జల విలయం నుంచి తేరుకుంటున్న జనం

- l భారీగా ఆస్తి, పంటనష్టం
- l నేలకొరిగిన వరిపైర్లు, పత్తిచేన్లు చూసి బోరుమంటున్న రైతాంగం
- l తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న వైనం
- l దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు
- l శిబిరాల నుంచి ఇండ్లకు వరద బాధితులు
- l నష్టం అంచనాలో యంత్రాంగం నిమగ్నం
- l పంటలను పరిశీలించిన కలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్యే పైళ్ల
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వర్షాలు, వరదలతో చిరుగుటాకులా వణికిపోయిన జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. బుధవారం నుంచి వర్షం పడకపోవడంతో వరద ఉధృతి తగ్గుముఖం పట్టి క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కల్లాల వద్ద, ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం 47,808 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరదలు తగ్గితేగానీ నష్టం అంచనా వేయలేమని అధికారులు పేర్కొంటున్నారు. ఉప్పొంగిన వాగులు, వంకలు శాంతించడంతో గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రజలు సహాయ శిబిరాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారయంత్రాంగం పారిశుద్ధ్య నిర్వహణ చర్యలను చేపట్టింది.
జిల్లాలో వర్షాలు తెరిపివ్వడంతో అటు ప్రజానీకానికి, ఇటు రైతాంగానికి గొప్ప ఉపశమనం లభించింది. మంగళ, బుధవారాల్లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. మూసీ ప్రవాహం తగ్గి వాగులు, వంకలు శాంతించాయి. రహదారులపై వరద నీరు తొలిగిపోయి రాకపోకలు మెరుగవుతున్నాయి. హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారులపై ట్రాఫిక్ యథావిధిగా సాగుతోంది. బిక్కేరు, కొలనుపాక, శామీర్‌పేట, బీబీనగర్- పోచంపల్లి, తుర్కపల్లి - యాదగిరిగుట్ట, పోచంపల్లి- కొత్తగూడెం తదితర ప్రాంతాలలో వాగులు పొంగడంతో వివిధ మండలాల్లో అంతర్గత రవాణా స్తంభించింది. హైదరాబాద్, నల్లగొండ తదితర ప్రాంతాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని గ్రామాలను మినహాయిస్తే అన్ని ప్రాంతాలకు రాకపోకలు మొదలయ్యాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గురువారం పంట నష్టం వివరాలను సేకరించారు. వరి 25,100 ఎకరాల్లో, పత్తి 20,758 ఎకరాల్లో, కందులు 1,250 ఎకరాల్లో, ఇతర పంటలు 700 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. పత్తి చేళ్లలో ఇంకా నీళ్లు నిలిచి ఉండడంతో తడిసిన పత్తిని ఏరే పరిస్థితి లేకుండా పోయిం ది. పంటలు నీట మునిగి ఉండడంతో నష్టం అంచనా విలువ చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 132 వరకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్‌వైర్లు కూడా తెగిపోయాయి. చాలా ఆవాసాలు అంధకారంలోనే మగ్గుతుండగా విద్యుత్ పునరుద్ధరణకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 25 వరకు రహదారులు దెబ్బతినగా, 27 వరకు చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. వాటి మరమ్మతులకు అంచనాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండలాలతో పాటు పలు చోట్ల వరద బాధితులకు జిల్లా అధికారయంత్రాం గం పునరావాసం కల్పించగా.. వరదముప్పు లేకపోవడంతో తిరిగి బాధితులు తమ ఆవాసాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో చౌటుప్పల్ పోలీస్ శాఖ పునరావాస బాధితులకు ఆహారపొట్లాలను అందజేసింది. వరద తగ్గినా ఇళ్లు, వీధులు మట్టి, బురదతో నిండిపోయాయి. ఫలితంగా వ్యాధుల భయం పొంచి ఉంది. చెత్తాచెదారాన్ని తొలగించి, బ్లీచింగ్ పౌడర్, చల్లడం వంటి చర్యలను చేపడుతున్నారు.
ఎమ్మెల్యే, అధికారుల పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాలలో గురువారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటించారు. వలిగొండ మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. వరద నీటిలో కొట్టుకుపోయిన భువనగిరి పట్టణానికి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. వలిగొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ అనితారామచంద్రన్ వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు.