సవాళ్లు, తీవ్ర ఒత్తిళ్లను కూడా ఎదుర్కొంటారు. వీటన్నింటినీ అధిగమిస్తూ ప్రజా రక్షణే లక్ష్యంగా పనిచేస్తుంటారు. విధి నిర్వహణలో కరుకుగా కనిపిస్తున్నా అంతిమంగా శాంతి భద్రతలే వారి ధ్యేయం. నక్సలైట్లు,ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు పోయిన పోలీసులున్నారు. ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ పోలీసులే కీలకంగా పనిచేస్తుంటారు. వేర్వేరు ఘటనల్లో జిల్లా లో 12 మంది పోలీసులు అమరులయ్యారు. వీరి సేవలను స్మరించుకుంటూ ప్రతియేటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తుండగా, ఈ ఏడాది నుంచి పోలీసు ఫ్లాగ్‌డేగా మార్పు చేశారు. అమరుల సేవలను గుర్తుచేసుకుంటూ వారి కుటుంబాలను సన్మానిస్తారు. ఫ్లాగ్‌డేలో భాగంగా ఈనెల 21 నుంచి 31 వరకు పరేడ్ నిర్వహణ, ఓపెన్ హౌజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.
ఇవే కాకుండా...
అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ శాఖ షార్ట్ ఫిల్మ్‌లు, ఫొటోగ్రఫీ పోటీలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నందున ఆసక్తి కలిగిన వారు మూడు నిమిషాలపాటు పోలీసుల సేవలు, త్యాగాలు కనిపించేలా తాజాగా రూపొందించిన చిత్రాలు, ఫొటోలు సేకరించనున్నారు. షార్ట్ ఫిల్మ్‌లు, ఫొటోలు తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్సైట్, నల్లగొండ పోలీస్ వెబ్సైట్లో ఈనెల 30లోగా అప్లోడ్ చేయాలి. ఎంపికైన ఫొటోలు, షార్ట్‌ఫిల్మ్‌లు రాష్ట్ర స్థాయికి పంపిస్తారు. విజేతలుగా నిలిచిన వారికి, పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తారు. అదేవిధంగా 21 నుంచి 26 వరకు పోలీస్ అధికారులకు పోలీస్‌స్టేషన్, సబ్‌డివిజన్, జిల్లాస్థాయిలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు. కరోనా కారణంగా పెయింటింగ్, డిబేట్లాంటి పోటీలను రద్దు చేశారు. వ్యాస రచనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యాసాన్ని రాష్ట్ర పోలీస్ అధికారిక ఫేస్బుక్లో పోస్టు చేస్తారు.
పోలీసు అమరవీరుల వారోత్సవాలకు ఈ ఏడాది నుంచి పేరు మార్పు..
ప్రతి ఏడాది పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఈ సంవత్సరం నుంచి పేరు మార్పు చేసి ‘పోలీస్ ఫ్లాగ్ డే’గా నిర్వహించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అదేవిధంగా ప్రతియేటా అక్టోబర్ 15 నుంచి 21వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను 21నుంచి 31వ తేదీ వరకు నిర్వహించేలా మార్పులు చేశారు. జాతీయ ఫ్లాగ్‌డే సందర్భంగా తొలిరోజు కరపత్రాలు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.
21న జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఫ్లాగ్‌డే పరేడ్ నిర్వహణ
22న ఓపెన్ హౌస్ కార్యక్రమం.. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఆన్లైన్లో నిర్వహణ 21 నుంచి 28 వరకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు కొవిడ్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల పాత్ర అనే అంశంపై ఆన్లైన్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేత 22-25 వరకు గాయపడిన, మృతి చెందిన పోలీసు కుటుంబాల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించడం.. యోగ క్షేమాలు, వారి సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం.
27న రక్తదాన శిబిరాలు
27, 28న పోలీస్‌స్టేషన్ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించేలా కృషి. ఉమ్మడి జిల్లాలో 29 మంది అమరులు..
పోలీస్ అమరులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తోంది. అమరవీరుల కుటుంబాలకు రావాల్సిన పెండింగ్ డబ్బులు ఎప్పటికప్పుడు అందజేస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29మంది అమరులకుగాను నల్లగొండ జిల్లాలో 13 మంది ఉన్నారు. వారికి గత ప్రభుత్వాలు కొద్దిపాటి సాయం అందించి చేతులు దులుపుకోగా, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి జీవనోపాధి కల్పించింది. భువనగిరి, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో 1991 నుంచి ఇప్పటి వరకు మొత్తం 29 మంది పోలీసులు విధి నిర్వహణలో చనిపోయారు. వీరిలో నలుగురు ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఐదుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు, 11 మంది సివిల్ కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు.
అమరుల త్యాగాలు వృథా కానివ్వం విధి
నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరుల త్యాగాలను వృథా కానివ్వం. వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎప్పటికి అండగా ఉంటుంది. ప్రజల భద్రతే లక్ష్యంగా వారు చేసిన సేవలను ఎప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉంటాం. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మన బాధ్యత.
- కే.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్
ఉగ్రవాదుల కాల్పులు, నక్సలైట్ల దాడులు
జిల్లాలో ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఐదుగురు పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారు. 2006 ఆగస్టు 18న నక్సలైట్లు పోలీస్‌స్టేషన్‌పై బకిట్ బాంబుతో దాడి చేయగా, ఎస్ఐ చాంద్‌పాషా, ఏఎస్ఐ మహ్మద్సుల్తాన్ మోహినుద్దీన్, హోంగార్డు ఇంజమూరి లింగయ్యలు మృతి చెందారు.
జిల్లాలో 12 మంది పోలీసుల వీరమరణం
యాదాద్రి భువనగిరి జిల్లాలో విధి నిర్వహణలో 12 మంది పోలీసులు పలు సందర్భాల్లో వీరమరణం పొందారు. నక్సలైట్ల దాడులు, సిమీ ఉగ్రవాదుల దాడులతో జరిగిన పోరాటంలో మరణించారు.
ఉగ్రవాద దాడులు
2015 ఏప్రిల్ 4న మోత్కూరు మండలం జానకీపురం వద్ద సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో ఆత్మకూరు(ఎం) ఎస్ఐ సిద్ధయ్య, కానిస్టేబుల్ సీహెచ్.నాగరాజు మృతి చెందారు. సూర్యాపేటలో సీఐ మొగిలయ్యతోపాటు మరో కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపిన అనంతరం సిమీ ఉగ్రవాదులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అర్వపల్లి నుంచి మోత్కూరు మండలం జానకీపురం బిక్కేరు వాగు ప్రాంతంలోకి చొరబడ్డారు. వీరిని పట్టుకునే ప్రయత్నంలో జరిగిన ఎన్కౌంటర్లో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులపై కాల్పులు జరిపిన ఎస్ఐ సిద్ధయ్య ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో నాలుగు రోజులు పోరాటం చేసి 07-04-2015న మృతి చెందాడు. దీంతోపాటు తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరుతోపాటు ఆయా పోలీస్స్టేషన్లపై నక్సల్స్ దాడులు జరిగాయి.
తాజావార్తలు
- అతివేగం.. మద్యం మత్తు
- ఓటీపీలు తెలుసుకొని ఖాతా ఖాళీ
- ఒకరి పాన్‌కార్డుపై మరొకరికి రుణం
- భక్తజన జాతర
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..