గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Oct 18, 2020 , 00:51:03

దసరాకు ధరణి ప్రారంభం

దసరాకు ధరణి ప్రారంభం

దానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

నల్లగొండ : దసరా రోజున ధరణి పోర్టల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. రైతులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విలువలను మరింత చేరువ చేసేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతికంగా అభివృద్ధి పరిచిన ఈ సాఫ్ట్‌ వేర్‌ పారదర్శక, సులభతర ధరణి ప్రాజెక్టు దేశంలోనే ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవనున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధరణి ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియతో భూ రికార్డులను పకడ్బందీగా చేపట్టవచ్చన్నారు. అన్ని మండలాల తహసీల్దార్లు ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలన్నారు. కలెక్టర్లు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి తప్పులు జరగకుండా ముందస్తుగా తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో కంప్యూటర్‌, సీసీటీవీ, కెమెరా, స్కానర్‌, ప్రింటర్‌, బ్రాడ్‌ బ్రాండ్‌ సర్వీసులు అన్నింటినీ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ  సందర్భంగా ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ విధానంపై సుదీర్ఘంగా వివరించారు. అనంతరం నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటకే ధరణి పోర్టల్‌ను ప్రారంభించేందకు ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, ఆర్డీవోలు జగదీశ్వర్‌రెడ్డి, రోహిత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు ముందస్తు శిక్షణ ఇవ్వాలి

భువనగిరి కలెక్టరేట్‌ : ‘ధరణి’ వెబ్‌సైట్‌, సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా అందిన అప్లికేషన్స్‌ ప్రాసెస్‌ చేసేందుకు ముందస్తుగా తహసీల్దార్లకు, నాయబ్‌ తహసీల్దార్లకు శిక్షణ ఇప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌, ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ధరణి’ వెబ్‌సైట్‌ ద్వారా మండలాల వారీగా, సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా అందిన అప్లికేషన్లు ప్రాసెస్‌ చేసేందుకు తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్లకు ముందస్తుగా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, కీమ్యానాయక్‌, ట్రైనీ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, ఆర్డీవోలు సూరజ్‌కుమార్‌, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo