సోమవారం 30 నవంబర్ 2020
Yadadri - Oct 18, 2020 , 00:51:02

ఉద్యాన పంట.. రక్షించేదిట్లా..

ఉద్యాన పంట.. రక్షించేదిట్లా..

వర్షం కారణంగా పడిన మొక్కలను నిలబెట్టాలి

మొదళ్ల వద్ద నీరులేకుండా చూసుకోవాలి

తగిన మోతాదులో ఎరువులు వేయాలి

అవసరాన్ని బట్టి సూక్ష్మపోషకాలను పిచికారీ చేయాలి

రైతులకు కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త నరేశ్‌ సలహాలు

గరిడేపల్లి : అధిక వర్షాల వల్ల రైతులు సాగుచేసే ఉద్యాన పంటల్లో నీటి ముంపు, పోషకాలు కోల్పోవడం, మొలక శాతం తగ్గడం, విత్తనం కుళ్లిపోవడం, సేద్యపు పనుల్లో ఆలస్యం, కలుపు బెడద, పరాగ సంపర్కం తగ్గడం, చీడపీడల బెడద పెరుగుతుంది. దీంతో పంటలకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉద్యాన వన పంటల్లో సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే మొక్కలు సక్రమంగా పెరుగడంతో పాటు ఆశించిన దిగుబడులను పొందవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఉద్యాన పంటలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చేపట్టాల్సిన సేద్యపు పనుల గురించి గడ్డిపల్లి కేవీకే ఉద్యానవన శాస్త్రవేత్త సీహెచ్‌.నరేశ్‌ తెలిపారు. అదనపు సమాచారం కోసం 9603268682 నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా సూచించారు. ఉద్యాన వన పంటల్లో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఆయన తెలిపిన వివరాలు..

జిల్లాలో ఎక్కువగా మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు.

మామిడి.. 

ఒరిగిన లేదా పడిపోయిన చిన్న మొక్కలను లేపి మట్టిని ఎగదోయాలి.

విరిగిన కొమ్మలను కత్తిరించి పై భాగాన బోర్డాక్స్‌ పేస్ట్‌ లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ను పూతగా రాయాలి. చెట్ల మధ్య దున్ని తేమ ఆవిరయ్యేలా చూడాలి.

ఒక్కో చెట్టుకు 500 గ్రా. యూరియా, 417 గ్రా. మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 25 కేజీల పశువుల ఎరువు వేయాలి.

వేర్లను తెగుళ్ల నుంచి కాపాడేందుకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మూడు గ్రా. లీటర్‌ నీటికి కలిపి మొదళ్ల దగ్గర తడపాలి. 

చెట్లు త్వరగా కోలుకోవడానికి పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా., బోరాక్స్‌ 1.25 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

బత్తాయి, నిమ్మ

తోటల్లో నిలిచిన నీటిని తీసివేసి వేరు వ్యవస్థకు ఎండ తగిలేలా చేయాలి.

పడిపోయిన మొక్కలను యథాస్థితికి తెచ్చి ఊతమిచ్చి కట్టాలి. బయటకు వచ్చిన వేళ్లపై మట్టిని కప్పి గట్టిగా అదమాలి.

విరిగిన కొమ్మలను కత్తిరించి పై భాగాన బోర్డాక్స్‌ పోయాలి.

8 సంవత్సరాలు పైబడిన కాపునిస్తున్న తోటల్లో చెట్లకు 500 గ్రా. యూరియా, 750 గ్రా. పొటాష్‌ వేసుకోవాలి.

మొదళ్ల దగ్గర 1 శాతం బోరాక్స్‌ మిశ్రమం లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మూడు గ్రా. లీటర్‌ నీటికి కలిపి పోయాలి.

బెంజైల్‌ అడినైన్‌ 50 పీపీఎం పిచికారీ చేయాలి. దీంతో పత్ర రంధ్రాలు తెరుచుకుని భాష్పోత్సేకం అధికమై నేలలోని  తేమను నివారించవచ్చు.

జామ..

అధిక నీటిని తీసివేసి గొర్రుతో దున్నకం చేపట్టి తేలికగా చెట్టు చుట్టూ తవ్వి పాదులు తయారు చేసుకోవాలి.

మొదళ్ల దగ్గర కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మూడు గ్రా. లీటర్‌ నీటికి కలిపి పోయాలి.

పొటాషియం నైట్రేట్‌ 10 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

జామలో వడ తెగులు నివారణకు ట్రైకోడెర్మా విరిడే మిశ్రమాన్ని 30 కిలోల పశువుల ఎరువు+ 4 కిలోల వేపపిండి+ 500 గ్రా. ట్రైకోడెర్మా విరిడే ఒక్కో చెట్టుకు వేయాలి.

కార్బండిజమ్‌ ఒక గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి

బొప్పాయి..

మొక్క మొదళ్ల దగ్గర నిలిచిన నీటిని తీసివేయాలి  

మెటాలాక్సిల్‌ ఎంజడ్‌ మూడు గ్రా. లేదా కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మూడు గ్రా. ఒక లీటర్‌ నీటికి కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. 

సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని ఐదు గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయల పంటల్లో..

అధిక వర్షాల వల్ల వివిధ కూరగాయల పంటల్లో నష్టాలు.. 

టమాట : మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత రాలడం, ఎండు తెగుళ్లు, ఆకుపచ్చ తెగుళ్లు ఆశిస్తాయి.

వంగ : ఆకు పసుపుబారడం, పూత రాలడం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు వస్తాయి. 

మిరప : నారుకుళ్లు, ఎండు తెగుళ్లు, ఆకుమచ్చ తెగుళ్లు, కోయనో ఫోరా తెగుళ్లు ఆశిస్తాయి. 

తీగజాతి కూరగాయలు : ఆకులు పసుపుబారడం, బూజు తెగుళ్లు, బూడిద తెగుళ్లు వస్తాయి.

దుంపజాతి కూరగాయలు : అధిక శాఖీయోత్పత్తి, దుంపకుళ్లు ఆశిస్తాయి. 

నివారణ చర్యలు

పంటపై 19:19:19 లేదా 13:0:45 వంటి పోషకాలను పిచికారీ చేయాలి.

అవసరాన్ని బట్టి సూక్ష్మపోషకాలను కూడా పిచికారీ చేయాలి.

నేల కొంచెం ఆరిన తర్వాత రసాయనిక ఎరువులను  తగిన మోతాదులో వేసుకోవాలి.

వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసి కలుపును తొలగించుకుని నేలను త్వరగా ఆరేలా చేసుకోవాలి. 

పందిళ్లపై తీగజాతి కూరగాయలను సాగు చేసుకోవాలి.

ఆకు తినే పొగాకు లద్దె పురుగు నివారణకు విషపు ఎరలను ఉపయోగించాలి

అక్షింతల పురుగు, చిత్తపురుగు నివారణకు వర్షాలు ఆగిన వెంటనే క్లోరోఫైరిఫాస్‌ 2 మి.లీలు లేదా థయోడికార్ప్‌ 1 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఎండు తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మూడు గ్రా. లేదా మెటాలాక్సిల్‌ + మాంకోజెబ్‌ 2 గ్రా. లీటర్‌ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.

ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కార్బండిజమ్‌ ఒక గ్రా. లేదా మాంకోజెబ్‌ 2.5 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

బూజు తెగుళ్ల నివారణకు డైమిథోమార్ప్‌ 1.5 గ్రా. లేదా మోక్లోబుటానిల్‌ 0.4 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

బ్యాక్టీరియా మచ్చ తెగుళ్లు నివారణకు కాపర్‌ ఆక్సీ క్లోరైడ్‌ మూడు గ్రా., ప్లాంటో మైసీన్‌ 0.2 గ్రా. లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

హార్మోన్‌ల వినియోగం

నీటి ముంపు సమయంలో జీఎ-3, బీఏపీ (బెంజైల్‌ అడినైన్‌ పురిన్‌) పిచికారీ చేసుకోవాలి

ఎన్‌ఏఏ 40 పీపీఎం పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా పూత, పిందె రాలడం అరికట్టబడుతుంది.

నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు సాలిసిక్‌ యాసిడ్‌ 100 పీపీఎం పిచికారీ చేసుకుని మొక్కల్లో నిల్వ ఉన్న పోషకాల వినియోగాన్ని పెంపొందించుకోవచ్చు.

బ్రాసినోలైడ్‌ 0.5 పీపీఎం పిచికారీ చేసుకొని కిరణ జన్య సంయోగక్రియను పెంపొందించుకోవచ్చు.