సోమవారం 01 మార్చి 2021
Yadadri - Oct 21, 2020 , 01:58:19

వదలని వాన

 వదలని వాన

  • జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు 
  • నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు.. ఇండ్లు, దుకాణాల్లోకి నీళ్లు 
  • చెరువులు, కుంటల్లోకి భారీ వరద.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు 
  • కల్లాలు, మార్కెట్‌యార్డుల వద్ద తడిసిన ధాన్యం పత్తి, మిరపకు అపారనష్టం 

భువనగిరి అర్బన్‌: భువనగిరి పట్టణంలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 7.10 వరకు వర్షం కురిసింది. దీంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్‌ను నిలిపివేశారు.

చౌటుప్పల్‌లో...

చౌటుప్పల్‌ : నిన్న మొన్న కురిసిన వర్షాలకు చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలో వరద నీరు ఉధృతంగా పారుతుంది. గత మూడు నాలుగు రోజులుగా వర్షం కురువడంతో చౌటుప్పల్‌, లక్కారం చెరువులు నిండుకొని అలుగుపోశాయి. దీంతో ఆదివారం వరకు వరద నీరు పెద్దఎత్తున ప్రవహించింది. సోమవారం ఉదయం కాస్త తగ్గుముఖం పట్టిన వరద.. రాత్రి కురిసిన వర్షానికి మంగళవారం తిరిగి వరద నీరు ఉధృతంగా పారుతుంది. లక్కారం సమీపంలోని గుట్టలు తిరిగి జాలుపారడంతో వరద నీరు పెద్ద ఎత్తున వస్తుంది. దీంతో చౌటుప్పల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి, బస్టాండ్‌, చిన్నకొండూరుకు వెళ్లే సర్వీస్‌ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో వరద నీరు పెద్దఎత్తున పారుతుంది. బస్టాండ్‌తోపాటు గాంధీపార్క్‌ నీట మునిగాయి. ఇంకా లోతట్టు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. 

మోటకొండూర్‌లో... 

మోటకొండూర్‌: మండలంలో మంగళవారం మోస్తారు వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాగులు, వంకల్లో వర్షపు నీరు ప్రవహిస్తున్నది.  

గుండాలలో... 

గుండాల: మండల వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో బిక్కేరువాగులో వరద ఉధృతి పెరిగింది. పలు గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరింది. వర్షంతో పత్తి, మిరప పంట నీటి మునిగి రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఆయా గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

ఆత్మకూరు(ఎం)లో..

ఆత్మకూరు(ఎం): మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన ధాన్యం మళ్లీ తడిసిపోయింది. మండలంలోని వివిధ గ్రామాల్లోని బిక్కేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతోపాటు చెరువులు అలుగు పోస్తున్నాయి. వర్షంతో వరి, పత్తి పంటలు తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

VIDEOS

logo